అదనపు సీనియర్‌ సివిల్‌జడ్జి ఆత్మహత్య

23 Nov, 2017 03:02 IST|Sakshi

ప్రమోషన్‌ రాకపోవడం, సస్పెన్షన్‌తో మనస్తాపం

తిరుపతిలోని ఇంట్లో బలవన్మరణం

తిరుపతి లీగల్‌: తిరుపతిలో అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా విధులు నిర్వహిస్తూ గతేడాది సస్పెన్షన్‌కు గురైన పి.వి సదానందమూర్తి బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు ఆయన భార్య అన్నపూర్ణమ్మ ఎంఆర్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదానందమూర్తి 2013లో ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా నెల్లూరు నుంచి  తిరుపతికి వచ్చారు. తర్వాత అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగానూ పనిచేశారు.

కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈ క్రమంలో తరచూ మానసిక కుంగుబాటుకు గురవుతున్నట్టు సమాచారం. గతంలో తిరుమలకు వెళ్లిన ఆయన ఓ పూజారి దురుసుగా ప్రవర్తిం చాడని పోలీసులకు ఫిర్యా దు చేశారు. అయితే సదానందమూర్తి ప్రవర్తన సరిగా లేదనే కారణంతో చిత్తూరు జిల్లా జడ్జి, తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జీల నివేదికల ఆధారంగా గతేడాది మార్చి 6న హైకోర్టు ఆయన్ను సస్పెండ్‌ చేసింది. తదుపరి ఉత్తర్వులు అందేవరకు తిరుపతి వదిలి వెళ్లకూడదంది.

సస్పెండ్‌ కావడంతో న్యాయమూర్తుల క్వార్టర్స్‌ నుంచి వెళ్లిపోయి విద్యానగర్‌లోని ఓ అద్దె ఇంటిలో ఉంటున్నారు. ప్రమోషన్‌ రాకపోవడం, సస్పెండ్‌ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. దీన్ని ఆయన భార్య అన్నపూర్ణమ్మ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆయన కుమారుడు ఐఐటీ బెనారస్‌లో, కుమార్తె యూఎస్‌లో ఎంఎస్‌ చదువుతున్నారు. న్యాయమూర్తి భౌతికకాయానికి రుయా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి స్వస్థలం మచిలీపట్నం తరలించారు.

మరిన్ని వార్తలు