‘మీ సేవ’లో ఆధార్

20 Sep, 2013 03:02 IST|Sakshi
జిల్లాలో ‘మీసేవ’ను ఆధార్ శాశ్వత నమోదు కేంద్రాలుగా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. దీంతో  ఆధార్ నమోదును ఎప్పుడైనా చేసుకునే అవకాశం లభించింది. జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో.. నల్లగొండలో 2, సూర్యాపేటలో 2, మిర్యాలగూడ, భువనగిరిలలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 6 మీ సేవ కేంద్రాలు నడుస్తుండగా, కేవలం పట్టణ ప్రాంతాల్లోనే మరో 46 కేంద్రాలు ప్రైవేటు భాగస్వామ్యంతో కొనసాగుతున్నాయి. అదే విధంగా ఏపీ ఆన్‌లైన్ కింద 190 మీ సేవ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అంటే జిల్లాలో మొత్తం 242 మీ సేవ కేంద్రాల ద్వారా ఇప్పటికే కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు రెవెన్యూ, ఇతరత్రా కొన్ని ప్రభుత్వ శాఖల కార్యకలాపాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల బ్యాంకు, పింఛన్, గ్యాస్ సబ్సిడీలతో పాటు ప్రభుత్వ పథకాలు ‘ఆధార్’తో అనుసంధానం చేశారు. కాగా ఆధార్ నమోదు తో పాటు స్మార్ట్‌కార్డు, అభయహస్తం వంటి  కా ర్యక్రమాలు కూడా మీసేవలో పొందుపర్చి ప్రజ లకు సేవలందించే ప్రక్రియ  కొనసాగుతోంది. 
 
 ఆధార్ నమోదుకు అవస్థలు
 జిల్లాలో ఆధార్ నమోదుకు ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ఈ కేంద్రాల వద్ద రకరకాల సమస్యలతో ప్రజలు నానా అవస్థలు పడి చివరకు ఆధార్ కార్డు కూడా వద్దనే పరిస్థితికి చేరుకున్నారు. ఆధార్ నమోదుకు ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు అనుమతులు ఇవ్వడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక కారణాలు, మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.  దీంతో  ఇప్పటికీ ఆధార్ కార్డులు దిగనివారు చాలా మంది ఉన్నారు. జిల్లాలో 34లక్షల జనాభాకు గాను పలు విడతలుగా ఇప్పటి వరకు 29.43లక్షల పైచిలుకు జనాభాకు సంబంధించి ఆధార్ నమోదు ప్రక్రియను పూర్తి చేశారు.
 
 జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ కల్లా 9,75000 వ్యక్తులకు సంబంధించిన ఆధార్ నమోదును చేపట్టగా, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2,17, 220 వ్యక్తుల నమోదు చేపట్టారు. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్ ద్వారా 17,00795 వ్యక్తుల నమోదు ప్రక్రియ చేపట్టారు. ఇదిలా ఉండగా తాజాగా జిల్లాలో ఏర్పాటు చేసి న 52 కేంద్రాల ద్వారా 50వేల వ్యక్తుల నమోదు తోడు కావడంతో గురువారం వరకు మొత్తంగా 29,43,015 నమోదు పూర్తయింది. మిగిలిన 4,56,085 వ్యక్తుల నమోదు చేపట్టాల్సి ఉంది.  ఇక నుంచి ఇబ్బందులు కలగకుండా ఉండేం దుకు ప్రభుత్వం ‘మీసేవ’తో ఆధార్‌నమోదును అనుసంధానం చేయడానికి ఉపక్రమించింది. దీని కోసం మీ సేవ నిర్వాహకులకు ఆధార్ న మోదుకు అవసరమైన శిక్షణ, పరీక్షలు  జరి పింది. అక్టోబర్ మొదటివారం నుంచి  ఆధార్ నమోదును మీ సేవకు అనుసంధానం చేయవచ్చునని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఒకవేళ సాంకేతికపరమైన సమస్యలుఎదురైతే ప్రభుత్వ కేంద్రాల్లో తొలుత ఆ తర్వాత ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే కేంద్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. 
 
 సబ్సిడీ పర్మిట్లు కూడా..
 వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పర్మిట్లను ‘మీసేవ’ ద్వారా ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లను కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. రానున్న రబీ సీజన్ నుంచి రైతులకు పర్మిట్లు మీ సేవ కేంద్రాల నుంచి ఇచ్చేందుకు అవసరమైన చర్యలను ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. దీంతో కేవలం రెవెన్యూపరమైన పనులకే పరిమితం అనుకున్న ‘మీసేవ’ కేంద్రాలు ఇక వ్యవసాయ పర్మిట్లు, ఆధార్, స్మార్ట్‌కార్డు, అభయహస్తం తదితర ప్రభుత్వ కార్యకలాపాల నమోదుతో బిజీ బిజీగా మారనున్నాయి. 
 
మరిన్ని వార్తలు