ఢిల్లీ నుంచి రాగానే చంద్రబాబుకు నోటీసులు?

10 Jun, 2015 09:12 IST|Sakshi
ఢిల్లీ నుంచి రాగానే చంద్రబాబుకు నోటీసులు?

ఓటుకు కోట్ల కేసులో ఏసీబీ మరో ముందడుగు వేయనుంది. పూర్తి సాక్ష్యాధారాలతో కూడిన సమగ్ర నివేదికను బుధవారం నాడు కోర్టుకు సమర్పించనుంది. దాంతోపాటు.. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై కౌంటర్ కూడా దాఖలు చేయనుంది. కేసు కీలక సమయంలో ఉన్న ఈ తరుణంలో బెయిల్ ఇవ్వడం సరికాదని ఏసీబీ వాదించనుంది. ఈ కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే విషయంలోకూడా సీనియర్ అధికారులను సంప్రదించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. 48 గంటల్లో విచారణకు హాజరు కావాలని కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత ఈ నోటీసులు ఇవ్వొచ్చని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక కేసుకు సంబంధించి ఎక్కడ కుట్ర పన్నారు, డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనే వివరాలు నేడు కోర్టుకు వెళ్లనున్నాయి. ఓ కార్పొరేట్ సంస్థ ఖాతాలోకి డబ్బులొచ్చాయనడానికి ఏసీబీ ఇప్పటికే సాక్ష్యాలు సంపాదించింది. ఇద్దరు టీడీపీ నాయకుల విషయంలో కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. బాస్ ఎవరన్న విషయాన్ని కూడా ఏసీబీ తేల్చేసింది. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహా కస్టడీలో ఉండగానే ఈ వివరాలు రాబట్టింది.

కుట్ర, దాని అమలుకు ప్రయత్నించినవారి పేర్లను కోర్టుకు నివేదించనుంది. నాలుగు రోజుల కస్టడీలో నిందితులు చెప్పిన విషయాల ఆధారంగా 15 మంది పేర్లను ఏసీబీ గుర్తించింది. ఇందులో చంద్రబాబు పేరు కూడా ఉండే అవకాశం ఉంది. చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తం వందకోట్లు దాటిన వ్యవహారం కాబట్టి.. ఎక్కువ సంఖ్యలోనే పేర్లున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కారు డ్రైవర్ స్థాయి వరకు పేర్లున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వీడియో, ఆడియో ఫుటేజిలతో పాటు డాక్యుమెంటరీ సాక్ష్యాలను కూడా ఏసీబీ సేకరించింది.

మరిన్ని వార్తలు