రాజధానిలో ప్రమాదం జరిగితే అంతేనా!

18 Jan, 2019 13:17 IST|Sakshi
ప్రమాదంలో తలకు బలమైన గాయం తగలడంతో మహిళకు సపర్యలు చేస్తున్న భర్త, పక్కన ఏడుస్తున్న చిన్నారులు

రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు

108 వాహనాన్ని సీఎం సభకు తరలించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆలస్యం

రాజధానిలో వరుస ప్రమాదాలతో క్షతగాత్రులకు తప్పని ఇబ్బందులు

కలగానే మిగిలిన రాజధానికి ప్రత్యేక 108 వాహనం కేటాయింపు

గుంటూరు, తాడికొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత రాజధానిలో పేదవాడికి చోటులేదు సరికదా.. జరగరానిది ఏదైనా జరిగితే కనీస అత్యవసర వైద్యం అందించేందుకు 108 వాహనం కూడా అందుబాటులో లేదంటే అతిశయోక్తి లేదు.  తాడికొండ శివారు గొడుగు కంపెనీ వద్ద గురువారం ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ కుటుంబ సభ్యులకు హఠాత్తుగా గేదె అడ్డు రావడంతో వాహనం అదుపుతప్పి మహిళ పడిపోయింది.

తలకు బలమైన గాయం తగలడంతో స్పృహ తప్పిన ఆమెను 108 వాహనంలో పంపించాలనే ఆత్రుతతో పలువురు ఫోన్‌ చేసినా స్పందన కరువైంది. చివరకు ఆరాతీయగా తాడికొండ మండలానికి చెందిన 108 వాహనం ఐనవోలులో సీఎం సభకు వెళ్లడంతో అందుబాటులో లేదని తెలిసింది. స్పందించిన స్థానికులు అటుగా వెళుతున్న కారును ఆపి, బతిమాలి స్థానిక గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఆటోలో గుంటూరుకు తరలించారు. చిన్నారులతో ప్రయాణం చేస్తూ ప్రమాదం పాలైన ఆ జంటకు ఆపద సమయంలో 108 వాహనం రాకపోవడంతో ‘రాజధానిలో ఇదేం ఖర్మ!’ అంటూ పలువురు ప్రభుత్వ పనితీరుపై బహిరంగ చీవాట్లు పెట్టారు.

పెరిగిన ప్రమాదాలు
రాజధాని నేపథ్యంలో పెరిగిన వాహనాల రాకపోకల దెబ్బకు ప్రమాదాలు కూడా అదే రీతిలో పెరిగాయి. 108 వాహనాన్ని రాజధానికి ప్రత్యేకంగా కేటాయించాలని ప్రజలు పలుమార్లు రాజధాని వాసులు ఎమ్మెల్యేలను కోరినా స్పందించిన నాథుడు లేడు. దీంతో తాడికొండ, తుళ్లూరు మండలాలకు చెందిన పలువురు ఆపద సమయంలో నానా అగచాట్లు పడుతున్నారు. ప్రపంచ గొప్ప రాజధాని నిర్మాణం అంటూ పదేపదే ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబుకు, ఆయన ప్రభుత్వ పెద్దలకు రాజధానిలో కనీస అత్యవసర సదుపాయమైన 108 వాహనాన్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు