5 వేల ఎకరాలు చాలు!

7 Dec, 2014 01:42 IST|Sakshi
5 వేల ఎకరాలు చాలు!

జిల్లాలోని రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక సభ్యుల బృందం రెండురోజులుగా పర్యటిస్తోంది. మంగళగిరి మండలం నిడమర్రులో శనివారం పర్యటించిన బృందం అక్కడి రైతులు,రైతుకూలీలతో మాట్లాడి వారి అభిప్రాయూలను సేకరించింది.
 
 మంగళగిరి : ఐదు వేల ఎకరాలలో రాజధానిని ఆధునిక టెక్నాలజీతో అత్యాధునిక యంత్రాంగంతో బ్రహ్మాండమైన బహుళ అంతస్తుల భవనాలను అద్భుతంగా నిర్మించుకోవచ్చని చండీఘడ్ కేపిటల్ సిటీ అడ్మినిస్ట్రేటర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి దేవసహాయం తెలిపారు. మండలంలోని నిడమర్రు గ్రామంలో శనివారం ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక(నేషనల్  అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్)సభ్యుల బృందం పర్యటించి రైతు,రైతు కూలీలను అడిగి వివరాలను తెలుసుకుంది. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాము చండీఘడ్ కేపిటల్ సిటీ తొలిదశ నిర్మాణానికి 15 సంవత్సరాలు పట్టిందని, రెండవ దశ పూర్తి చేయడానికి 20 సంవత్సరాలు సమయం పట్టిందన్నారు. చండీఘడ్‌లో 60 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ పది లక్షల మంది మాత్రమే జీవిస్తున్నారన్నారు. రెండు రోజులుగా రాజధాని గ్రామాల్లో తమ బృందం పర్యటించినప్పుడు భూములు కోల్పోతున్నామనే ఆవేదన రైతుల్లో కనపడిందన్నారు.
 
  రాష్ట్రంలో రాజధాని పేరుతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వేల ఎకరాల రైతుల భూములను కబళించేందుకు ప్రయత్నించడం  శోచనీయమన్నారు. 100 రకాలు పంటలు పండి దేశంలోని వివిధ ప్రాంతాలకు అనేక పంటలను ఎగుమతి చేస్తున్న భూములను తీసుకోవాలని ప్రభుత్వం చేస్తున్న యత్నాల వల్ల భవిష్యత్తులో ఆహార భద్రతకు తీవ్ర ముప్పువాటిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రపంచంలో ఏ రాజధానిని చూసినా రెండు మూడు ఎకరాలకు మించి లేదని ఇక్కడ లక్ష ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు.
 
 అన్ని భూములు ఎందుకో ప్రజలకు తెలియజేసి అప్పుడు భూములను సమీకరించాలన్నారు. ప్రజా ఉద్యమాల జాతీయవేదిక సభ్యుడు రాజారెడ్డి మాట్లాడుతూ రైతుల భూములను తీసుకోవడం వలన ఒక్క రైతుకు మాత్రమే నష్టం కాదని వారితో పాటు రైతు కూలీలు,కౌలు రైతులతో పాటు వ్యవసాయరంగంపై ఆధారపడిన కుటుం బాలన్నీ వీధినపడతాయన్నారు.
 
 80 శాతం మంది రైతులు అంగీకరిస్తేనే భూములను తీసుకోవాలని, చట్టాలను అతిక్రమించేందుకు ప్రభుత్వం సిద్ధమైతే జాతీయస్థాయిలో ఉద్యమం చేసైనా సరే రైతులకు అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో ప్రజా ఉద్యమాల జాతీయవేదిక కన్యీనర్ రామకృష్ణంరాజు, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర సభ్యులు కిరణ్, న్యాయవాదులు మల్లెల శేషగిరిరావు,కలపాల బాబురావు. గ్రామ రైతులు శివరామిరెడ్డి,నాగరాజు,జంగా నాగిరెడ్డి,భీమవరపు కృష్ణారెడ్డి,దండా వీరారెడ్డి,శివ న్నారాయణరెడ్డి,బత్తుల జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు