గుంటూరు వెస్ట్‌: ఇరుకునపడ్డ టీడీపీ.. అదే మైనస్‌గా మారిందా? | Sakshi
Sakshi News home page

గుంటూరు వెస్ట్‌: ఇరుకునపడ్డ టీడీపీ.. అదే మైనస్‌గా మారిందా?

Published Tue, Apr 9 2024 1:01 PM

Shock To Tdp In Guntur West - Sakshi

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయితే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడలకు చంద్రబాబు నాయుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ అభ్యర్థి ఎంపికలో తెలుగుదేశానికి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ సీటుకు విపరీతమైన పోటీ ఎదురైంది. మరోవైపు అధికార వైసీపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన మంత్రి విడదల రజనీ బరిలోకి దిగడంతో టీడీపీ ఇరుకున పడింది. 

ఈ నేపథ్యంలో ఇంతవరకు తెలుగుదేశం పార్టీని భుజాన మోసిన అందరినీ పక్కకి తోసేసి.. కొత్త అభ్యర్థిగా గల్లా మాధవిని తీసుకురావడంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీటన్నింటికి తోడు గల్లా మాధవి ఒంటెత్తు పోకడలు పార్టీకి చేటు తీసుకొస్తున్నాయి. అంతేకాదు సీనియర్లు కూడా దూరమైపోతున్నారు. వారితో పాటు క్యాడర్ కూడా వెళ్లిపోతోంది.

గల్లా మాధవి ఉన్నట్టుండి సడన్‌గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసరికి, ఆమెకు ఎవరేమిటో తెలీడం లేదు. హాయిగా ఏసీలో కూర్చుని పనిచేసే ఆమె మండుటెండలోకి వచ్చి, చుట్టూ గుమిగూడే జనం మధ్యలో ఇమడలేక పోతున్నారు. వీటన్నిటికి మించి విడదల రజనీ దూకుడు ముందు ఆమె పోటీ పడలేకపోతున్నారనే టాక్ అయితే జనంలోకి వెళ్లిపోయింది. అది ఆమెకు మైనస్‌గా మారింది. అంతేకాదు రాజకీయాల్లో రజనీ సీనియర్ అయ్యారు. మంత్రి అయ్యారు. రాజకీయాల్లో రెండు ఫేజ్‌లను చూశారు. వీటన్నిటి పరంగా గల్లా మాధవి సరైన అభ్యర్థి కాదనే అంటున్నారు.

కోవెలమూడి రవీంద్ర.. ప్రస్తుతం గుంటూరు వెస్ట్ ఇంచార్జిగా ఉన్నారు. ఆయన 2014, 2019లో కూడా టికెట్ ఆశించారు. చంద్రబాబు అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడూ ఇవ్వలేదు. దీంతో ఆయన రగలిపోతున్నారు. దాదాపు క్యాడర్ అంతా ఆయనవైపే ఉంది. వారి దగ్గర మీకు నచ్చినట్టు చేసుకోండి అని అంటున్నారని తెలిసింది.

హీరో బాలక్రష్ణ వీరాభిమాని మన్నవ మోహనకృష్ణ కూడా గుంటూరు వెస్ట్ సీటు ఆశించారు. రాకపోవడంతో బహిరంగంగానే అసంత్రప్తి వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు పిలిచి మాట్లాడారు. కానీ పని కాలేదని అంటున్నారు.

తాడిశెట్టి ఫ్యామిలీకి గుంటూరులో మంచి పట్టుంది. తాడిశెట్టి వెంకట్రావు, తాడిశెట్టి మురళీ మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు, సీటు రాదని గ్రహించి, చంద్రబాబు దగ్గర హామీ తీసుకుని తెలుగుదేశంలోకి వచ్చారు. తీరా వచ్చాక బాబు కూడా హ్యాండ్ ఇచ్చేసరికి రివర్స్ అయ్యారని అంటున్నారు. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన నేతగా ఉన్నారు. పొత్తులో భాగంగా గుంటూరు వెస్ట్ ఆశించారు. రాకపోవడంతో ఆయన సైడ్ అయిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ గా లేరు. 

ఉమ్మడి పొత్తులో భాగంగా బీజేపీ నుంచి ఆ పార్టీ నేత వల్లూరు జయప్రకాశ్ నారాయణ ఆశించారు. హడావుడిగా కార్యాలయం ఓపెన్ చేశారు. 18 రోజులు పాదయాత్ర చేశారు. ధూంధామ్ చేశారు. చివరికి సీటు టీడీపీకి వెళ్లిపోయింది. దీంతో ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసుకెళ్లి ధర్నాలు చేసినా ఫలితం రాలేదు. అప్పటి నుంచి బుద్ధిగా ఇంటిపట్టునే ఉంటున్నారు.

ఇలా ఇంతమంది తెలుగుదేశం నాయకులు వ్యతిరేకమైపోవడంతో గల్లామాధవి గెలవడం కష్టమేనని అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది విడదల రజనీ చరిష్మా ముందు ఈమె నిలవలేకపోతున్నారని అంటున్నారు. రాజకీయాల్లో తన మార్కు చూపించుకున్న విడదల రజనీని గెలవడం ఈ పరిస్థితుల్లో అంత ఈజీకాదని అంటున్నారు. తనకే విజయావకాశాలు ఉన్నాయని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదీ చదవండి: జగన్‌ ముందుకు.. అధఃపాతాళానికి చంద్రబాబు

Advertisement
Advertisement