పోలీసుల మోహరింపు-ప్రజల భయాందోళన

2 Jan, 2014 15:19 IST|Sakshi

శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలం కాకరాపల్లి గ్రామంలో నిర్మిస్తున్న  ఈస్ట్‌కోస్ట్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ బాధిత గ్రామాలలో పోలీసులు భారీస్థాయిలో మోహరించారు. ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  హనుమంత నాయుడుపేట, కోచునాయుడుపేట, ఆకాశలక్కవరం గ్రామాలలో  పోలీసులు మోహరించారు. 9 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాము 1232 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నట్లు ఆందోళనకారులు తెలిపారు. నిద్రిస్తున్న ప్రజలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని ఆందోళనకారులు చెప్పారు.

జిల్లాలోని కాకరాపల్లి థర్మల్‌ పవర్‌ప్లాంట్ పరిసరాల్లో గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. థర్మల్ పవర్ ప్లాంట్‌ నిర్మాణం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుండడంతో సంతబొమ్మాళి మండలం పరిధిలోని గ్రామస్థులు మళ్లీ ఉద్యమబాట పట్టారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించడంతో ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులు వెనకడుగు వేశారు. దాంతో ఇక్కడ నిర్మాణ పనులు ఒక్కొక్కటిగా పునర్‌ ప్రారంభమయ్యాయి. దాంతో ఈ ప్రాంత ప్రజలు తమ డిమాండ్లు పరిష్కరించకుండా పనులు ప్రారంభించడం పట్ల  తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ వాహనాలను వారు అడ్డుకుంటున్నారు. వారి ఆందోళనను అణచడానికి భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు