జనసేనకు బిగ్‌షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి కీలక నేతలు.. జనసేనానిపై సంచలన ఆరోపణలు

22 Nov, 2023 16:34 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జి సందీప్‌తో పాటు రాయలసీమ రీజియన్‌ ఇంఛార్జి పద్మావతిలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. బుధవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పేసుకున్నారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌పై సంచలన ఆరోపణలు, తీవ్ర విమర్శలే చేశారు. 

‘‘పవన్ కల్యాణ్‌కు ఆ పార్టీలో ఉండే రుక్మిణి అంటే భయం. ఆమె మాట విని చాలామందిని రోడ్డు మీదకు నెట్టారు.  ఆయనో అహంకారి. తన స్వార్థం కోసం ఎంతో మందిని బలి చేశారు. యువతను దారుణంగా మభ్య పెడుతున్నారు. తాను లేకుండా నాదెండ్ల కూడా అసెంబ్లీకి వెళ్లకూడదనుకునే తత్వం పవన్‌ది. జనసేన ఆఫీసుకు వచ్చే హవాలా డబ్బును మార్చేది నాదెండ్లనే. హైదరాబాద్‌లో భూకబ్జా కేసులో ఏ1గా ఉన్న వ్యక్తిని జనసేన కమిటీలో పవన్‌ పెట్టారు. రాజకీయాల్లో మాట తప్పి.. టీడీపీ కోసమే పవన్‌ పని చేస్తున్నారు. టీడీపీ పంచన చేసి నమ్ముకున్న మాలాంటి వాళ్లను మోసం చేశారు’’ అని పసుపులేటి సందీప్ అన్నారు. 

‘‘చిరంజీవి అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చా. 2014లో జనసేనకు అండగా నిలబడింది నేనే. పవన్‌ను నమ్మి నా బిడ్డను ఆయన దగ్గరికి పంపాను. కానీ, ఆయన నా బిడ్డను రోడ్డున పడేశారు. ఒక తల్లిగా చెప్తున్నా.. మీ బిడ్డల్ని ఆయన దగ్గరకు పంపొద్దు. పార్టీలో మహిళలను నాదెండ్ల ఎదగనివ్వడం లేదు. పవన్‌ సరిగా లేనందు వల్లే పార్టీలో మహిళలకు గౌరవం లేకుండా పోయింది. ఈ అంశం మీద ఎక్కడైనా చర్చకు నేను సిద్ధం’’ అని పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు