Thopudurthi Prakash Reddy: శ్రీరామ్‌.. నోరు జాగ్రత్త 

Published on Sat, 08/13/2022 - 07:21

సాక్షి, అనంతపురం: ‘నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న పోలీసులపై నోరుపారేసుకోవద్దు. ఎన్నో ఏళ్లు నేరాలు చేస్తూ చట్టానికి చిక్కకుండా తిరిగిన ఎందరినో పోలీసులు కటకటాలపాలు చేశారు. జాగ్రత్తగా మసలుకో.. లేకుంటే నీకూ అదే గతి పడుతుంది’ అంటూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌కు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. రామగిరి పోలీసులపై శ్రీరామ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు.

శుక్రవారం ఆయన అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా దౌర్జన్యం, రౌడీయిజంతో ప్రజలను భయపెట్టి నిర్మించుకున్న చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిందన్నారు. చంద్రబాబునాయుడు, నారా లోకేష్, పార్టీ లేదు బొక్కా లేదు అని అచ్చెన్నాయుడు చెప్పినట్టు టీడీపీ చరిత్ర కూడా మసకబారిపోయిందన్నారు. అధికారంలోకి వచ్చేస్తాం.. ఏమైనా చేసేస్తాం అనే కలలు కనడం మాని.. వాస్తవంలోకి రావాలన్నారు.

రామగిరి పోలీసులపై ‘కొడకల్లారా’ అంటూ అనుచితంగా మాట్లాడిన శ్రీరామ్‌ను పోలీసులు కూడా తిరిగి మాట్లాడితే.. అంతటి అవమానకరం మరొకటి ఉండదని, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. పరిటాల కుటుంబ నియంతృత్వ, పెత్తందారీ పోకడలు చరిత్రలో కలిసిపోయాయని, ప్రస్తుతం రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లిలో పోలీసులు నీతి, నిజాయితీతో పని చేస్తున్నారని ప్రశంసించారు. ఇప్పుడిప్పుడే ఈ ప్రాంత ప్రజల బానిస సంకెళ్లు తెగిపోయాయన్నారు. మీ వద్ద ఉన్న రౌడీషీటర్లు, హంతకులు, దౌర్జన్యపరుల ఆటలు ఇకపై సాగబోవన్నారు.

పరిటాల సునీత తమ్ముడిపై కూడా రౌడీషీట్‌ ఓపెన్‌ చేసి పలక పట్టించిన పోలీసులు ఉన్నారన్నారు. జాగ్రత్తగా మసలుకోకుంటే నీకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ‘పోలీసులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న నీవు గన్‌మెన్‌లు లేకుండా తిరుగు.. అప్పుడు తెలుస్తుంది దమ్ము,  ధైర్యం ఎంత ఉందో’ అని అన్నారు. ‘మా ప్రభుత్వం వచ్చిన తరువాత మీకు గన్‌మెన్లను పెంచాం, మేము రక్షించుకునే ప్రాణాలు కనుక మిమ్మలను స్వేచ్ఛగా తిరగనిస్తున్నాం. అది తెలుసుకొని మసులుకో శ్రీరామ్‌. మీరు చరిత్ర డప్పు కొట్టుకోవడం కాదు... మిమ్మల్ని ఎవ్వరూ లెక్క చేయరు తెలుసుకో’ అని అన్నారు. 

మీరేం చేశారు.. మేమేం చేశామో తెలుసుకుంటాం 
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చెప్పారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో తాము బిజీగా ఉన్నామని.. త్వరలోనే మీ ఊరికి కూడా వస్తామని.. అక్కడ మీరు ఏమి చేశారు.. మా ప్రభుత్వం ఏమి చేసింది.. ఏమి చేస్తోందో ప్రజల ద్వారానే తెలుసుకుంటామన్నారు. 2019 ఎన్నికల్లో 26వేల ఓట్ల తేడాతో ప్రజలు మిమ్మల్ని ఓడించినా ఆత్మావలోకనం చేసుకోలేకపోతున్నారని శ్రీరామ్‌ను ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా టీడీపీ మద్దతుదారులు చతికిలపడ్డారని గుర్తు చేశారు.

ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో విషయంలో ఎస్పీ ప్రెస్‌మీట్‌ పెట్టి స్పష్టత ఇచ్చినా దిగజారుడు విమర్శలు చేయడం తగదన్నారు. రాబోవు రోజుల్లో టమాట రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పరిశ్రమలకు వేలాది ఎకరాలు కేటాయించి అభివృద్ధికి దోహదపడతామన్నారు. విలేకరుల సమావేశంలో అనంతపురం జెడ్పీటీసీ సభ్యుడు  చంద్రకుమార్, రాప్తాడు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ