మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు

12 Dec, 2023 00:42 IST|Sakshi

కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్నాహాలు 

గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించే అవకాశం!  

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌ సమీక్ష 

నివేదికలు సిద్ధం చేస్తున్న అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు సిద్ధమవుతున్న ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం, తిరిగి గృహనిర్మాణ శాఖను పునరుద్ధరించబోతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పేదల కోసం లక్షల సంఖ్యలో ఇళ్లను నిర్మించారు. ఆ సమయంలో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. అవినీతి ఆరోపణలు చేస్తూ సీఐడీతో దర్యా ప్తు చేయించింది.

చివరకు గృహ నిర్మాణ శాఖే లేకుండా చేసింది. రోడ్లు భవనాల శాఖలో ఓ విభాగంగా మార్చేసింది. అందులోని సిబ్బంది వివిధ శాఖలకు బదిలీ అయ్యారు. కాగా త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి గృహ నిర్మాణాలకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం అందటంతో, ఆగమేఘాల మీద అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ శాఖను పునరుద్ధరించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది.  

వైఎస్‌ హయాంలో 14 లక్షల ఇళ్లు 
డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలంగాణ పరిధిలో ఏకంగా 14 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మితమయ్యాయి. 2004–2009 మధ్యలో ఈ ఇళ్లు రూపొందగా, ఆ తర్వాత 2014 వరకు కేవలం నాలుగున్నర లక్షలు మాత్రమే నిర్మితమయ్యాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత, ఇందిరమ్మ తరహా ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేసి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది.

అయితే తొమ్మిదేళ్లలో లక్షన్నర ఇళ్లను కూడా పూర్తి చేయలేకపోయింది. తర్వాత గృహలక్ష్మి పేరు తో ఇందిరమ్మ తరహా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినా, దరఖాస్తులు స్వీకరించే సమయానికి ఎన్నికలు రావటంతో అది కాస్తా ఆగిపోయింది. ఇప్పు డు కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో మళ్లీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. గృహలక్ష్మి పథకంలో లబ్ధిదారులకు రూ.3 లక్షలు చొప్పు న ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంటి యూనిట్‌ కాస్ట్‌ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది.  

అదనంగా సిబ్బంది కావాల్సిందేనా..? 
గృహనిర్మాణ శాఖలో 1983–87 మధ్య సిబ్బంది నియామకం జరిగింది. ఆ తర్వాత కొన్ని బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ మాత్రమే జరిగింది. కాలక్రమంలో చాలామంది పదవీ విరమణ చేశారు. అయితే రిటైర్మెంట్‌ వయసు పెంపు కారణంగా మొత్తం మీద 500 మంది వరకు ఉండగా, శాఖను రద్దు చేయటంతో 450 మంది వివిధ శాఖలకు బదిలీ అయ్యారు. దీంతో కేవలం 50 మంది మాత్రమే ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కొనసాగించాలంటే పాత సిబ్బంది తిరిగి రావటమే కాకుండా, అదనపు సిబ్బంది కావాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్‌ అధికారుల సేవలను వినియోగించుకుంటే మంచిదన్న సూచనలు అందుతున్నాయి.  

ఆ దరఖాస్తులేం చేస్తారు? 
గత ప్రభుత్వం చివరలో ప్రారంభించిన గృహలక్ష్మి పథకం కోసం 14 లక్షల దరఖాస్తులు అందాయి. వాటిల్లో అర్హమైనవి 11 లక్షల వరకు ఉన్నట్టు గుర్తించారు. ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్‌ రావడం, బీఆర్‌ఎస్‌ అధికారాన్ని కోల్పోవడంతో ఇప్పుడా పథకమే లేకుండా పోనుంది. దీంతో ఆ దరఖాస్తులను ఏం చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 

>
మరిన్ని వార్తలు