Guntur: పల్లెల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌

Published on Mon, 06/20/2022 - 16:58

సాక్షి, గుంటూరు: ఏ పల్లెలోనూ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రతి వ్యక్తికీ రోజుకు సగటున 55 లీటర్ల నీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా 2024 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గతంలో ఒక వ్యక్తికి రోజుకు సగటున 45 లీటర్ల నీటిని అందించాలని, ఆ మేరకు తాగునీటి పథకాలను జలజీవన్‌ మిషన్‌లో భాగంగా విస్తరించాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.

అయితే మారిన జీవన ప్రమాణాల నేపథ్యంలో సగటున ఓ వ్యక్తికి రోజుకు 55 లీటర్లు అవసరమని గుర్తించి మళ్లీ ప్రతిపాదనలను తయారు చేశారు. ఈ పనులకు అక్టోబర్‌ 2020లో పాలనా అనుమతులు లభించగా, 2021లో మొదలయ్యాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వీటిని జిల్లాల వారీగా విభజించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) అధికారులు ఈ పనులు చేపడుతున్నారు.   


5,79,156 ఇళ్లకు కుళాయిలు 

2020 ఏప్రిల్‌ 1 నాటికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2,21,270 ఇళ్లకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. జల జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా 2024 నాటికి ఈ సంఖ్యను 5,79,156కి చేర్చాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం రూ.400.74  కోట్లతో 1,264 పనులు చేపట్టారు. వీటిని పని విలువను బట్టి విభజించి టెండర్లు పిలిచారు. కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇంకొన్ని టెండర్ల దశలో ఉన్నాయి.    


మూడు దశల్లో పనులు 

► జలజీవన్‌ మిషన్‌ పనులను మూడు దశలుగా విభజించారు.  

► తొలిదశలో ఇప్పటికే  సగటున ఓ వ్యక్తికి రోజుకు 40 లీటర్లు ఇస్తున్న గ్రామాల్లో అందుబాటులో ఉన్న పథకాలను విస్తరించడం, అంతర్గత పైపు       లైన్లను నిర్మించడం చేయనున్నారు.  

► రెండో దశలో ఇప్పటికే ఉన్న పథకాలకు అదనపు నీటి సదుపాయాలను సమకూర్చనున్నారు.  

► మూడో దశలో తాజా ప్రతిపాదనల మేరకు కొత్త పథకాల నిర్మాణం చేపట్టనున్నారు.   

► ఉపరితల జలాల లభ్యత లేని ప్రాంతాల్లో మాత్రమే భూగర్భ జలాలను వినియోగించేలా పథకాల నిర్మాణానికి కార్యాచరణ 
రూపొందిస్తున్నారు.  

► జలజీవన్‌ మిషన్‌ పథకాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం పెంచడానికి విలేజ్‌ వాటర్‌ శానిటేషన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో 25 శాతం మహిళలు, వార్డు మెంబర్లకు, 50 శాతం వెనకబడిన తరగతుల వారీకి సభ్యులుగా అవకాశం కల్పించారు. వీరికి అవసరమైన శిక్షణ ఇచ్చి తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వాటి సమగ్ర వినియోగంపై దృష్టిసారించేలా చూడనున్నారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ