నల్లమలలో 25 రకాల పాము జాతులు

3 Sep, 2018 12:30 IST|Sakshi
నల్లమలలో సంచరించే తాచుపాము

ప్రకాశం, మార్కాపురం:పాము అంటే ఎవరికైనా భయమే. అయితే అందులో కొన్ని పాములు మాత్రమే విషాన్ని కలిగి ఉంటాయి. ఆ పాములు కాటేస్తే మృత్యువు ఖాయం. గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో 25 రకాల పాములు ఉన్నాయి. ఇందులో 5 జాతుల పాములు అత్యంత ప్రమాదకరమైనవని పరిశోధకులు గుర్తించారు. నాగుపాము, కట్ల పాము, రక్త పింజర, తాచుపాము, సముద్రపు పాము.. ఇవి కాటేస్తే తక్షణమే చికిత్స పొందాలి. లేకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. నల్లమలలో ఇంకా జర్రిపోతు, కొండ చిలువ, మట్టిపాము, దాసరి పాము, పసిరిక పాము ఇలా అనేక రకాల జాతుల పాములు ఉన్నాయి. ఇటీవల కాలంలో పాము కాటుకు పలువురు గురవుతున్నారు. ముఖ్యంగా కృష్ణాజిల్లా ఆవనిగడ్డ ప్రాంతంలో పాములు విజృంభిస్తున్నాయి. సుమారు 70 మందికిపైగా పాము కాటుకు గురయ్యారు. నల్లమల అటవీ ప్రాంతంలోని సమీప గ్రామాలైన చినారుట్ల, పెదారుట్ల, తుమ్మలబైలు, పాలుట్ల, బంధంబావి, పణుకుమడుగు, చెర్లోపల్లె, నల్లగుంట్ల తదితర గిరిజన గూడేల్లో సంచరిస్తుంటాయి. కొండచిలువ ప్రధానంగా గొర్రెలు, మేకలు, కుందేళ్లు, తదితర జంతువులను తింటుంది. పసిరిక పాము చెట్లపైనే ఉంటూ తనపై దాడి చేస్తారని తెలిస్తే మనిషి కంటిపై కాటు వేస్తుంది. నల్లమల అటవీ ప్రాంతంలో చెట్లపై ఎగిరే పాములు కూడా ఉన్నాయని డీఎఫ్‌ఓ జయచంద్రారెడ్డి తెలిపారు.

పాములను చంపొద్దు: పాము కనిపించగానే చాలా మంది చంపుతున్నారు. అన్ని పాముల్లో విషం ఉండదు. తమను చంపుతారనే తెలిస్తేనే అవి కాటేస్తాయి. శబ్ధం ఆధారంగానే పాము కదలికలు ఉంటాయి. నల్లమలలో 25 జాతుల పాములు ఉన్నాయి. రాష్ట్రంలో 300 రకాల పాములు ఉన్నాయి. ఇందులో కొండ చిలువలు కూడా ఎక్కువగా ఉన్నాయి. పాములతో రైతులకు ఉపయోగాలు ఉన్నాయి. పొలాల్లో ఎలుకలు, తొండలను తింటూ జీవిస్తుంటాయి. పాములపై పరిశోధనలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా నాగార్జున సాగర్‌ వద్ద స్నేక్‌ సొసైటీని స్థాపించి ప్రజలకు అవగాహన కల్పించాం. ఇక్కడ కూడా అలాంటి సొసైటీని ఏర్పాటు చేస్తాం. పది రోజుల కిందట విజయపూరి సౌత్‌ వద్ద 40 పాములు కనిపిస్తే వాటిని చంపకుండా అడవుల్లోకి వదలి పెట్టాం. పాము కాటు వేయగానే ఆ ప్రాంతంలో రక్తాన్ని వెంటనే బయటకు తీయాలి. వైద్యుడి వద్దకు వెళ్లి ఇంజెక్షన్‌ చేయించుకోవాలి. -జయచంద్రారెడ్డి, డీఎఫ్‌ఓ

మరిన్ని వార్తలు