చలించి...స్పందించి

7 Dec, 2014 01:42 IST|Sakshi
చలించి...స్పందించి

 గరుగుబిల్లి మండల కేంద్రానికి  12 కిలోమీటర్ల దూరంలో ఉన్న  తోటపల్లి పంచాయతీ నందివానివలస గ్రామమది. అక్కడ 280 గడపలున్నాయి. 320 కుటుంబాల్లో 1350 మంది నివసిస్తున్నారు.  నిర్వాసిత గ్రామమైన ఈ ఊరు... కూలిన పెంకుటిళ్లు, ధ్వంసమైన రోడ్లు, శిథిలమైన పాఠశాల భవనం, సమస్యలతో పోరాడలేక నీరసించిన జనంతో   దయనీయంగా  మారింది. నాగావళికి వ రదలొచ్చినప్పుడు రోజుల తరబడి జలదిగ్బంధంలో చిక్కుకుంటుంది. పంటపొలాల్లోంచి బురదనీరు గ్రామంలోకి ప్రవేశిస్తుండడంతో వీధులన్నీ చెమ్మగా మారిపోతాయి. నందివానివలసతో పాటు తోటపల్లి గ్రామంలో కూడా అడుగడుగునా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఆయా గ్రామాల ప్రజల ఇక్కట్లను ప్రత్యక్షంగా చూసి, వారి బాధలు వినేందుకు కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, సాక్షి తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. వారి కష్టాలు విని చలించిపోయారు. సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

 
 పాముల పుష్ప శ్రీవాణి:  నమస్తే...  నాపేరు పాముల పుష్ప శ్రీవాణి.  నేను మీ నియోజకవర్గ ఎమ్మెల్యేను. మీ సమస్యలు తెలుసుకోవడానికి ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా వచ్చాను.
 పుష్ప శ్రీవాణి: బాబు నీ పేరు ఏమిటీ.. సమస్య ఏంటీ ?
 సతీష్‌కుమార్ : మేడమ్.. నా పేరు సతీష్‌కుమార్,  మా ఊర్లో  18 ఏళ్లు నిండిన యువకులకు పునరావాస ప్యాకేజీ మంజూరు చేయలేదు? మా కన్నా ముందు నిర్వాసిత గ్రామాలుగా ప్రకటించిన ఊళ్లలో వారికి ప్యాకేజీని ప్రభుత్వం మంజూరు చేసింది. ఎందుకు ప్రభుత్వం వివక్ష చూపించిందో తెలియడం లేదు?
 పుష్పశ్రీవాణి: ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చించి
 చలించి...స్పందించి
 తగున్యాయం చేస్తాను.
 పుష్పశ్రీవాణి: అమ్మా...నీ పేరేంటి, నీ సమస్య ఏంటి ?
 ఒమ్మి త్రినాథమ్మ: నా పేరు  త్రినాథమ్మ,  అసలు మాట దేవుడు ఎరుగు,  వడ్డ్డీలు తడిసిమోపుడవుతున్నాయి. డ్వాక్రా రుణాలు తీర్చే మార్గం కనిపించడంలేదు. మీరే సమస్యపరిష్కరించాలి.
 పుష్పశ్రీవాణి:  ఈవిషయమై ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది.
 పుష్ప శ్రీవాణి :  ఎలా ఉన్నారు, మీ పేర్లేంటి ?
 గొల్లు మహాలక్ష్మి: నాపేరు మహాలక్ష్మి , 70 ఏళ్లు నిండినా పింఛన్ మంజూరు కాలేదు.  ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదు.
 రెడ్డి పోలమ్మ: నా పేరు పోలమ్మ,  భూమి ఎక్కువుగావుందని  మూడు నెలలనుంచి పింఛను నిలిపేశారు.    కొడుకులు కూడా పట్టించుకోవడం లేదు. నేను ఎలా బతకాలమ్మ ?
 పుష్పశ్రీవాణి: అధికారులతో చర్చించి పింఛన్ మంజూరుకు కృషిచేస్తాను.
 పుష్ప శ్రీవాణి : నీ సమస్య ఏంటి ?
 గొర్లి శంకర్:  మేడమ్.... మేము ఎస్టీ నిరుపేద కుటుంబానికి చెందినవారిమండి, మాకు అంత్యోదయ కార్డుకూడా మంజూరు చేయడంలేదు.
 పుష్పశ్రీవాణి: కొత్తగా రేషన్‌కార్డులు మంజూరు చేసిన సమయంలో అంత్యోదయ కార్డు వచ్చేలా అధికారులతో మాట్లాడతాను.
 పుష్పశ్రీవాణి: ఏంటమ్మా ఏమైనా సమస్యలున్నాయా ?
 అంపెల్లి గంగమ్మ:  గ్రామంలో కుళాయికూడా లేదు మేడమ్.
 పుష్పశ్రీవాణి: నందివానివలస నిర్వాసిత గ్రామం కావడంతో ప్రభుత్వం రక్షిత పథకాలను మంజూరు చేయడం లేదు. పునరావాసం కల్పించిన తరువాత కుళాయి  ఏర్పాటు చేస్తాం.
 పుష్పశ్రీవాణి: మీ పేర్లేంటి, ఎంటి మీ సమస్య ?
 మరడాన అప్పలనాయుడు: మేడమ్ నా పేరు అప్పలనాయుడు.  పునరావాసం కల్పించేందుకు అధికారులు పట్టించుకోవడంలేదు. గ్రామానికి మూడేళ్ల క్రితం పునరావాసానికి సంబంధించిన ప్యాకేజీను ఇచ్చారు. కానీ ఇంతవరకు పునర్నిర్మాణం కోసం స్థల సేకరణ కూడా చేయలేదు. ఉన్న ఇళ్లు కూడా కూలిపోతున్నాయి. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడంలేదు.
 రెడ్డి హరికృష్ణ: నాపేరు హరికృష్ణ మేడమ్. ఈ ఊళ్లో ఎలా బతకాలో    తెలియడంలేదు. ఉన్న ఇళ్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి.   నిత్యం అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని జీవిస్తున్నాం. ఇళ్ల  మరమ్మతులు కూడా చేసుకోలేని  స్థితిలోవున్నాం.
 రెడ్డి సత్యనారాయణ: ఇళ్ళుపెచ్చులూడిపోతున్నాయి. అధికారులు పట్టించుకోవడంలేదు. వర్షాలువస్తే నరకం  చూస్తున్నాం.
 పుష్పశ్రీవాణి: పునరావాసంపై పార్వతీపురం సబ్‌కలెక్టర్‌తో ఇప్పటికే పలుమార్లు చర్చించాను. మళ్లీ మరోసారి చర్చించి గ్రామానికి పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడతాను.
 పుష్పశ్రీవాణి:  మీ సమస్య ఏంటి ?
 కర్రి ఎల్లంనాయుడు: నాపేరు ఎల్లంనాయుడండి...వరదనీరు గ్రామంలోకి చొచ్చుకొస్తుంది. మురుగు చేరడంతో వ్యాధులు బారినపడుతున్నాం. అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడంలేదు.
 పుష్పశ్రీవాణి:  ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి గ్రామంలోకి వరదనీరు రాకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు చేపడతాను.
 పుష్ప శ్రీవాణి : చెప్పండమ్మ... నీ సమస్య ఏంటమ్మ ?
 గొల్లు ధనుంజయమ్మ: ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నభోజనం తయారీకి వంటశాల లేకపోవడంతో ఆరుబయటే వంటలను చేస్తున్నాం. వర్షాలు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
 పుష్పశ్రీవాణి:  వంటశాల నిర్మాణానికి ఉన్నతాధికారులతో చర్చిస్తాను.
 పుష్పశ్రీవాణీ: మీ ఊరికి వచ్చే వంతెన ప్రమాదకరంగా ఉంది... ఎప్పటి నుంచి ఇలా ఉంది ?
 రొక్కలి సత్యనారాయణ: ఏళ్ల తరబడి దీని పరిస్థితి ఇలాగే ఉంది. ఎంత మంది అధికారులు, నాయకులకు చెప్పినా సుఖం లేదు..  తరచూ చాలా మంది వంతెన మీద నుంచి పడిపోతున్నారు. అదృష్టవశాత్తు ప్రాణాలు మిగులుతున్నాయి.
 పుష్పశ్రీవాణీ:  చెప్పమ్మా.. ఏమిటీ సమస్య.
 లలిత: అమ్మా! రుణమాఫీ అన్నారు. డబ్బులు రాలేదు సరికదా,  మా పొదుపు డబ్బులు ఇరిపేస్తున్నారు.
 పార్వతి: బ్యాంకులకు వెళితే నోటీసులు ఇస్తామంటున్నారు.
 పుష్పశ్రీవాణీ: చంద్రబాబు మాటలు నమ్మి అధికారం ఇస్తే ఇలాగైందన్న బాధ ఇప్పుడు అందరిలో ఉంది. ప్రతీ పైసా మాఫీ అయ్యే వరకూ మీకు అండగా ఉంటాం.
 పుష్పశ్రీవాణీ: మీ ఇబ్బంది ఏంటమ్మ...?
 చంద్రమ్మ : నా భర్త చనిపోయి రెండేళ్లు అయ్యింది.. అయినా ఇప్పటివరకూ వితంతు పింఛను ఇవ్వకుండా తిప్పుతున్నారు..
 పుష్పశ్రీవాణీ: జన్మభూమిలో దరఖాస్తు పెట్టినా ఇవ్వడం లేదా...  సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను.
 అప్పయ్యమ్మ: అమ్మా... నాకు చేతులు పనిచేయవు,  కళ్లు కనిపించవు., అయినా పింఛను ఇవ్వడం లేదు.,
 పుష్పశ్రీవాణీ : ఏం, ఎందుకని ఇవ్వడం లేదు..
 అప్పయమ్మ: అధికారులు ఇచ్చిన సర్టిఫికేట్‌లో 20 శాతం అంగవైకల్యం ఉందని రాశారు. అందుకే ఇవ్వడం లేదట
 పుష్పశ్రీవాణీ: లేదు.. ఇక్కడ సదరంలో ధ్రువీకరించి పింఛను వచ్చేటట్టు చేస్తాను
 పుష్పశ్రీవాణీ: చెప్పండమ్మా ... మీ సమస్య ఏంటి?
 పెదపెంకి రమణ, లక్ష్మి: అమ్మా మాకు రేషను కార్డులు లేవని  బంగారుతల్లి పథకం ఇవ్వడం లేదు..చాలా ఇబ్బందిగా ఉంది
 పుష్పశ్రీవాణీ: రేషను కార్డు వచ్చేలా చేస్తా...అలాగే మీ గ్రామంలో సమస్యల పరిష్కారాని ప్రయత్నిస్తాను.  మళీ కలుద్దాం...
 

>
మరిన్ని వార్తలు