‘ఓం’ సిటీకి సహకరిస్తాం: కేసీఆర్

Published on Tue, 04/14/2015 - 02:29

  • సచివాలయంలో కేసీఆర్‌తో రామోజీరావు భేటీ
  • సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగర నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తామని ‘ఈనాడు’ పత్రికాధిపతిరామోజీరావుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభయమిచ్చారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన ‘ఓం’ సిటీ నిర్మాణం పూర్తి కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో రామోజీరావు గంటన్నర పాటు సమావేశమయ్యారు.

    ఈ సందర్భంగా ఓం సిటీ డిజైన్లను ముఖ్యమంత్రికి చూపించారు. రాష్ట్రానికి ఓం సిటీ  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, దీన్ని సందర్శిస్తే యావత్ దేశాన్ని సందర్శించిన భావన భక్తుల్లో కలుగుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ భేటీ అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించేందుకు రామోజీరావు నిరాకరించారు. అయితే సీఎంవో కార్యాలయం దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఓం సిటీ నిర్మాణ విశేషాలతో ముద్రించిన పుస్తకం మొదటి ప్రతిని ముఖ్యమంత్రికి రామోజీరావు అందించినట్లు తెలిపింది.

    ఆధ్యాత్మిక నగర నిర్మాణంతో దాదాపు 30 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, నిత్యం రెండు లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశముందని పేర్కొంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, రెవెన్యూ కార్యదర్శి మీనా, రామోజీ ఫిల్మ్ సిటీ సీఈవో రాజీవ్ తదితరులు కూడా పాల్గొన్నారు. కేసీఆర్ గత డిసెంబర్‌లో రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శనకు వెళ్లి రామోజీతో భేటీ కావడం, ఐదు గంటలకుపైగా సుదీర్ఘ మంతనాలు జరపడం అప్పట్లో రాష్ర్టవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా రామోజీరావు స్వయంగా సచివాలయానికి వెళ్లి సీఎంను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ