ఖండూతో లామా ఢీ

Published on Tue, 03/26/2019 - 11:09

అరుణాచల్‌ప్రదేశ్‌లోని ముక్తో శాసనసభ నియోజకవర్గంలో 20 ఏళ్ల తర్వాత ఈసారి ఎన్నికల్లో ‘పోటీ’ జరుగుతోంది. తవాంగ్‌ జిల్లాలో భారత్‌–చైనా సరిహద్దున ఉన్న ఈ నియోజకవర్గంలో 1999 నుంచి ఎమ్మెల్యేలందరూ పోటీ లేకుండానే ఎన్నికవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెమ ఖండూ ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెమ ఖండూ 2014 ఎన్నికల్లో, అంతకు ముందు 2011లో జరిగిన ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెమ తండ్రి దోర్జీఖండూ కూడా ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోవడంతో ఉప ఎన్నిక అవసరమయింది. 1990 నుంచి ముక్తో సీటు దోర్జీ చేతిలోనే ఉంటూ వచ్చింది.

మన్పా కులస్తుల ఆధిపత్యం గల ఈ నియోజకవర్గం ఖండూ కుటుంబానికి పెట్టని కోటగా ఉంటోంది. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున పెమ ఖండూ పోటీ చేస్తోంటే, జనతాదళ్‌ (ఎస్‌) అభ్యర్థిగా బౌద్ధ సన్యాసి లామా లాబ్‌సంగ్‌ గెట్సోను నిలబెట్టింది. తవాంగ్‌ జిల్లాలో రెండు భారీ ఆనకట్టల నిర్మాణానికి వ్యతిరేకంగా లాబ్‌ సంగ్‌(39) నాయకత్వంలో ప్రజా ఉద్యమం సాగుతోంది. ఈ కారణంగానే 2016లో ప్రభుత్వం లాబ్‌సంగ్‌ను అరెస్టు చేసింది. ఆయనను విడుదల చేయాలని కోరుతూ ప్రజలు ప్రదర్శన నిర్వహించారు. దానిపై పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు బౌద్ధ సన్యాసులు మరణించారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కూడా ఈయన పాలు పంచుకున్నాడు. 2014 ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనుకున్నానని, అయితే కుదరలేదని ఆయన చెప్పాడు. పర్యావరణానికి హాని కలిగించే భారీ ప్రాజెక్టుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఆ సన్యాసి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 60 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ