టాటా మోటార్స్‌ ‘బ్రేక్స్‌’ ఫెయిలవ్వడానికి కారణాలేంటి?

Published on Sat, 02/09/2019 - 01:15

2008... ప్రపంచ ఆర్థిక సంక్షోభం దెబ్బతో దివాలా కోరల్లోకి జారుకున్న ఫోర్డ్‌ మోటార్స్‌ తన లగ్జరీ కార్ల బ్రాండ్‌ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌)ను అమ్మకానికి పెట్టింది. అప్పటివరకూ భారతీయ కార్పొరేట్లలో ఎవ్వరూ చేయనంత సాహసాన్ని టాటా గ్రూప్‌ అధిపతి రతన్‌టాటా చేశారు. పంతంపట్టి మరీ దాదాపు 2.3 బిలియన్‌ డాలర్లు(అప్పట్లో మన కరెనీప్రకారం రూ.9,300 కోట్లు) వెచ్చించి టాటా మోటార్స్‌ జేఎల్‌ఆర్‌ను సొంతం చేసుకుంది. అంతభారీ మొత్తం అవసరమా అన్నవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టేలా... జాగ్వార్‌పై టాటాలు లాభాల స్వారీ చేశారు. దేశీ వాహన మార్కెట్లో పోటీపడలేక ఆపసోపాలు పడుతున్న టాటామోటార్స్‌కు జేఎల్‌ఆర్‌ ఆతర్వాత కాలంలో నిజంగా కామధేనువే అయింది.

అంతర్జాతీయంగా అమ్మకాల్లో జేఎల్‌ఆర్‌ చిరుతలా దూసుకెడుతూ మాతృసంస్థను ఆదుకుంటూ వచ్చింది.  2019...  పదేళ్లు తిరిగేసరికి అంతా రివర్స్‌గేర్‌. ఒకప్పుడు సంస్థకు సంజీవనిలా పనిచేసిన అదే జేఎల్‌ఆర్‌... ఇప్పుడు మాతృ సంస్థను కనీవినీఎరుగని నష్టాల లోయలోకి తోసేసింది.  షేరు విలువ కూడా అంతకంతకూ పాతాళంలోకి జారిపోతూ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు టాటామోటార్స్‌ ‘బ్రేక్స్‌’ ఫెయిల్‌ అవడానికి దారితీసిన కారణాలేంటి? ఎందుకిలా తలకిందులైంది? భవిష్యత్తు ఏంటి?... వీటన్నింటిపై సాక్షి బిజినెస్‌ ప్రత్యేక కథనం ఇది...

సాక్షి, బిజినెస్‌ విభాగం
బస్సులు, ట్రక్కులు, మిలిటరీ వాహనాల నుంచి కార్ల దాకా అన్ని రకాల వాహనాల తయారీలోలో ఉన్న టాటా మోటార్స్‌.. దేశీ కార్పొరేట్‌ చరిత్రలోనే అత్యంత భారీ నష్టాలు ప్రకటించడం ఇప్పుడు అందరినీ నివ్వెరపరుస్తోంది. డిసెంబర్‌ త్రైమాసికంలో ఏకంగా రూ. 26,961 కోట్ల నష్టాన్ని ప్రకటించడంతో టాటా మోటార్స్‌ షేరు ఇంట్రాడేలో ఏకంగా 30% కుప్పకూలింది. ఒక్క రోజులోనే సంస్థ మార్కెట్‌ విలువ రూ. 9,000 కోట్ల పైచిలుకు హరించుకుపోయింది.  జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌)లో పెట్టుబడుల విలువను తగ్గించాల్సి రావడమే భారీ నష్టాలకు కారణంగా టాటా మోటార్స్‌ చెబుతోంది.

ఏడాది వ్యవధిలో టాటా మోటార్స్‌ మార్కెట్‌ విలువ ఏకంగా 62% పడిపోవడం కంపెనీ దారుణ పరిస్థితికి నిదర్శనం.ప్రస్తుతం టాటా మోటార్స్‌ అమ్మకాల్లో 70–75 శాతం దాకా, లాభాల్లో 90 శాతం దాకా వాటా జేఎల్‌ఆర్‌దే ఉంటోంది. అయితే, గడిచిన మూడు, నాలుగు త్రైమాసికాలుగా.. అమ్మకాలు మందగిస్తుండటం, లాభాల మార్జిన్లు తగ్గుతుండటం తదితర అంశాలు జేఎల్‌ఆర్‌ తీరుపై సందేహాలను రేకెత్తిస్తూనే ఉన్నాయి. 2016 ఆర్థిక సంవత్సరం దాకా రెండంకెల స్థాయి వృద్ధితో దూసుకెళ్లిన జేఎల్‌ఆర్‌ అమ్మకాలు ఆ తర్వాత నుంచి చాలా నెలల్లో సింగిల్‌ డిజిట్‌లోనే నమోదవుతూ వస్తున్నాయి. కొన్ని కీలకమైన లగ్జరీ మోడల్స్‌ను నిలిపివేసి కొత్త వాటితో భర్తీ చేస్తుండటం మొదలైన అంశాలు ఇందుకు కారణమంటూ కంపెనీ చెబుతున్నా.. అసలు కారణాలు ఇంకా వేరేవి చాలానే ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.

రాజుకున్న బ్రెగ్జిట్‌ కుంపటి...
జేఎల్‌ఆర్‌ రాజకీయ, భౌగోళిక అనిశ్చితితో పాటు టెక్నాలజీపరంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. బ్రెగ్జిట్‌పరమైన ఆందోళనలతో పాటు యూరప్‌లో డీజిల్‌ కార్లకు డిమాండ్‌ తగ్గుతుండటం, కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో అమ్మకాలు మందగిస్తుండటం, చైనా–అమెరికా మధ్య వాణిజ్య యుద్ధభయాలు మొదలైనవి జేఎల్‌ఆర్‌కు ప్రతికూలంగా ఉంటున్నాయి. జేఎల్‌ఆర్‌ అమ్మకాల్లో ఈ మూడు ప్రాంతాల వాటా సుమారు మూడో వంతు ఉంటుంది. మొత్తం జేఎల్‌ఆర్‌ విక్రయాల్లో చైనా మార్కెట్‌ వాటానే 24 శాతం పైగా ఉండేది. కానీ అక్కడ డిమాండ్‌ మందగిస్తుండటం సమస్యగా మారింది. చైనాలో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు 42% పడిపోయాయి.  సంపన్న మార్కెట్ల ఆర్థిక వ్యవస్థలు కూడా పలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో లగ్జరీ, డీజిల్‌ వాహన విక్రయాల మందగిస్తుండటం సైతం జేఎల్‌ఆర్‌కు ప్రతికూలంగా మారుతోంది.

 ఇక బ్రెగ్జిట్‌ వివాదంతో బ్రిటన్‌ నుంచి ఎగుమతి చేసే కార్లపై మిగతా యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో అధిక పన్నులు వర్తించనుండటం కూడా ప్రతికూలంగా ఉంటోంది.ఒకవేళ చెకోస్లొవేకియా ప్లాంట్‌ గానీ అందుబాటులోకి వస్తే .. జేఎల్‌ఆర్‌కు ఈ భారం కాస్త తగ్గొచ్చు.  జేఎల్‌ఆర్‌ అమ్మకాల సరళి సైతం సమస్యలకు కొంత కారణంగా ఉంటోంది. జేఎల్‌ఆర్‌కి సంబంధించి లాండ్‌ రోవర్‌తో పోలిస్తే జాగ్వార్‌ వాహనాల విక్రయాల మార్జిన్‌ చాలా తక్కువ. అంతర్జాతీయంగా దిగ్గజాలైన బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్‌లతో పోటీపడాల్సి రావడమే ఇందుకు కారణం. జేఎల్‌ఆర్‌ వాహనాలు పటిష్టమైన ఎస్‌యూవీలకు మాత్రమే పేరొందాయి. అటు, టయోటా లాంటి సంస్థలతో పోలిస్తే జేఎల్‌ఆర్‌ చిన్న సంస్థ. ఇలాంటివి కేవలం ఒక ప్రత్యేక విభాగంపై మాత్రమే ఆధారపడితే ఫలితాలు ఉంటాయి.

కానీ పోటీ సంస్థల తరహాలో ప్రతీ విభాగంలోకి ప్రవేశించడం, వాటిని నిర్వహించడం జేఎల్‌ఆర్‌ తలకు మించిన భారంగా మారింది. పైపెచ్చు, జాగ్వార్, ల్యాండ్‌రోవర్ల కార్లు ఒకదానితో మరొకటి పోటీపడుతూ సొంత గ్రూప్‌ వాహనాల విక్రయాలను కూడా దెబ్బతీస్తున్నాయి. ఎఫ్‌ పేస్‌ ఎస్‌యూవీ, రేంజ్‌ రోవర్‌ ఎవోక్, ల్యాండ్‌ రోవర్‌ డిస్కవరీ స్పోర్ట్, వేలార్‌ లాంటివి ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు చెబుతున్నారు.  పరిశ్రమ క్రమంగా పెట్రోల్, డీజిల్‌ వాహనాల నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాల వైపుగా మళ్లుతోంది. అయితే, ఈ విషయంలో జేఎల్‌ఆర్‌ వ్యూహాలు మెప్పించేవిగా లేవని పరిశీలకులు అంటున్నారు.  బ్రెగ్జిట్‌ పరిణామాలతో విదేశీ మారకంపరమైన నష్టాలు కూడా జేఎల్‌ఆర్‌ ఎదుర్కొనాల్సి వస్తోంది. ఆదాయాలు తగ్గితే.. తదుపరి ఆవిష్కరణలపైనా, ఆపై మార్కెటింగ్‌పైనా ప్రతికూల ప్రభావాలు పడొచ్చన్నది అంచనా.

కోలుకునే అవకాశాలు ఉన్నాయా.. 
చుట్టూరా ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న టాటా మోటార్స్‌కి దేశీ అమ్మకాలు మెరుగుపడుతుండటం కాస్త ఊరటనిచ్చే విషయం. దేశీయ వ్యాపారం ఊపందుకుంటోందని, మార్కెట్‌ వాటా పెరుగుతుండటంతో పాటు లాభదాయకత కూడా వృద్ధి నమోదు చేస్తోందని మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ చెప్పారు. టర్నెరౌండ్‌ 2.0 వ్యూహం మంచి ఫలితాలే ఇస్తోందంటూ తెలిపారు. ఇక జేఎల్‌ఆర్‌లో కూడా వ్యయాల నియంత్రణ చర్యలు తీసుకోనుంది. 2.5 బిలియన్‌ పౌండ్ల టర్నెరౌండ్‌ ప్లాన్‌లో భాగంగా 4,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది.  కొత్త కార్ల మోడల్స్, ఎలక్ట్రిక్‌ వాహనాలపై పెట్టుబడులతో ప్రత్యర్థి సంస్థలకు దీటుగా పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

అయితే, వ్యయాల నియంత్రణతో నష్టాలు కొంత మేర తగ్గించుకోగలిగినా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానీ అమ్మకాల గ్రాఫ్‌ కొంత కోలుకునే అవకాశాలు లేవని నిపుణులు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు 7% క్షీణించవచ్చని, వచ్చే సారి మాత్రం లో బేస్‌ ఎఫెక్ట్, కొత్త ఆవిష్కరణల ఊతంతో కాస్త మెరుగ్గా ఉండొచ్చని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ నొమురా అంచనా వేస్తోంది. కొత్త మోడల్స్, కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్‌ లేదా హైబ్రీడ్‌ వాహనాలు ఎంతవరకూ క్లిక్‌ అవుతాయన్న దానిపై కంపెనీ టర్నెరౌండ్‌ ఆధారపడి ఉంటుందనేది విశ్లేషకుల మాట.

దేశీయంగా ట్రక్కులు, ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు కాస్త పెరుగుతున్నట్లు కనిపించినా.. గత త్రైమాసికంలో ట్రక్స్‌ విక్రయాలు అనూహ్యంగా తగ్గాయి. లిక్విడిటీ, ఫైనాన్సింగ్‌ సమస్యలు, వాణిజ్య విభాగంలో కొత్త యాక్సిల్‌ లోడ్‌ నిబంధనలతో మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటం ఆటోమొబైల్‌ రంగానికి సవాలుగా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా ఆటోమొబైల్‌ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కంపెనీ తీసుకుంటున్న చర్యలు ఎంత మేర ఫలితాలిస్తాయన్నది వేచి చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. 

షేరు ఢమాల్‌ .. 
టాటా మోటార్స్‌ షేరు శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో ఏకంగా 29.45 శాతం పడి.. రూ.129 స్థాయిని తాకింది.   సుమారు పాతికేళ్ళ తర్వాత ఇంతలా పడటం ఇదే ప్రథమం. 1993 ఫిబ్రవరి 2న షేరు 40.5 శాతం పడింది. కాగా, చివర్లో కోలుకుని 17.58 శాతం నష్టంతో రూ. 151 వద్ద క్లోజయ్యింది. ఒకే రోజున కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 9,124 కోట్లు క్షీణించి రూ. 52,809 కోట్ల నుంచి రూ. 43,685 కోట్లకు పడిపోయింది. 

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!

కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు

జనంతో కిక్కిరిసిన మైదుకూరు

జగన్ గెలుపుకు అర్ధం..!

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయం

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ @మైదుకూరు

Watch Live: మైదుకూరులో సీఎం జగన్‌ ప్రచార సభ

Photos

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)