80 శాతం సంతృప్తి సాధించాం

15 Feb, 2019 04:27 IST|Sakshi

సీఎం చంద్రబాబు

సాక్షి, విశాఖపట్నం / విజయనగరం/ అమరావతి బ్యూరో: ‘ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో 80 శాతం సంతృప్తి సాధించాం. పార్టీలో 80 శాతం సంతృప్తి సాధించాం. ఎన్నికల్లో 80 శాతం సీట్లు, ఓట్లు సాధించడమే నా లక్ష్యం. ఈ విషయంలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా సాధిస్తా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం విశాఖ, విజయనగరం, గుంటూరు జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు నిర్వహించారు. విశాఖ రుషికొండ వద్ద నూతనంగా నిర్మించిన మిలీనియం టవర్స్‌ను ప్రారంభించిన ఆయన భీమిలి మండలం కాపులుప్పాడ వద్ద అదాని గ్రూప్‌ నిర్మించనున్న డేటా సెంటర్‌ అండ్‌ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ విశాఖలో డేటా సెంటర్‌ నెలకొల్పేందుకు అదాని ముందుకు రావడానికి లోకేష్‌ కృషి ఎంతో ఉందని చెప్పారు. వాజ్‌పేయ్‌ ప్రధానిగా ఉన్న ఉన్నప్పుడు ఆయన్ను ఒప్పించి టెలి కమ్యూనికేషన్‌లో విప్లవం తీసుకొచ్చానన్నారు. దేశంలోనే వ్యవసాయం వృద్ధి రేటు కేవలం 1.9శాతం ఉంటే, ఏపీలో మాత్రం 11 శాతం ఉందన్నారు. 

భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన
విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం వద్ద నిర్మించే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో నిర్మాణం పూర్తవుతుందని, ఎయిర్‌ పోర్టుకు అసైన్డ్‌ భూములిచ్చిన వారికి పరిహారం ఇస్తామని చెప్పారు. గురజాడ యూనివర్శిటీ, డిగ్రీ కళాశాల, పతంజలి ఆల్ట్రా మెగాఫుడ్‌ పార్క్, చందన ఇంటిగ్రేటింగ్‌ ఫుడ్‌పార్క్, ఆరోగ్య మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌ కేంద్రానికి కూడా ఇదే వేదిక నుంచి సీఎం శంకుస్థాపన చేశారు. ఇచ్చాపురం నుంచి భోగాపురం మీదుగా విశాఖపట్నం వరకూ బీచ్‌ రోడ్డు ఏర్పాటు చేస్తామని, పేదల పెళ్లికి రూ. 35 వేలు ఇస్తామని ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రకటించారు. 

క్యాన్సర్‌పై పోరాడి జయించాలి 
క్యాన్సర్‌ సోకినంత మాత్రాన దిగులు పడకుండా పోరాడి జయించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి గురువారం ఉదయం భూమి పూజ చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శిలాఫలకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. టాటా మెమోరియల్‌ ట్రస్ట్‌ భాగస్వామ్యంతో రూ.600 కోట్లతో రాష్ట్రంలో 10 ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. బసవతారకం ట్రస్ట్‌ చైర్మన్, ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ తన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నానని చెప్పారు. తొలిదశలో భాగంగా 18 నెలల్లో 300 పడకలతో ఆస్పత్రిని పూర్తి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో స్పీకర్‌ కోడెల తదితరులు పాల్గొన్నారు.

మోదీ తలాక్‌  చెప్పకుండానే భార్యను విడిచిపెట్టారు!
మోదీ, జగన్‌ ఏం చదివారో ఎవరికైనా తెలుసా? అంటూ ఈ సందర్భంగా సీఎం వ్యక్తిగత విమర్శలకు దిగారు. ట్రిపుల్‌ తలాక్‌ తెచ్చిన మోదీ కనీసం అది కూడా చెప్పకుండానే భార్యను విడిచిపెట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యేలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఓ ఎంపీ లోటస్‌పాండ్‌ మెట్లెక్కుతున్నారని, అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయవద్దన్నారు. పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. నిర్దేశించిన సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా సీఎం రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

మరిన్ని వార్తలు