పేదోడి గూడు ‘భారం’

21 Sep, 2013 02:09 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం : గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో పేదల ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాల్సిన బకాయిలు పెరుకుపోయాయి. ఫలితంగా ఇంటి నిర్మాణం పూర్తిచేయలేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.  హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 123మంది  ఉద్యోగులకు గానూ ముగ్గురు మినహా 120మంది సమ్మె చేస్తున్నారు. డీఈ, ఏఈ, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది సమ్మెలో పాలుపంచుకుంటున్నారు. కాగా, హౌసింగ్ ప్రాజెక్ట్ డెరైక్టర్(పీడీ) ప్రదీప్‌కుమార్, హౌసింగ్ స్పెషల్ ఆఫీసర్,  ఈ నెలాఖరున రిటర్మెంట్ కానున్న  ఉద్యోగి ఒకరు విధులు నిర్వర్తిస్తున్నారు.  

ఈ ఏడాది జిల్లాలో 26,496ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 2,643ఇళ్లు ఇప్పటికే పూర్తి కాగా, మిగిలిన 23,853ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఓసీ, బీసీలకు ఒక్కో ఇంటికి రూ.70వేలు, పట్టణ ప్రాంతాల్లోని ఓసీ, బీసీలకు రూ.80వేలు, ఎస్సీలకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.1.05లక్షలు మంజూరు చేస్తారు. మంజూరైన మొత్తంలోనే ఒక్కో ఇంటికి 70బస్తాల వరకు సిమెంట్ ఇస్తారు.

ఆ ఇళ్లకు వాటికి పునాది, బేసమెంట్, రూఫ్, పైకప్పు స్థాయిల్లో ఎప్పటికప్పుడు బిల్లులు ఇవ్వాల్సి ఉంటుంది. వాటికి దశల వారీగా ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేస్తేనే లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తిచేసుకోగలుగుతాడు. నెల రోజులకుపైగా గృహనిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది సమ్మెలో ఉండటంతో బిల్లులు మంజూరు కాలేదు.  సుమారు రూ.3కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

 సమ్మె సడలించిన వెంటనే బిల్లులు..

 జిల్లాలో గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు సమ్మె సడలించిన వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా గృహనిర్మాణ శాఖ పీడీ ప్రదీప్‌కుమార్ చెప్పారు. బిల్లుల పెండింగ్‌పై ఆయన్ను సాక్షి వివరణ కోరింది. తమ శాఖకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది సమ్మెలో ఉన్నందునా బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగిందని  చెప్పారు. సమ్మె సడలించిన వెంటనే  బిల్లులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు