యాసంగి సాగుకు సిద్ధం.. అందుబాటులో ఎరువులు, విత్తనాలు

21 Oct, 2023 02:38 IST|Sakshi

వచ్చే నెలలో రైతుబంధు సాయం!

ఇప్పటికే 80 లక్షల ఎకరాల్లో వరిసాగు 

ఎన్నికల సమయంలోనే రైతుబంధు?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. గత సీజన్‌కంటే ఎక్కువగా పంటలు సాగు చేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధమైంది. దాదాపు 80 లక్షల ఎకరాల వరకు పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. అన్ని రకాల ఎరువులు కలిపి 18.64 లక్షల మెట్రిక్‌ టన్నులు కేటాయించగా, అందులో యూరియా 9.2 లక్షల మెట్రిక్‌ టన్నులు.

గత యాసంగి సీజన్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 33.53 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 56.44 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. అంటే 168 శాతం విస్తీర్ణంలో వరి సాగైంది. ఈసారి కూడా పెద్దఎత్తున వరి సాగవుతుందని అధికారులు అంటున్నారు. గత యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.63 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 6.48 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈసారి కూడా మొక్కజొన్న సాగు పెరుగుతుందని చెబుతున్నారు. అప్పుడు వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.02 లక్షల ఎకరాలు కాగా, కేవలం 2.42 లక్షల ఎకరాల్లోనే (80.17%) సాగైంది. ఈసారి వేరుశనగ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని రైతులకు చెబుతున్నారు.  
 

ఎన్నికల సమయంలోనే రైతుబంధు?
ఈ నెల ఒకటో తేదీ నుంచి యాసంగి సీజన్‌ ప్రారంభమైంది. రైతులు ఇప్పుడిప్పుడే పంటల సాగు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో రైతులకు రైతుబంధు సాయం కూడా ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. సీజన్‌ మొదలైన నేపథ్యంలో రైతులకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని అందించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. ఆ ప్రకారం వచ్చే నెలలో రైతుబంధు నిధులు పంపిణీ చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఎన్నికలు ఉన్నందున రైతుబంధు నిధుల పంపిణీ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు రైతులకు ఉన్నాయి.

అయితే ఇది ఎప్పటి నుంచో అమలవుతున్న కార్యక్రమం కాబట్టి ఎన్నికలకు, దీనికి సంబంధం ఉండదని వ్యవసాయశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే రైతుబంధు నిధులు విడుదలయ్యే సూచనలు ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, గత వానాకాలం సీజన్‌లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ. 7,625 కోట్లు రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు కూడా అంతేమొత్తంలో ఆ సొమ్ము అందుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 11 విడతల్లో రూ. 72,815 కోట్ల నిధులు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది.   

మరిన్ని వార్తలు