శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ముస్తాబవుతోన్న శ్రీరామనగరం

Published on Fri, 01/21/2022 - 10:22

సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌ రూరల్‌: సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ముహూర్తం సమీపిస్తోంది. ముచ్చింతల్‌ సమీపంలోని శ్రీరామనగరం సుందరంగా ముస్తాబవుతోంది. విగ్రహాలకు, ఫౌంటెన్లకు రంగులు అద్ది తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రధాన ఆలయం సహా చుట్టూ ఉన్న ఆలయ గోడలకు, వాటి మెట్లకు, శిలాస్తంభాలకు, ఫ్లోర్స్‌కు అమర్చిన మార్బుల్స్‌ను ముస్తాబు చేస్తున్నారు. ఒకవైపు ఫౌంటెన్‌ సహా సమతామూర్తి విగ్రహం చుట్టూ మిరిమిట్లుగొలిపేలా లైటింగ్‌ పనులు చేపడుతున్నారు. మరోవైపు అంతర్గత రోడ్లు, ఫ్లోరింగ్, గార్డెన్‌లో వివిధ రకాల పూల, ఔషధ మొక్కలు నాటుతున్నారు. ఇంకోవైపు యాగశాలల నిర్మాణాలు, ఇందుకు అవసరమైన పిడకలను తయారు చేస్తున్నారు. నిత్యం 500 మంది కూలీలు నిర్విరామంగా పని చేస్తున్నారు. 
 

2 నుంచి 14 వరకు సహస్రాబ్ది సమారోహం.. 
► ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం పేరిట ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. శ్రీరామనగరంలో  ప్రతిష్ఠించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ప్రధాన మందిరంలో 120 కిలోల బంగారంతో రూపొందించిన 54 అంగుళాల రామానుజ నిత్యపూజా మూర్తిని 13న రాష్ట్రపతి రామ్‌నా«థ్‌ కోవింద్‌ తొలి దర్శనంతో ప్రారంభిస్తారు.  

చదవండి: యూకేలో ఉద్యోగమంటూ.. మాయ మాటలతో బుట్టలో వేసుకొని

► 216 అడుగుల ఎత్తైన రామానుజల మహా విగ్రహం చుట్టూ 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకం కొనసాగుతుంది. శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే.. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, భద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, కుంభకోణం.. ఇలా మొత్తం 108 ప్రధాన వైష్ణవ గర్భాలయాల ఆకృతిలో ఆలయాలు, దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. ఆయా విగ్రహమూర్తులకు రంగులద్ది తుది మెరుగులు దిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు.  
చదవండి: Warangal: ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-6 బోగీలో పొగలు

శరవేగంగా రహదారుల విస్తరణ  
►  ఇటు బెంగళూరు జాతీయ రహదారి నుంచి శ్రీరామనగరం మీదుగా అటు పెద్ద గోల్కొండ సమీపంలోని సంగీగూడ చౌరస్తా వరకు 9 కిలోమీటర్ల మేర 13 మీటర్ల పాటు రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.  
► ఎన్‌హెచ్‌ 44 నుంచి పెద్దషాపూర్‌ తండా చౌరస్తా– గొల్లూరు– అమీర్‌పేట్‌ మీదుగా రూ.17.50 కోట్లతో 8 కి.మీ మేర తొమ్మిది మీటర్ల చొప్పున రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి.  


► ఎన్‌ 44 మదనపల్లి క్రాస్‌ రోడ్డు నుంచి ముచ్చింతల్‌ మీదుగా చిన్న తూప్రాన్‌ వరకు రూ.15.50 కోట్లతో 5 కి.మీ మేర సీసీ రోడ్డును 10 మీటర్లకు విస్తరించారు. ఇవి కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. అతిథులకు ఆహ్వానం పలుకుతూ రోడ్డు మధ్యలోనే కాకుండా ఇరు వైపులా వివిధ రకాల మొక్కలు నాటుతున్నారు.  

నిరంతర విద్యుత్‌ సరఫరా.. తాగునీరు  
► రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా ట్రాన్స్‌కో, డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు ఏర్పాట్లు చేస్తున్నా యి. ఇప్పటికే ముచ్చింతల్‌ సమీపంలో 33/11కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ.30 లక్షల అంచనా వ్యయంతో ముచ్చింతల్‌ ఆవరణలో తాత్కాలిక విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేశారు.  
► రోజుకు సగటున 15 లక్షల తాగునీరు అందించేలా ముచ్చింతల్‌ ప్రధాన లైన్‌ నుంచి సమతామూర్తి కేంద్రంలో ఉన్న సంపులకు మిషన్‌ భగీరథ అధికారులు కనెక్షన్లు ఇచ్చారు.    

 

ఆవుపేడతో పిడకలు సిద్ధం 
► హోమకుండలాల్లో వినియోగించేందుకు ఆవు పేడతో ప్రత్యేకంగా తయారు చేసిన పిడకలు వాడనున్నారు. ఇప్పటికే ఇదే ప్రాంగణంలో ప్రత్యేక యంత్రం సహాయంతో వీటిని తయారు చేసి ఎండకు ఆరబెట్టారు. ఎండిన పిడకలను ప్లాస్టిక్‌ కవర్‌లో భద్రపరిచి, హోమకుండలాల వద్దకు చేర్చే పనిలో నిమగ్నయయ్యారు. 
► పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి హోమకుండలంలో రోజుకు నాలుగు కేజీల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించనున్నారు. ఇలా ఒక్కో యాగశాలలోని తొమ్మిది హోమ కుండలాల్లో రోజుకు 72 కేజీల చొప్పున మొత్తం రెండు లక్షల కేజీల ఆవు నెయ్యిని రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని స్వచ్ఛమైన దేశీయ ఆవు పాల నుంచి సేకరించి తీసుకొచ్చారు.  

పద్మపత్రాలు విచ్చుకునేలా ఫౌంటెన్‌.. 
► సందర్శకులను ఆకర్షించే విధంగా ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించగానే సమతామూర్తికి ఎదురుగా 45 అడుగుల ఎత్తుతో ఉండే డైనమిక్‌ ఫౌంటెన్‌ స్వాగతం పలుకుతుంది. అష్టదశ పద్మాకృతితో ఉండే ఈ ఫౌంటెన్‌లో పద్మ పత్రాలు విచ్చుకునేలా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా విన్పిస్తుంటాయి. ప్రధాన ఫౌంటెన్‌ సహా ప్రధాన ఆలయం చుట్టు లేజర్‌షో, అత్యాధునిక లైటింగ్, సౌండ్‌ సిస్టం పనులు సైతం తుది దశకు చేరుకున్నాయి.

 వెదురు బొంగులు.. తాటి కమ్మలతో..  
శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో 144 యాగశాలలు నిర్మించారు. వీటిని పూర్తిగా తాటి కమ్మలు, వెదురు బొంగులతో ఏర్పాటు చేశారు. యాగశాల నిర్మాణం పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. 


(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 
► ఈ క్రతువుకు దేశం నలుమూలల నుంచి 5 వేల మంది రుత్వికులు, వేద పండితులు పాల్గొననున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా యాగాలు  కొనసాగుతాయి.   
► నాలుగు దిక్కుల్లో 36 చొప్పున యాగశాలల సమూహం ఉంటుంది. మొత్తం 144 చోట్ల యాగాలు జరుగుతుంటాయి. మిగిలినవి సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్యపారాయణ మండపాలు, రెండు ఇష్టశాలలు ఉన్నాయి. వీటిలో 1035 హోమ కుండాలు నిర్మించారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో నిత్యం కోటిసార్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని విన్పిస్తుంటారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ