చెదిరిన గుండె...  చలించిన నేత

Published on Sat, 11/25/2017 - 04:33

‘అవ్వా! ఎలా ఉన్నావ్‌?’ అన్న పిలుపుతోనే 70 ఏళ్ల అవ్వ గుండె గొంతుకలోంచి ఆవేదన ఉప్పొంగింది. 
‘చిట్టితల్లీ! బడికెళ్లడం లేదా?’ బాధ్యతగా అన్న  వేసిన ప్రశ్నకు ఆ చిన్నారి బాధ ఉప్పెనైంది.
‘పెద్దాయనా! పంటెలా ఉంది?’ అన్న పలకరింపుతో రైతు కంట కష్టాల కన్నీళ్లు పొంగుకొచ్చాయి. 
జననేత పిలుపుతో నిరుద్యోగ యువతలోని ఆవేశం కట్టలు తెంచుకుంది. వీధిన పడ్డ కార్మికుడు కంఠశోష ఏరైంది. 


ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో అడుగడుగున కన్నీటి గాథలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ళుగా ప్రభుత్వం చుట్టూ తిరిగినా ఫలితం దక్కని వాళ్లు.. కన్నీటి పర్యంతమైనా కనికరమే చూపని అధికారులతో విసిగిపోయిన వాళ్లూ.. ప్రతిపక్ష నేతకు తమ గోడు చెప్పుకోవాలని వస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా సాగుతున్న యాత్రలో జగన్‌ చెమ్మగిల్లిన ప్రతీ హృదయాన్ని పలకరిస్తున్నారు. కష్టమేంటో తెలుసుకుంటున్నారు. ఇంటిపెద్దలా అందరినీ ఓదారుస్తున్నారు. ధైర్యంగా ఉండాలంటూ భరోసా ఇస్తున్నారు. తమ అభిమాన నేత తమ దగ్గరకే వచ్చి, తమ కష్టాలు ఆలకించడంతో వారు ఒకింత ఊరట పొందుతున్నారు. 

బడికెళ్లు చిట్టితల్లీ...
ఆళ్లగడ్డ మండలం పెద్ద చింతకుంటపల్లిలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా రోడ్డు పక్కన పొలం పనులు చేస్తున్న ఓ బాలికను గమనించిన జగన్‌.. ‘ఏమ్మా.. బడికి వెళ్లలేదా?’ అని పలకరించారు. ‘అమ్మ వద్దంది.. అందుకే వెళ్లలేదు. ఇద్దరం కూలీకి వచ్చాం’ అని ఆ బాలిక చెప్పింది. ఇంతలో బాలిక ఆశ తల్లి జూబేదాబీ జగనన్న వద్దకు వచ్చింది. పిల్లలను బడికి పంపాలని, వారు కష్టపడి చదివి డాక్టర్లు, ఇంజనీర్లు అయితే కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన సూచించారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తానని మహిళా కూలీలకు భరోసా కల్పించారు. 

నేనున్నాను అవ్వా!
70 ఏళ్ల ఉస్సేన్‌బీ జన సమూహంలో జగన్‌ను కలిసేందుకు ఓ రకంగా పోరాటమే చేస్తోంది. అది గమనించిన జగన్‌ నేరుగా ఆమె వద్దకే వెళ్లారు. ‘ఏంటవ్వా..’ అంటూ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ ఆప్యాయంగా అడిగారు. అంతే... ఆ అవ్వ గుక్కపెట్టి ఏడుస్తూ కష్టాన్ని చెప్పుకొచ్చింది. దద్దనాల గ్రామంలో తమ బంధువును రక్షించే క్రమంలో అగ్నిప్రమాదంలో గాయపడ్డానని, చేతివేళ్లు పోయాయని కన్నీరు మున్నీరైంది. రాజన్న హయాంలో పింఛన్‌ ఇచ్చారని, చంద్రబాబు వచ్చాక అది ఎగిరిపోయిందని బావురుమంది. వేలిముద్రలు లేవంటూ సాకు చూపారని, చేతులు కాలిపోతే వేలిముద్రలు ఎలా వేయాలయ్యా? అని కన్నీటి పర్యంతమైంది. ‘అయ్యా... నేను చనిపోవాలనే ప్రయత్నం కూడా చేశాను’ అంటూ ఆమె చెబుతుంటే జగన్‌ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. అమాంతం అవ్వను రెండు చేతులతో దగ్గరకు తీసుకుని వెన్ను తట్టారు. నేనున్నాను... మన ప్రభుత్వం వచ్చాక మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు. అప్పటికప్పుడే కలెక్టర్‌కు లేఖ రాయాలని సన్నిహితులను ఆదేశించారు. 

చిన్నారి బుగ్గను నిమురుతూ...
కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలంలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ను ఓ సంఘటన కలిచివేసింది. దీనంగా చూస్తున్న బాలుడిని చూసి బుగ్గలపై నిమురుతూ ‘ఏం జరిగింద’ని అడిగారు. ఆరేళ్లున్న తమ బాబుకు మాట రావడం లేదని, చెవులు వినిపించడం లేదని బాలుడి తల్లిదండ్రులు ఓబులేష్, రాణమ్మ చెప్పారు. గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్తే, రూ.7 లక్షలు ఖర్చవుతుందన్నారని, ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారని బావురుమన్నారు. ఆ బాధతో చలించిన జగన్‌ వెంటనే సోదరుడు కొండారెడ్డిని పిలిచి వైద్యసాయం అందించాలని ఆదేశించారు. జగన్‌ కల్పించిన భరోసా ఆ తల్లిదండ్రులకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. 

పాదం పట్టి.. కుశలమడిగి.. 
కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం వెంకటగిరిలో ఓ అవ్వ తన అభిమాన నేత ముందు కన్నీరు మున్నీరైంది. ఆమె కాళ్లపై కనిపించిన బొబ్బలు ఆయనను కదిలించాయి. ఆ బొబ్బలేంటో చూసేందుకు జగన్‌ ఆ అవ్వ కాళ్ల ముందు వాలిపోయారు. ఆమె పాదాలు పట్టుకుని ఆత్మీయంగా స్పృశించారు. అ సంఘటన అవ్వనే కాదు... అక్కడున్న వారందరినీ అశ్చర్యపరిచింది. అభిమానించే నేత ఇలా ఉంటారా? అని అందరూ నివ్వెరపోయారు. అవ్వను హైదరాబాద్‌లో వైద్యులకు చూపించాలని తన వ్యక్తిగత సహాయకులకు జగన్‌ ఆదేశించారు. పోలియోతో పాదం బలహీనమైన శివలీలావతి అనే చిన్నారి అభిమాన నేతను చూసేందుకు రావడం జగన్‌ కంటపడింది. నేరుగా ఆమె వద్దకే వెళ్లి నిస్సహాయంగా ఉన్న ఆ పాదాల ముందు కూర్చున్నారు. ఆమెను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలుకరించారు. తక్షణ వైద్యానికి సిఫార్సు చేశారు. ఇలాంటి మరో సంఘటన వెంకటగిరిలో జగన్‌ దృష్టికి వచ్చింది. రామలక్ష్మమ్మ రెండేళ్ల కుమారుడు కార్తీక్‌కు ఆరోగ్యశ్రీ గుండె ఆపరేషన్‌ చేయించేందుకు హైదరాబాద్‌లో నిరాకరిస్తున్నారని జగన్‌కు చెప్పగా.. జగన్‌ ఆ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. ఆప్యాయంగా పలుకరించారు. తిరుపతిలో ఆపరేషన్‌ చేయిస్తానని హామీ ఇచ్చారు. మామయ్యను కలవగానే సమస్య తీరిందని రామలక్ష్మమ్మ సంతోషం వ్యక్తం చేసింది. 

బేతంచెర్ల మండలం ముద్దవరంలో పోలియో సోకిన చిన్నారి కాళ్లను పరిశీలిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఆత్మీయ స్పర్శ...
కష్టం అంటూ వస్తే సాధారణంగా ఇంట్లో వాళ్లకే చెప్పకుంటాం. అక్కడే ఓదార్పు వస్తుందని ఆశించడం సహజం. కానీ ఇక్కడ తన అభిమాన నేతను తమ కుటుంబ సభ్యుడిగా జనం ఆదరిస్తున్నారు. కష్టాలు పంచుకుంటున్నారు. ఆయనా అదే రీతిలో వారితో మమేకవుతున్నారు. ఆ కష్టాలన్నీ తనవే అన్నట్టు స్పందిస్తున్నారు. ఓ నేతను ఈ స్థాయిలో విశ్వసించడం అరుదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బండరాళ్లను సైతం కదిలించే ఇలాంటి ఘట్టాలు ఒకటీ రెండూ కాదు. అనేకం. ఆళ్లగడ్డలో నిరీక్షణ అనే మహిళ తన్నుకొచ్చే దుఃఖాన్ని కొంగుతోనే ఒదిమిపట్టి జగన్‌ వద్దకొచ్చింది. ఆమె బాధేంటో జగన్‌ తెలుసుకున్నారేమో! ఆమె తలపై ఆత్మీయంగా చెయ్యివేశారు. అంతే ‘అన్నా...’ అంటూ గుండెలవిసేలా ఏడ్చింది. ప్రమాదంలో శరీరం మొత్తం కాలిపోయిందని.. పనులు చేసుకునే స్థితిలో లేనని.. రెండేళ్లుగా పింఛన్‌ కోసం అధికారులు చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయిందని జగన్‌ వద్ద బోరుమంది. ఆ క్షణంలోనే ఆయన ఆమెకు ఊరట కలిగించారు. బహిరంగ సభలో మాట్లాడించారు. కలెక్టర్‌కు లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. 

ఆళ్లగడ్డ సభలో మాట్లాడుతూ తనకు అగ్ని ప్రమాదంలో ఒళ్లంతా కాలిపోయిందని, అయినా వికలాంగత్వ సర్టిఫికెట్‌ లేదనే సాకుతో రెండేళ్లుగా పింఛన్‌ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న నిరీక్షణ. 

జనం బాటలో ఒకడిగా...
రోజు కూలీ మొదలుకొని, ఉద్యోగ, వ్యాపార వర్గాల మనసు తట్టే విధంగా జగన్‌ పాదయాత్ర కొనసాగుతోంది. పొద్దుటూరులో టీ కొట్టుకెళ్లి ‘ఛాయ్‌ వాలా’తో చిట్‌చాట్‌ చేసినా... నాపరాయి పరిశ్రమలో రోజుకూలీ స్వేదాన్ని గమనిస్తూ ఆప్యాయంగా చెయ్యేసినా... రైతన్నతో అడుగులో అడుగేస్తూ ముందుకు కదిలినా... డ్వాక్రా అక్కచెల్లెమ్మలతో చేతులూపుతూ బాధలు పంచుకుంటూ సాగిపోయినా... జగన్‌ కన్నీటి కష్టాలు తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నారు. గుండెలు పిండేసే బాధలకు పరిష్కారం చూపాలనే ఆలోచిస్తున్నారని వివిధ వర్గాలు చర్చించుకోవడం విశేషం. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ