ప్రపోజల్...

Published on Sat, 09/26/2015 - 23:26

మెట్రో కథలు
నవ్వింది.

నవ్వితే పన్ను మీద పన్ను కనిపిస్తుంది. బాగుంటుంది. ఈ మధ్య చాలామంది ఆడపిల్లలు డెంటిస్ట్‌లను కలుస్తున్నారు. పళ్లను తెల్లగా చేసుకుంటున్నారు. అందరి పళ్లూ తెల్లగా సున్నం వేసినట్టుగా ఒకేలా ఎందుకుంటాయి... వాటికీ ఒక రంగు ఉంటుంది కదా అంటుంది. వైటనింగ్ చేయించుకోలేదు. కొంచెం తెలుపు తక్కువగా ఉన్నా కృతకంగా లేకుండా సహజంగా అందంగా ఉంటాయి.
 
ఈ తెలుపు నీకు ఓకే కదా... అంది.
గబగబా తలాడించాడు.
అసలు పిలిచి కూచోబెట్టి మాట్లాడటమే కష్టం. అందుకే వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఫేస్‌వాష్ చేసుకుని తల దువ్వుకొని టక్ సరి చేసుకుని వచ్చి కూచున్నాడు. ఫ్రెష్‌గా ఉన్నాడు. తక్కువ అందగాడేమీ కాదు.
 
బాగున్నావు... మళ్లీ నవ్వింది.
ఆఫీస్‌లో చాలామంది వెళ్లిపోయారు. ఇప్పుడు కూచున్న క్యూబికల్ కూడా చిన్నది. ఇరుగ్గా ఉంటుంది. బయట ఎక్కడైనా కూచుని మాట్లాడుకుందాం అన్నాడు. ఎందుకూ... మనమేమైనా తప్పు చేస్తున్నామా... ఇక్కడ చాల్లే అని కూచోబెట్టింది. రెండు కాఫీ తెచ్చింది. కాలు మీద కాలేసుకుని కూచుంది. కొంచెం బొద్దుగా ఉంటుంది. చుడీదార్లలో భలే గ్రేస్‌గా ఉంటుంది.
ఏదీ అంది.
ప్రింటవుట్ ఇచ్చాడు.
పొద్దున మెయిల్ పెట్టాడు. దాదాపు ప్రేమలేఖ. పెళ్లి దాని ముక్తాయింపు.
సాయంత్రం ప్రింటవుట్ పట్టుకుని రా.. అని ఒక వాక్యం జవాబు పెట్టింది.
ఇద్దరూ ఒకే ఆఫీస్‌లో మూడు నాలుగేళ్లుగా పని చేస్తున్నారు. క్యాజువల్‌గా ఉంటారు. ఇలాంటి ప్రపోజల్ ఊహించలేదుగాని అంతమాత్రాన ఇదేమీ విడ్డూరం కాదు కదా.
కీబోర్డ్ పక్కన కళ్లద్దాలు ఉంటే తీసుకుని చదివింది. మధ్యలో అంది.
రీడింగ్ గ్లాసెస్ వచ్చాయి. ప్లస్ ఒన్. పర్లేదు కదా...
పర్లేదు అన్నట్టు మళ్లీ గబగబా తలాడించాడు.
చదవడం ముగించి కళ్లద్దాలు తీసి పక్కన పడేసి నాకు ఇష్టమే... నీ సంగతే తేలాలి అంది.
ఆశ్చర్యపోయాడు. మొదట ఇష్టపడింది తను. నీ సంగతి తేలాలి అంటుందేమిటి?..
అలా చూడకు. కాఫీ తాగు...
కష్టం మీద ఒక గుక్క వేశాడు.
పెన్నుంటే తీసుకుని వెనక్కు తిప్పి డెస్క్ మీద టక్కుటక్కు చప్పుడు చేస్తూ కూచుంది.
టెన్షన్ తట్టుకోలేక కాఫీ మొత్తం ముగించాడు.
అయిపోయిందా?...
తలాడించాడు.
చెప్తాను. ఇప్పుడు నువ్వు ముగించావే... కాఫీ... అలాంటిది మా ఇంట్లో అందరికీ ఇష్టం. అమ్మకీ... నాన్నకీ... అన్నయ్యకీ... నాకూ... నా చిన్నప్పుడు ఇంట్లో పెద్ద పెద్ద ఇత్తడి గ్లాసులుండేవి... ఉదయాన్నే అమ్మ కాఫీ చేస్తే వాటి నిండుగా పోసుకుని ఆరుబయట తులసి కోట దగ్గర కూచుని ఊదుకుంటూ ఊదుకుంటూ తీరిగ్గా తాగేవాళ్లం. అంత ఇష్టమైన కాఫీని మూడేళ్లు మానేశాం...
చాలా చిన్న కొబ్బరితోట ఉండేది. తుఫాను కొట్టి పూతకూ కాయకూ పనికి రాకుండా పోయింది. పౌరహిత్యం తాతగారితోనే ఆఖరు. నాన్న ఎక్కువ చదువుకోలేదు. చాలా కష్టపడి టెలికామ్‌లో క్లాస్ ఫోర్ ఉద్యోగం దొరికితే సంపాదించుకున్నాడు. అన్నయ్యా నేనూ పుట్టాక కూడా ఆయన జీతం ఏడు వందలు. ఏడు వందలతో నలుగురు మనుషులు ఎలా బతుకుతారో ఇంజనీరు కొడుకువైన నీకు తెలిసే అవకాశం తక్కువ.
ఇద్దరం తెలివైన పిల్లలం. కాని మంచి స్కూల్లో వేయడానికి డబ్బు ఉండేది కాదు. మా ఇంటికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఎవరో ఫ్రీ స్కూల్ నడుపుతుంటే అందులో చేర్పించాడు. రోజూ ఉదయాన్నే సైకిల్ మీద మా ఇద్దరినీ కూచోబెట్టుకుని అక్కడి దాకా తీసుకెళ్లి దింపేవాడు. మళ్లీ సాయంత్రం ఇంటి దాకా. ఆ సైకిల్ పాపం మా నాన్నను మోయడానికే ఏడ్చేది. మమ్మల్ని కూడా అంటే కదిలేదే కాదు. కాని అది కష్టమని ఏ రోజూ అనుకోలేదు.
 
అప్పట్లో ఓటీ చేస్తే గంటకు రెండు రూపాయలు ఇచ్చేవారు. ఆ రెండు రూపాయల కోసమని ఐదారు గంటలు ఓటీ చేసేవాడు. అసిడిటీ వచ్చింది. నకనకలాడే ఆకలితో ఇంటికొస్తే కడుపు నిండుగా తినేంత వీలుగా అన్ని పదార్థాలు అంత రుచితో ఉండేవి కాదు. అమ్మ మాత్రం ఏం చేస్తుంది?
ఉన్నవాటితో ఉన్నంత. నాన్నకు చాలా కోపం వచ్చేది. పళ్లెం విసిరి కొట్టేవాడు. అమ్మను పట్టుకొని చావబాదేసేవాడు. తర్వాత ఏడ్చేవాడు. అమ్మ కూడా. ఇలాంటి రాత్రులు చాలానే ఉండేవి.
 
మరో రెండేళ్లలో రిటైర్ అవుతున్నాడు. ఇప్పుడు కూడా ఆయన జీతం ముప్పై రెండు వేలు. నా జీతం అరవై వేలు. పైసా పైసా చూసుకొని బతికినవాళ్లు తమ కోసం తాము ఖర్చు పెట్టుకోలేరు. పిల్లలకు పనికి వస్తాయి కదా అనుకుంటారు. అందుకే అన్నయ్య బలవంతంగా ఫ్లాట్ కొనిపించాడు. నెలనెలా ఇ.ఎం.ఐ వాడే కడుతున్నాడు. నేను ఇంటి ఖర్చులన్నీ పెట్టుకుంటాను. మూడు పూటలా వంటలక్క వచ్చి బ్రహ్మాండంగా వండి పెడుతుంది. వాళ్లు సంతోషంగా విశ్రాంతిగా కడుపు నిండుగా తినడం నాకు ఇష్టం.
 
ఏమంటానంటే రేపు పెళ్లయ్యాక నా సంపాదన నా కోసం నీ కోసం మన పిల్లల కోసం ఖర్చు పెడతాను. అలాగే మా అమ్మా నాన్న కోసం కూడా ఖర్చు పెడతాను. ఇది కొనసాగుతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా నా ఏ.టి.ఎం కార్డు నా దగ్గరే ఉంటుంది. ఇది నచ్చితే ఇష్టమో కాదో నువ్వే తేల్చాలి.
 
చూస్తున్నాడు.
మా నాన్న అస్సలు మాటకారి కాదు. దాదాపు మాట్లాడడు. కాని ఊళ్లో సినిమా పోస్టర్ మారినప్పుడల్లా సినిమాకు తీసుకెళ్లమని మారాము చేస్తే ఆరుబయట మంచాలు వేసి నక్షత్రాలకు ముడి పెట్టి ఏవేవో కథలు చెప్పడానికి ట్రై చేసేవాడు. అవి అంతగా అందగించేవి కాదు. కాని ఆయన అవస్థ చూసి ఇంటరెస్టింగ్‌గా ఉన్నట్టు ముఖాలు పెట్టి వినేవాళ్లం. పిక్నిక్‌లు టూర్లు మాకు తెలీవు. ఇంజనీరింగ్‌కి కూడా అమలాపురం దాటలేదు. అప్పుడే నాకు లోకం మీద వ్యామోహం పుట్టింది. చూడాలి. వీలైనంత చూసేయాలి. శుక్రవారాలు నువ్వు గమనించే ఉంటావు. బ్యాక్ ప్యాక్‌తో వస్తాను. ఆఫీస్ అయ్యాక టూడేస్ ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లిపోతాను. హైదరాబాద్ చుట్టుపక్కల ఏమున్నాయో నీకు తెలీదు. అటు కర్నాటక దాకా ఇటు మహరాష్ట్ర దాకా వెళితే ఎన్ని అందాలు ఉన్నాయో నీకు తెలీదు. ఇంకా ఎంత లోకం ఉందో ఎవరికి తెలుసు? ఏమంటానంటే నెలలో ఒకటి రెండు సార్లయినా ఈ తిరుగుళ్లు ఉంటాయి. పెళ్లయ్యాక కూడా కొనసాగుతాయి. ఇదినచ్చితే ఇష్టమో కాదో నువ్వే తేల్చాలి.
 
చూస్తున్నాడు.
ఇక ఇది చెప్పడం నాకు ఇష్టం లేదు. కాని చెప్పక తప్పడం లేదు. అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలు ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు. వాళ్ల కోసం ఏదైనా చేయాలని చిన్నప్పుడే అనుకున్నాను. మూడు సబ్జెక్ట్‌లకు కలిపి ఒక డబుల్ రూల్డ్ నోట్‌బుక్ ఉండటం ఎంత నొప్పిగా ఉంటుందో బహుశా నీకు తెలీదు. ఇదేదో ఫ్యాషన్ కోసమో ఫేస్‌బుక్‌లో గ్లామర్ కోసమో పెట్టుకోలేదు. అలాంటి పిల్లల కోసం పని చేయడం నాకు ఇష్టం. చేస్తున్నానని కూడా కాస్త గమనిస్తే నీకు తెలిసే ఉండాలి. కొంత సంపాదన వాళ్ల కోసం పెడితే ఏం పోయింది? మన దగ్గర ఉందిగా? పెళ్లయ్యాక ఇది కొనసాగుతుంది. కొనసాగి తీరుతుంది. ఇది నచ్చితే ఇష్టమో కాదో నువ్వే తేల్చాలి.
 
చూస్తూ ఉన్నాడు.
ఫైనల్‌గా ఏమంటానంటే నాక్కూడా నువ్వంటే ఇష్టం. మంచివాడివి. బిహేవియర్ కూడా బాగుంటుంది. నేను నిన్ను ప్రేమిస్తాను. గౌరవిస్తాను. మా అమ్మానాన్న పట్ల నాకెలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నీకు చెప్పినట్టే మీ అమ్మానాన్నల పట్ల నీకెలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలుసుకుని ఫేక్‌గా కాకుండా నిజంగానే వాళ్లను గౌరవిస్తూ వాళ్లు గౌరవించేలా ఉంటాను. బిపి సుగర్ థైరాయిడ్లు లేవు. హెల్దీగా ఉన్నాను. సెక్సువల్ ఎపిటైట్ కూడా బాగానే ఉందని అనుకుంటున్నాను. మన జర్నీ బాగుంటుంది. అయితే ఇది ఇంతటితో ఆగదు. మనం ఇంకా ముందుకెళతాం. కెరీర్‌లోగానీ సొసైటీలోగాని మంచి విషయాలను ఎక్స్‌ప్లోర్ చేస్తాం. ఎదుగుతాం. నాలుగు పనికొచ్చే పనులు చేస్తాం. ఎట్‌లీస్ట్ నాకు అలా ఉంది. నన్ను చేసుకునేవాడు కూడా అవన్నీ అందుకోవాలని ఉంది. ఇవన్నీ నీలో చూస్తున్నాను. ముందు నువ్వు ఇదంతా తీసుకోగలగాలి. తర్వాత మీ అమ్మానాన్నలకు కూడా ఇదంతా అర్థమయ్యేలా చెప్పి ప్రిపేర్ చేయగలగాలి. చేయగలం అనే అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పు. ఇదంతా నీకు ఓకేనే గదా...
చూస్తూ ఉన్నాడు.
చెప్పు... ఓకేనే గదా...
చూస్తూనే ఉన్నాడు.
- మహమ్మద్ ఖదీర్‌బాబు
 

Videos

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!

కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు

జనంతో కిక్కిరిసిన మైదుకూరు

జగన్ గెలుపుకు అర్ధం..!

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయం

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ @మైదుకూరు

Watch Live: మైదుకూరులో సీఎం జగన్‌ ప్రచార సభ

Photos

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)