‘కాంగ్రెస్‌ నేతల ఫోన్లన్నీ ట్యాపింగ్’

Published on Thu, 10/25/2018 - 02:58

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతల ఫోన్లన్నింటినీ ట్యాపింగ్‌ చేస్తున్నారని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇంటెలిజెన్స్‌ డీఐజీ ప్రభాకర్‌రావు, అడిషనల్‌ ఎస్పీ నర్సింగ్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావులు కాంగ్రెస్‌ నేతల ఫోన్‌ ట్యాపింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారని  ఆరోపించారు. వీరి తీరుపై త్వరలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ బంధువులం కాబట్టి తమకు ఏం కాదని ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో ఏం జరగాలో అదే జరుగుతుందని హెచ్చరించారు.

ఫోన్‌ట్యాపింగ్‌లు చట్ట వ్యతిరేక చర్య అని, అలా చేసిన వారెవరైనా జైలుకు పోతారని చెప్పారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో ఉత్తమ్‌ పలు అంశాలపై మాట్లాడా రు. ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీనిపైనా ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ తగ్గుతోందని, కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరుగుతోందన్నారు. ప్రస్తుత పరిíస్థితుల్లో టీఆర్‌ఎస్‌కు 30 సీట్లు దాటవని జోస్యం చెప్పారు. ముందస్తు అభ్యర్థుల ప్రకటనతో టీఆర్‌ఎస్‌కు భారీ నష్టం జరిగిందన్నారు. 

రూ.500 కోట్లతో గల్ఫ్‌ కార్పొరేషన్‌ 
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.500 కోట్లతో గల్ఫ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన కార్మికులకు, వారి కుటుంబాలకు అండగా ఉండటానికి కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ’గల్ఫ్‌ భరోసా యాత్ర’ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ, గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారు.

2014 ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ తన ఎలక్షన్‌ మేనిఫెస్టోలో ప్రవాసుల సంక్షేమం పేరిట ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కిందని విమర్శించారు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఎన్నారై సెల్‌ చైర్మన్‌ అంబాసిడర్‌ బీఎం వినోద్‌ కుమార్, టీపీసీసీ గల్ఫ్‌ ఎన్నారై కన్వీనర్‌ నంగి దేవేందర్‌ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి మంద భీంరెడ్డి ఆధ్వర్యంలో గల్ఫ్‌ భరోసా యాత్ర కొనసాగుతుందన్నారు. గల్ఫ్‌ వలసలు అధికంగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. 

టీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడాలి: ఉత్తమ్‌
టీఆర్‌ఎస్‌ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ నాలుగేళ్ల పాటు ప్రజలకు ఆశలు చూపించి మోసం చేయడమే కాకుండా నిలదీసిన వారిని అణచివేశారని దుయ్యబట్టారు. హామీలు నెరవేర్చలేకనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో బుధవారం మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ నేత అమరేందర్‌ రెడ్డి, నర్సాçపూర్‌ టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీ జయశ్రీ, హైదరాబాద్‌ మలక్‌పేట మాజీ కార్పొరేటర్‌ టీఆర్‌ఎస్‌ నేత సీహెచ్‌ శ్రీనివాస్, డోర్నకల్‌కు చెందిన భరత్‌ రెడ్డిలు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

కొత్తగా చేరిన వారికి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ  మోసపూరిత హామీలతో కాలం గడిపిన టీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.  ఈ ఎన్నికలు కేసీఆర్‌ కుటుంబం, తెలంగాణ ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పేద వైశ్యు లు, రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తా మని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ