బీజేపీలో చేరికపై తొందరొద్దు..! ఊగిసలాటలో ఈటల...

Published on Fri, 05/28/2021 - 01:58

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజకీయ భవిష్యత్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. దీనితో ఆయన తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెల కొంది. బీజేపీలో చేరడం దాదాపు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో గురు వారం జరిగిన రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఈటలను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమంటూ గురువారం బీజేపీ శిబిరం స్పష్టమైన సంకే తాలు ఇచ్చింది. అదే సమయంలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు విశాల రాజ కీయ వేదిక నిర్మాణం కోసం కలసి పనిచేద్దా మంటూ టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ఇదిలా ఉంటే బీజేపీలో చేరడంపై మాజీ మంత్రి ఈటల ఇప్పటికే తన సన్నిహితులకు చూచాయగా వెల్లడించారు. రాజకీయంగా తనను అణగదొక్కడంతో పాటు భూకబ్జా కేసుల్లో కుటుంబసభ్యులను కూడా వేధింపులకు గురి చేస్తుండటంతో బీజేపీలో చేరేందుకే ఈటల మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఆయన ఆ పార్టీ జాతీయ నాయకులతోనూ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఆయన చేరికకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని సమాచారం.

బీజేపీలో చేరికపై తొందరొద్దు! 
ఈటల బీజేపీలో చేరతారంటూ రెండు రోజులుగా వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో కోదండరాం, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గురువారం షామీర్‌పేటలోని ఈటల నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేసీఆర్‌ రాజకీయ వేధింపులతో ఇబ్బంది పడుతున్న ఈటలకు నైతిక మద్దతునిచ్చేందుకే వచ్చినట్లు కోదండరాం, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. అయితే ఈటలతో జరిగిన అంతర్గత భేటీలో మాత్రం బీజేపీలో చేరిక, విశాల రాజకీయ వేదిక వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.

బీజేపీలో చేరికపై తొందర పాటు నిర్ణయం వద్దని వివరించినట్లు తెలిసింది. బీజేపీలో చేరితే ఈటల రాజకీయ భవిష్యత్తుకు జరిగే నష్టం, ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించడంలో ఈటల పాత్ర, కలసి వచ్చే వారితో సమన్వయం చేసుకోవాల్సిన తీరుపై ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది.

బీజేపీ పచ్చజెండా?
కొద్ది రోజులుగా ఈటల రాజేందర్‌తో వరుస మంతనాలు జరుపుతున్న బీజేపీ కీలక నేతలు ఆయన చేరికకు సంబంధించి పార్టీలో అంతర్గతంగా అభిప్రాయ సేకరణ జరిపినట్లు సమాచారం. ఈటల చేరికపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని రాష్ట్ర ముఖ్య నేతలు అధిష్టానానికి సంకేతాలు పంపారు.

ఇదిలా ఉంటే గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జరిగిన వర్చువల్‌ భేటీలోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రస్తావించారు. ఈటల కూడా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్, మాజీ ఎంపీ వివేక్‌ తదితరులతో నిరంతరం ఫోన్‌ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఈటల చేరిక ముహూర్తం ఒకట్రెండు రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉండగా, ఢిల్లీలోనే ఈటల చేరిక కార్యక్రమం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అవినీతి ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన ఈటలను పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీజేపీపై ధిక్కార స్వరం వినిపించారు. అంతర్గత అభిప్రాయ సేకరణ చేసిన పార్టీ తనను పరిగణనలోకి తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఊగిసలాటలో ఈటల
తమ పార్టీలో ఈటల చేరడం ఖరారైందని బీజేపీ శిబిరం నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తున్నా ఈటల మాత్రం చేరికకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయట్లేదు. భూ వివాదాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వెళ్తుండటంతో బీజేపీలో చేరాలనే ఒత్తిడి కూడా ఈటలపై పెరుగుతున్నట్లు సమాచారం. బీజేపీలో చేరితో తనకు ఎవరు దూరం అవుతారానే కోణంలో ఈటల విశ్లేషించుకుంటున్నారు.

బీజేపీలో చేరికపై బహిరంగ ప్రకటన చేయడానికి ముందు హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన తన అనుచరులతో మరోమారు భేటీ కావాలనే యోచనలోనూ ఈటల ఉన్నారు. రాష్ట్ర అవతరణ దినం జూన్‌ 2లోగా ఈటల భవిష్యత్‌ రాజకీయ ప్రస్తానంపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ