చంద్ర గ్రహణం

22 Jan, 2019 13:12 IST|Sakshi

సమస్యల పరిష్కారం కోసం సిబ్బంది పోరుబాట నేటి నుంచి   నిరవధిక సమ్మె

జిల్లా వ్యాప్తంగా నిలిచిపోనున్న 104 వైద్యసేవలు

నెల్లూరు(బారకాసు): నాలుగేళ్లు ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల వేళ తాయిలాలను ప్రకటిస్తున్న చంద్రబాబు సర్కార్‌ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవల కోసం అమలు చేస్తున్న సంచార చంద్రన్న వైద్యసేవను గాలికొదిలేసింది. ఈ సేవలు కింద పనిచేస్తున్న సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం రెండేళ్లుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన సైతం కరువైంది. దీంతో వారు సర్కార్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం నుంచి సమ్మెబాట పట్టనున్నారు. దీంతో సంచార వైద్యసేలకు బ్రేక్‌ పడనుంది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గ్రామీణ ప్రజలకు సత్వర వైద్యసేలందించేలా 104 సేవలను ప్రవేశపెట్టారు. ఆయన హయాంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతరం వైద్యసేవలందేవి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక  చంద్రన్న సంచార సేవగా మార్పు చేసింది. పేరయితే ఘనంగా మార్పు చేసింది కాని ఆ దిశలో వైద్య సేవలందించడంలో పూర్తిగా విఫలమైంది. 104 వాహనాలకు సరిపడా మందులు సక్రమంగా ఇవ్వడంలేదు. పెట్రోల్, డీజిల్‌ ఖర్చులకూ డబ్బు మంజూరు చేయడం లేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. మరమ్మతులకు గురైతే వాహనాలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని అంటున్నారు. 2008లో 104 పథకం హెచ్‌ఎంఆర్‌ఐ సంస్థ, 2011లో డీఎంహెచ్‌ఓ పరిధిలో నడిచింది. 2016 నుంచి పిరామిల్‌ స్వాస్థ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(పీఎస్‌ఎంఆర్‌ఐ) సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి సేవలు పేలవంగా మారాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అనేకసార్లు అర్జీలు అందజేసినా ప్రభుత్వం సానుకూలస్పందన లేకపోవడంతో, గత్యంతరం లేక మరోమారు సిబ్బంది పోరుబాట పట్టనున్నారు. చంద్రన్న సంచార చికిత్స(104) కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) పిలుపు మేరకు మంగళవారం నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారులకు సమ్మె నోటీసులను కూడా అందజేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 104 సంచార వాహనం ద్వారా అందే వైద్యసేవలు నిలిచిపోనున్నాయి.

జిల్లాలో మొత్తం 20 చంద్రన్న సంచార చికిత్స(104) వాహనాలున్నాయి. ఇందులో డ్రైవర్లు 22, ఫార్మాసిస్టులు 22, ల్యాబ్‌టెక్నీషియన్లు 20, ఎఎన్‌ఎంలు 22, వాచ్‌మెన్‌లు 7మంది ఉన్నారు.

ప్రధాన డిమాండ్‌లు ఇవీ..
చంద్రన్న సంచార చికిత్స వాహన సేవలను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలి.
2018 మే 1 నుంచి ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రొసీడింగ్స్‌ ఆర్‌సీ నంబర్‌ 3918–సీఎస్సీ–2018 ప్రకారం వేతనాల నుంచి చట్టప్రకారం పీఎఫ్, ఈఎస్‌ఐకి ఉద్యోగస్తుని వాటా మాత్రమే మినహాయించి వేతనాలు చెల్లించాలి.
పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా డైలీ ఫుడ్‌ అలవెన్స్‌ రూ.150కి పెంచాలి.
2/94 యాక్ట్‌ను సవరించి ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి. రెగ్యులరైజేషన్‌లోగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
హెచ్‌ఎంవీ నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టిన డ్రైవర్లకు హెచ్‌ఎంవీ ప్రకారం వేతనం చెల్లించాలి.
11వ పీఆర్సీని ప్రారంభ తేదీ నుంచి వర్తింపజేయాలి.
వాహనాల్లో మెరుగైన సేవల కోసం డేటాఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలి. ఈ ఔషధి వీహెచ్‌ఎన్‌డీ డేటా చేస్తున్న ఫార్మాసిస్ట్, నర్సులకు పీహెచ్‌సీలలో మాదిరిగా అదనపు పారితోషికం చెల్లించాలి.
చంద్రన్న సంచార చికిత్స వాహనాలకు ఆర్‌సీ, ఇన్సూరెన్స్, రోడ్‌ట్యాక్స్, ఫిట్‌నెస్‌ కల్పించి పూర్తి స్థాయిలో మరమ్మతులు నిర్వహించాలి.
పీఎఫ్, ఈఎస్‌ఐలను సక్రమంగా అమలు చేయాలి. మహిళలకు 180రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్‌ సౌకర్యం కల్పించాలి.
కార్మిక చట్టాలు సక్రమంగా అమలు చేయాలి.
అక్రమ బదిలీలు, తొలగింపులు రద్దు చేయాలి.
అన్ని పార్కింగ్‌ ప్రదేశాలలో వాచ్‌మెన్‌లను నియమించాలి. అదనపు పనిగంటలకు అదనపు పారితోషికం చెల్లించాలి.
గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏజెన్సీ అలవెన్స్‌ చెల్లించాలి.

మరిన్ని వార్తలు