హరీష్కు అభినందనలు తెలిపిన కేటీఆర్

Published on Tue, 02/16/2016 - 11:59

హైదరాబాద్ : తెలంగాణ భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్రావుకు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్రెడ్డి 53,625 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ టీడీపీ డిపాజిట్ గల్లంతు అయింది. అయితే నారాయణఖేడ్ ఉప ఎన్నికకు మంత్రి హరీష్ రావు ఇంఛార్జ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీష్కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం ట్విట్టర్లో ట్విట్ చేశారు.


2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పటోళ్ల కిష్టారెడ్డి ఘన విజయం సాధించారు. కాగా ఆయన గతేడాది ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో నారాయణఖేడ్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పటోళ్ల కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని నిలబెట్టింది. కాగా టీఆర్ఎస్ అభ్యర్థిగా మహారెడ్డి భూపాల్రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపింది. పోటాపోటీగా ఈ ఎన్నికల ప్రచారం సాగింది. అయితే విజయం టీఆర్ఎస్ ఖాతాలో పడింది. దీంతో హరీష్కు ట్విటర్ ద్వారా కేటీఆర్ అభినందనలు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ ఇంఛార్జ్గా వ్యవహరించి.... 99 డివిజన్లలో గులాబీ కండువా వేసిన సంగతి తెలిసిందే.