ఎనిమిదేళ్ల సత్యం ‘చెర’ ముగింపు

Published on Sat, 04/01/2017 - 02:26

- ‘ఆయేషా’ కేసులో సత్యంబాబు నిర్దోషి: హైకోర్టు
- పోలీసులు అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు
- అసలు నేరస్తులను తప్పించేందుకే ఇలా చేశారు
- అత్యాచార వాదనను పోలీసులే తెరపైకి తెచ్చారు
- కింది కోర్టు విధించిన జీవిత ఖైదు, జరిమానా రద్దుచేస్తూ తీర్పు


సాక్షి, హైదరాబాద్‌

సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో నిందితుడుగా ఉన్న పిడతల సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దళితుడైన సత్యంబాబును పోలీసులు ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని తేల్చింది. అసలు ఆయేషాపై అత్యాచారం జరిగిందన్న వాదనను పోలీసులే తెరపైకి తెచ్చారని తేల్చి చెప్పింది. అసలైన నేరస్తులను తప్పించేందుకు, వాస్తవాలను కప్పిపుచ్చి కోర్టును తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేశారంది. సత్యంబాబుకు కింది కోర్టు విధించిన జీవితఖైదు, జరిమానాలను రద్దు చేసింది. ఏదైనా ఇతర కేసులో అతని అవసరం ఉంటే తప్ప, తక్షణమే అతన్ని విడుదల చేయాలని ఆదేశించింది. జరిమానాగా అతను ఏదైనా మొత్తాన్ని చెల్లించి ఉంటే దానిని తిరిగి అతనికి వాపసు ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేకాక అతనికి ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు సి.వి.నాగార్జునరెడ్డి, ఎం.ఎస్‌.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆయేషా మీరా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్‌ హాస్టల్‌లో ఉంటూ.. నిమ్రా కాలేజీలో బీ ఫార్మసీ అభ్యసించేది. 27.12.2007న హాస్టల్‌లో ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు సత్యంబాబును అరెస్ట్‌ చేశారు. అతనే ఆయేషా మీరాను హత్య చేశాడంటూ అభియోగం మోపారు. దీనిపై విచారణ జరిపిన విజయవాడ మహిళా కోర్టు సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ హత్య చేసినందుకు జీవితఖైదు, రూ.1,000 జరిమానా, అత్యాచారం చేసినందుకు పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ 29.9.2010న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సత్యంబాబు అదే ఏడాది అక్టోబర్‌లో హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది.

అసలు నిందితులను పట్టుకునే ఉద్దేశం లేదు
ఆయేషాను సత్యంబాబే హత్య చేశారనేందుకు నిర్దిష్టమైన ఆధారాలను చూపడంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారని ధర్మాసనం పేర్కొంది. పోలీసులు ఎవరో ఒకరిని నేరస్తునిగా చూపాలన్న దిశగానే దర్యాప్తు చేశారే తప్ప, అసలైన నిందితులను పట్టుకునే ఉద్దేశంతో దర్యాప్తు చేయలేదని హైకోర్టు ఆక్షేపించింది. పోలీసులు చెప్పిన సిద్ధాంతాన్నే కింది కోర్టు విశ్వసించిందని తెలిపింది. సత్యంబాబుపై ఉన్న కేసులను కోర్టులు కొట్టేసినప్పటికీ, అతన్ని పోలీసులు కరగడుగట్టిన నేరస్తుడిగా చిత్రీకరించారని పేర్కొంది. శక్తివంతమైన రాజకీయ కుటుంబాన్ని కాపాడేందుకు పోలీసులు తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని సత్యంబాబు చెబుతున్న దానిపై అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు తమ ముందున్న సాక్ష్యాలు సరిపోవడం లేదని తెలిపింది.

అది సూపర్‌మ్యాన్‌ మాత్రమే చేయగల ఫీట్‌...
‘8 అడుగుల గోడను రెండుసార్లు ఎక్కి దిగి, రెండోసారి రోకలి బండను ఓ చేత్తో పట్టుకుని ఆ గోడను ఎక్కి ఆయేషా గదికి సత్యంబాబు వెళ్లాడన్న పోలీసుల వాదనపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ‘5.5 అడుగుల ఎత్తు, 50 కేజీల బరువున్న వ్యక్తి 8 అడుగుల గోడను, ఒక చేత్తో రోకలి బండను పట్టుకుని, ఒంటిచేత్తో ఎక్కడం ఎలా సాధ్యం. ఇది సూపర్‌మ్యాన్‌ మాత్రమే చేయగల ఫీట్‌. సామాన్య వ్యక్తికి సాధ్యం కాని పని. అలాగే సాక్షుల వాంగ్మూలం, చార్జిషీట్‌లోని విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. తనకు ఐ లవ్‌ యూ చెప్పేందుకు నిరాకరించిందన్న కోపంతోనే ఆయేషాను సత్యంబాబు చంపాడని ఓసారి, లైంగిక వాంఛ తీర్చుకోవడానికే వెళ్లాడని మరోసారి పోలీసులు చెబుతున్నారు. అంతేకాక ఆయేషా గదికి వెళ్లి కాగితాలు, పెన్నులు, పెన్సిల్‌ తీసుకుని లేఖలు రాసినట్లు కూడా చెబుతున్నారు. ఇది నిజమైతే సత్యంబాబు అక్కడ చాలాసేపు ఉండి ఉంటాడు. అత్యాచారం, హత్య చేసిన వ్యక్తి అంతసేపు ఉంటాడా? పక్కనే 55 మంది ఇతర విద్యార్థినులు నిద్రిస్తున్నారు. మానవ నైజం ప్రకారం ఘోరమైన చర్యకు పాల్పడిన ఎటువంటి వ్యక్తయినా భయంతో ఘటనా స్థలం నుంచి వెంటనే పారిపోతాడు. కానీ సత్యంబాబు అలా చేయకుండా అక్కడే ఉండి తీరిగ్గా వెళ్లారని పోలీసులు చెప్పడం ఆమోదయోగ్యం లేదు. పోలీసులు చెప్పిన ఈ కథనాన్ని కింది కోర్టు నమ్మింది. కాని మేం మాత్రం నమ్మలేం.

అత్యాచారం పోలీసులు అల్లిన కథ...
అత్యాచార కథను పోలీసులే తెరపైకి తెచ్చారు. కోర్టును తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేశారు. చనిపోయిన, స్పృహలోలేని స్థితిలో మహిళ ఉన్నప్పుడు మర్మాంగాలకు గాయం కాకుండా సంభోగం జరపడం సాధ్యం కాదని వైద్య పుస్తకాలు చెబుతున్నాయి. ఆయేషా శరీరంపై గానీ, మర్మాంగంపై గానీ ప్రతిఘటనకు సంబంధించి ఎటువంటి గాయాలు లేవు. కాబట్టి ఆయేషాపై సత్యంబాబు ఒకటి కాదు రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారన్న పోలీసుల వాదనల్లో వాస్తవం లేదని తేలిపోయింది. అసలు ఆయేషా తల్లి అనుమానం చేసిన వ్యక్తికి నార్కో అనాలసిస్‌ టెస్ట్‌ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చినా.. పోలీసులు ఎందుకు ఆ టెస్ట్‌ చేయలేదో మాకు అర్థం కాకుండా ఉంది..’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పరిహారం చెల్లింపు ఆదేశాలిచ్చే పరిధి మాకు లేదు
సత్యంబాబు తప్పేమీ లేకపోయినా అతన్ని విచారించి.. హింసించి.. నిర్బంధించారని ధర్మాసనం తేల్చింది. సత్యంబాబు, అతని కుటుంబానికి జరిగిన దారుణమైన నష్టానికి, వారు అనుభవించిన శారీరక, మానసిక వ్యథకు ఆర్థికపరమైన పరిహారం చెల్లింపునకు ఆదేశాలు జారీ చేసే పరిధి తమకు లేనందున, అటువంటి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంపై దావా వేసే విషయంలో నిర్ణయాన్ని అతనికే వదిలేస్తున్నామంది. ప్రస్తుత కేసులో బాధ్యులెవరో గుర్తించి, వారిపై చట్ట ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఈ కేసును అపెక్స్‌ కమిటీకి నివేదించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

నేడు సత్యంబాబు విడుదల!
రాజమహేంద్రవరం క్రైం: హైకోర్టు సత్యంబా బును నిర్దోషిగా పేర్కొనడంతో.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేం ద్రవరం సెంట్రల్‌ జైలు వద్ద ఉత్కంఠ నెలకొంది. సత్యంబాబును 2010లో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌ కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి జైల్లోనే ఉండి విచారణ ఎదుర్కొంటున్నారు. శుక్ర వారం విడుదలకు కోర్టు ఆదేశించినా సం బంధిత పత్రాలు సెంట్రల్‌ జైలుకు రాలేదు. శనివారం హైకోర్టు నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత లాంఛనాలు పూర్తి కాగానే సత్యంబాబు విడుదలయ్యే అవకాశం ఉంది.

నా బిడ్డకు నరకం చూపించారు: సత్యంబాబు తల్లి మరియమ్మ
నందిగామ రూరల్‌ (నందిగామ): ‘నా కొడుకు నిర్దోషి అని మొదటి నుంచి చెబుతూనే ఉన్నా. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కేసులు బనాయించి ఎనిమిదేళ్లపాటు నా కుమారుడికి నరకం చూపించారు. నా బిడ్డను అష్టకష్టాలకు గురిచేసిన వారు అంతకంతకు అనుభవిస్తారు..’ అని పిడతల సత్యనారాయణ అలియాస్‌ సత్యంబాబు తల్లి మరియమ్మ ఉద్వేగపూరిత స్వరంతో వ్యాఖ్యానించారు.

ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబు ఎనిమిదేళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాడు. శుక్రవారం హైకోర్టు వెలువరించిన తీర్పుతో సత్యంబాబు స్వగ్రామమైన కృష్ణా జిల్లా నందిగామ పట్టణ శివారు అనాసాగరంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మరియమ్మ మాట్లాడుతూ.. తన కుమారుడి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సామాన్యులకు సైతం న్యాయం జరుగుతుందని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందన్న విషయం రుజువైందని అన్నారు. రోజూ తన కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ