15వ రోజు పాదయాత్ర డైరీ

23 Nov, 2017 03:01 IST|Sakshi

22–11–2017, బుధవారం

నర్సాపురం క్రాస్‌రోడ్డు, కర్నూలు జిల్లా

పేదల ప్రాణాలకు విలువే లేదా?..
ఈ రోజు నడిచినదంతా కొండలు, గుట్టలతో కూడిన ప్రాంతం. రోడ్డు మార్గం, సమాచార సౌకర్యం, రక్షిత మంచినీరు కూడా సరిగాలేని గ్రామాలు! ఈ ప్రాంతంలో ఆకస్మికంగా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్యం పాలైనా వాళ్ల పరిస్థితేంటి.. అన్న ఆలోచన రాగానే మనసు బరువెక్కింది.

మార్గంమధ్యలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే నాల్గో తరగతి ఉద్యోగులు వచ్చి కలిశారు. ‘చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే జీతాలు పెంచుతానని ఎన్నికల సమయంలో మాట ఇచ్చారు. అయితే జీతాలు పెరిగిన 2016 జూలై నెలలోనే హాస్టళ్ల విలీనం పేరుతో మాలో చాలా మందిని ఉద్యోగాల నుంచి తీసేశాడు. ఎటువంటి ప్రత్యామ్నాయమూ చూపించలేదు. మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నా..’ అని అన్నారు. రెగ్యులరైజ్‌ చేస్తాం.. జీతాలు పెంచుతామని ఆశపెట్టి, చివరికి వాళ్ల ఉద్యోగాలనే తీసివేసి వందలాది కుటుంబాలను రోడ్డ్ను పడేయడం ఎంతో బాధ కలిగించింది.
ముద్దవరం, వెంకటగిరి, పెండేకల్లు, చుట్టుపక్కల గ్రామాల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, బతుకు భారంగా గడుపుతున్న దాదాపు 20 మంది నిరుపేదలు వచ్చి కలిశారు. కిడ్నీ వ్యాధులు, హృద్రోగాలు, వెన్నెముకకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులతో వాళ్లు బాధపడుతూ, ఆరోగ్యశ్రీ సేవలు అందక, ఆదుకునే నాథుడులేక అల్లాడిపోతున్నారు. గుండె తరుక్కుపోయింది. పూట గడవడమే కష్టంగా ఉన్న పేదవాడు ఆరోగ్యం కోసం లక్షల రూపాయలు ఎలా ఖర్చు చేయగలడు?

కొలుముల్లపల్లెకి చెందిన ఓబులమ్మ భర్త కొంతకాలం క్రితం మరణించాడు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఉన్న ఆ ఒక్క కొడుకు కండరాలు, నరాలకు సంబంధించిన వ్యాధితో మంచం పట్టాడు. ఇటీవలే వెన్నెముక కూడా విరిగింది. కదలలేని పరిస్థితి. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయించుకుందామంటే ఆంధ్రప్రదేశ్‌లో సౌకర్యాలు లేవు. హైదరాబాద్‌లోని నిమ్స్‌ లాంటి ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేసింది. దాంతో వైద్యం చేయించలేక.. కొడుకుని ఆ పరిస్థితుల్లో చూడలేక.. ఆ కన్నతల్లి తల్లడిల్లుతోంది. వెంకటగిరికి చెందిన కిరణ్‌కుమార్‌ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఉన్న ఒకే ఒక కొడుక్కి కిడ్నీల వ్యాధి. మందులకే నెలకు దాదాపు 4,000 వరకూ ఖర్చవుతోంది. కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పులు పెరిగిపోయి అతను ఆర్థికంగా చితికిపోతున్నాడు. ‘అప్పు పుట్టడం కూడా కష్టమవుతోందన్నా..’ అని అతను ఒక్కసారిగా భోరుమనగానే నా మనసు కదిలిపోయింది. ప్రాణాంతకంగా పరిణమించే డెంగీ, తలసీమియా వంటి వ్యాధులను కూడా ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు. దీంతో వేలాది కుటుంబాలు గుండెకోతను అనుభవించాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీని నీరుగార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రభుత్వానికి సామాన్యుల క్షోభ అర్థమయ్యేట్లుగా కనిపించడం లేదు.
చంద్రబాబుగారూ.. ఆంధ్రాలో తగిన వైద్య సదుపాయాలు లేవు. అన్ని సదుపాయాలూ ఉన్న హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో మీరు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. పేదవారెవరైనా వైద్య సహాయం అందక మరణిస్తే బాధ్యత మీది కాదా? హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తే మీకొచ్చే నష్టమేంటి? అంటే పేదల ప్రాణాలకు విలువే లేదా?

కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని, రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చి, మోసపుచ్చి, వారి ఉద్యోగాలు తీసేసి వాళ్లను రోడ్డు మీద పడెయ్యడం న్యాయమేనా? ఒక్క విషయం చెప్పండి.. మీ ప్రభుత్వం వచ్చాక కనీసం ఒక్క ఉద్యోగినైనా రెగ్యులరైజ్‌ చేశారా? అటువంటప్పుడు మాట ఎందుకు ఇచ్చారు, ఆశ ఎందుకు కల్పించారు? ఉన్న ఉద్యోగాలను తీసేయడం తప్ప అధికారంలోకి వచ్చాక మీరు చేసిందేమిటి?
- వైఎస్‌ జగన్‌

(ముద్దవరంలో బుధవారం జగన్‌కు గొంగళి వేసి గొర్రె పిల్లను బహూకరిస్తున్న అనిల్‌కుమార్‌. చిత్రంలో డోన్‌ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు