మిగులు నుంచే ‘ఉచిత’ సర్దుబాటు!

Published on Mon, 09/29/2014 - 00:07

ఉచిత బియ్యం పథకం అమలుకు టీ సర్కారు కసరత్తు
బోగస్ ఏరివేతతో బియ్యం, కిరోసిన్ సబ్సిడీలో రూ.400 కోట్ల మిగులు
ఉచిత బియ్యం పంపిణీకి అదనంగా అయ్యేది రూ.200 కోట్లే
మిగులు నిధుల నుంచి ఈ వ్యయం భరించాలని యోచన

 
హైదరాబాద్: రాష్ట్రంలో ఉచిత బియ్యం పథకాన్ని అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉచిత బియ్యం పంపిణీకి.. ప్రస్తుతం అవుతున్న వ్యయం కంటే అదనంగా మరో రూ.200 కోట్లు కావాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బోగస్ కార్డుల ఏరివేతతో మిగులుతాయని భావిస్తున్న రూ.400 కోట్ల నుంచి ఈ సొమ్మును సర్దుబాటు చేయవచ్చని సర్కారు భావిస్తోంది. ఉచిత బియ్యం పంపిణీ చేయాలనే దిశగా ఇప్పటికే ప్రాథమిక చర్చలు ప్రారంభించిన కేబినెట్ సబ్‌కమిటీ.. ఇదే అంశంపై మరోమారు అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాక ఓ నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది.

రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు ఏటా 18 లక్షల మెట్రిక్ టన్నుల మేర బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందులో ఎఫ్‌సీఐ కోటా కింద 10.94 లక్షల మెట్రిక్ టన్నులు (ఏపీఎల్-6.56, బీపీఎల్-4.38 లక్షల మెట్రిక్ టన్నులు) కేటాయిస్తుండగా, మరో 7 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్రం సమకూరుస్తోంది. ఈ బియ్యం పంపిణీ కింద రాష్ట్రం ఏటా సుమారుగా రూ.1,400 కోట్ల మేర సబ్సిడీ భారాన్ని భరిస్తోంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 11 లక్షల బోగస్ కార్డులను ఏరివేయడం ద్వారా సుమారు 51 లక్షల మంది బోగస్ లబ్ధిదారులను తొలగించింది. ఈ ఏరివేసిన కార్డులకు ఇప్పటికే బియ్యం, కిరోసిన్ సరఫరాలను పూర్తిచేయడంతో అవన్నీ మిగులులో ఉన్నట్టే. సెప్టెంబర్ లెక్కల ప్రకారం నెలకి సుమారు 16 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 2,460 కిలోలీటర్ల కిరోసిన్ మిగులు చేకూరింది. అంటే ఏడాదిలో ఇంకా పూర్తిస్థాయిలో ఏరివేత పూర్తయితే రాష్ట్రానికి మొత్తం సబ్సిడీ భారం రూ.400 కోట్ల మేర తగ్గుతుందని పౌర సరఫరాల శాఖ ఇటీవలే ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న రూపాయికి కిలో బియ్యం స్థానంలో ఉచిత బియ్యం పథకాన్ని ప్రవేశపెడితే ప్రభుత్వంపై ఏటా మరో రూ.200 కోట్ల కంటే ఎక్కువ భారం పడదని, దీన్నిసైతం మిగులులోంచి సర్దుబాటు చేయొచ్చన్నది ప్రభుత్వ అభిప్రాయంగా ఉందని చెబుతున్నారు. ఇక బియ్యం కోటాను సైతం కుటుంబానికి 20 కేజీల నుంచి 30-35 కేజీల వరకు పెంచే అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్న సర్కారు.. బియ్యం లభ్యత, కేంద్ర సహకారం, ఆర్థిక భారాల లెక్కలు తేలాకే దీనిపై ఓ నిర్ణయానికి రావాలని భావిస్తోంది.కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీ దీనిపై అన్ని అంశాలను పరిశీలనలోకి తీసుకున్నాక ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

 పామాయిల్ పునరుద్ధరణ దిశగా...

 గత ఐదు నెలలుగా రేషన్‌కార్డుదారులకు నిలిచిపోయిన పామాయిల్ సరఫరాను తిరిగి పునరుద్ధరించే అంశంపై కూడా సర్కారు సమాలోచనలు చేస్తోంది. పామాయిల్‌పై కేంద్ర సబ్సిడీ ఎత్తివేసిన అనంతరం దీన్ని పునరుద్ధరించే విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అనర్హుల ఏరివేత పూర్తికావడం, పామాయిల్‌కు లబ్ధిదారుల నుంచి ఎక్కువగా డిమాండ్ ఉన్న దృష్ట్యా దీనిపై ఓ నిర్ణయానికి రావాలని ప్రజాప్రతినిధుల నుంచి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులకు వినతులు వెళ్లాయి. పామాయిల్ సబ్సిడీ భారం నెలకు రూ.19 కోట్లు, ఏటా రూ.230 కోట్ల వరకు ఉంటుందని గతంలోనే ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. అయితే బోగస్ ఏరివేత పెద్ద ఎత్తున జరిగినందున ఈ భారం రూ.180 కోట్లకే పరిమితం కావచ్చని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈ భారాన్ని కూడా మిగులు సబ్సిడీ నుంచి సర్దుబాటు చేయాలని సబ్ కమిటీ యోచిస్తోంది.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ