రేపు బంద్ పాటించొద్దు: సీఎం

Published on Thu, 09/01/2016 - 09:27

రోడ్డు రవాణా, భద్రత బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 2న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను పాటించొద్దని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. తమ రాష్ట్రం శుక్రవారం మూత పడదని ఆమె ఓ భారీ ప్రకటనలో తెలిపారు. అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలు, దుకాణాలు, ఫ్యాక్టరీలు తెరిచే ఉంచాలన్నారు. వాహనాల రాకపోకలు సాధారణంగానే కొనసాగుతాయని, ప్రజా రవాణా వ్యవస్థకు కూడా ఎలాంటి ఆటంకం ఉండబోదని చెప్పారు.

ఎవరైనా సంఘవిద్రోహ శక్తులు సామాన్య జనజీవనానికి ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నిస్తే వారిపై వీలైనంత కఠిన చర్యలు తీసుకుంటామని మమతా బెనర్జీ అన్నారు. ఒకవేళ ఏదైనా వాహనానికి గానీ, దుకాణానికి గానీ, సంస్థకు గానీ సంఘ విద్రోహ శక్తుల వల్ల నష్టం జరిగితే దానికి ప్రభుత్వం తగిన పరిహారం కూడా చెల్లిస్తుందని ఆ ప్రకటనలో మమతా బెనర్జీ చెప్పారు.