4.16 లక్షల ఎకరాల్లో తొలిపంటకు నీళ్లు

24 Sep, 2014 02:40 IST|Sakshi
4.16 లక్షల ఎకరాల్లో తొలిపంటకు నీళ్లు

సాక్షి, నెల్లూరు : సోమశిల జలాశయంలో క్రమేణా నీటిమట్టం పెరుగుతుండటంతో సాగుపై రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 4,16,640 ఎకరాల్లో తొలిపంట సాగుకు నీటి సరఫరాకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. జలాశయంలోని నీటి ప్రవాహాన్ని బట్టి మొత్తం ఆయకట్టుకు నీళ్లు ఇవ్వనున్నట్టు తెలిసింది. నీటి విడుదలపై 26న కలెక్టర్ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగే జిల్లా సాగునీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. బుధవారం నాటికి సోమశిల జలాశయంలో నీటిమట్టం 35 టీఎంసీలకు చేరింది. మరో రెండు రోజుల్లో 38 టీఎంసీలకు చేరే అవకాశముంది. అక్టోబర్‌లో మరో 12 టీఎంసీలు, నాట్లు వేసే సమయమైన నవంబర్‌లో 6 టీఎంసీలు, డిసెంబర్‌లో మరో 6 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అధికారుల అంచనా. మొత్తంగా సోమశిల జలాశయంలోకి 62 టీఎంసీల నీరు చేరనుంది. 7.5 టీఎంసీల డెడ్ స్టోరేజీ, 1.5 టీఎంసీల ఆవిరినష్టం, 3 టీఎంసీలు తాగునీటి అవసరాలకు
 కలిపి మొత్తం 12 టీఎంసీలు పోను 50 టీఎంసీలు మిగులుతాయి. ఈ నీటిని  సాగునీటి అవసరాలకు విడుదల చేయనున్నారు. పెన్నాడెల్టా పరిధిలోని మొత్తం ఆయకట్టు 4,16,640 ఎకరాలకు నీరు సరిపడనుండటంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశముంది. పెన్నా డెల్టాకింద 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువకింద 33 వేల ఎకరాలు, కావలి కాలువ కింద 72 వేల ఎకరాలు, నార్త్‌ఫీడర్ కింద 31 వేల ఎకరాలు, సౌత్‌ఫీడర్ పరిధిలో మరో 29 ఎకరాలు కలిపి అధికారికంగా మొత్తం 4 లక్షల 16 వేల 640 ఎకరాలకు, అనధికారికంగా 6 లక్షల ఎకరాల వరకూ సాగునీరు అందనుంది. నీటివిడుదల ఎప్పుడు అనేది ఐఏబీ సమావేశంలో నిర్ణయించనున్నారు. అక్టోబర్ 20 తరువాత నీరు విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
 కాలువలు మరమ్మతులకు
 నోచుకునేనా..
 ఇప్పటికే రెండు సీజన్లుగా పెన్నాడెల్టా పరిధిలోని సాగునీటి కాలువల్లో సిల్ట్, పూడిక తీయకపోవడంతో కాలువల ద్వారా ఆయకట్టుకు నీరు చేరే పరిస్థితి కానరావడంలేదు. గత ఖరీఫ్‌లో సిల్ట్ తొలగింపునకు అధికారులు ప్రతిపాదనలు పంపినా ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిధులు మంజూరు చేయలేదు. ఈ దఫా అయినా సిల్ట్ తొలగించకపోతే ఆయకట్టుకు నీరు సక్రమంగా చేరదు. ఈ క్రమంలో కాలువల్లో పూడికతీత కోసం రూ.4.8 కోట్లతో 212 పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిని ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు.
 త్వరలోనే అనుమతులొస్తాయని అధికారులు చెబుతున్నారు. పనులు పూర్తయ్యేందుకు 20 రోజులకు పైగానే పట్టే అవకాశముంది. ఈ నెలాఖరుకు పనులు మంజూరైనా అక్టోబర్ 20 నాటికి సిల్ట్ తొలగింపు పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో ఆ తర్వాతే నీరు విడుదల చేస్తారని రైతులు భావిస్తున్నారు.


 

>
మరిన్ని వార్తలు