గ్రామ సచివాలయాల్లోనే ప్రాథమిక వైద్య సేవలకు అదనపు భవనం

16 Apr, 2020 04:21 IST|Sakshi

2291 చదరపు అడుగుల్లో వైద్య, రైతు సేవా కేంద్రాలకు భవన నిర్మాణం

సాక్షి, అమరావతి: గ్రామాల్లో స్థానికులకు అవసరమైన ప్రాథమిక వైద్య సేవలన్నీ సంబంధిత గ్రామ సచివాలయంలోనే అందేలా ప్రతి గ్రామ సచివాలయ కార్యాలయంలో వైద్య ఆరోగ్య విభాగ కేంద్రాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతోపాటు రైతు సేవా కేంద్రం ఏర్పాటుకు కూడా 2291 చదరపు అడుగుల విస్తీర్ణంలో అదనపు భవనాలను నిర్మించాలని పేర్కొంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి గ్రామ సచివాలయంలో 932 చదరపు అడుగులలో రూ. 14.95 లక్షలతో వైద్య సేవల కేంద్రం, 1359 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.21.80 లక్షలతో రైతు సేవా కేంద్రాల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. 

► వైద్య వసతి కేంద్రానికి అయ్యే ఖర్చులో 50 వైద్య ఆరోగ్య శాఖ, మరో 50 శాతం ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధుల నుంచి ఖర్చు చేస్తారు.  
► రైతు సేవ కేంద్రం నిర్మాణానికయ్యే ఖర్చులో 90 శాతం ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధుల నుంచి, 10 శాతం వ్యవసాయ శాఖ భరిస్తాయి.  
► ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 9500 గ్రామ సచివాలయాలను కొత్తగా నిర్మించడం, ఆధునీకరించడం వంటి పనులు జరుగుతున్నాయి. అక్కడే ఈ అదనపు భవనాల వసతి నిర్మాణానికి ఆదేశాలిచ్చారు.  
► దీనికి సంబంధించి ఇప్పటి వరకు 2908 చోట్ల తగిన భూమిని అధికారులు గుర్తించారు. మిగిలిన చోట్ల ఈ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు