స్వామీ.. కావూరికి మంచి బుద్ధిని ప్రసాదించు

21 Dec, 2013 03:17 IST|Sakshi

 జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ :
 కేంద్ర మంత్రి పదవి రాక ముందు ఒక రకంగా.. పదవి వచ్చిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తున్న కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు మంచి బుద్ధిని ప్రసాదించమని మద్ది ఆంజనేయస్వామిని కోరినట్లు వైఎస్సార్  సీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.
 
 రాజేష్  మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే చింతలపూడి నియోజకవర్గమే ఎక్కువగా నష్టపోతుందన్నారు. తమ్మిలేరు, ఎర్ర కాలువలు పూర్తిగా ఎండిపోతాయని, రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. చింతలపూడి పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కావూరిని లోక్‌సభలో సమైక్యవాదం వినిపించాలని కోరేందుకు వెళ్లగా తమపై ఆయన తిట్ల పురాణం ఎత్తుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌చేసి విడుదల చేశారని, కావూరి అదేరోజు రాత్రి జిల్లా అధికారులతో మాట్లాడి రెండోసారి అరెస్ట్ చేయించారని చెప్పారు. ఒకే కేసుపై రెండుసార్లు ఎవరూ అరెస్టు అయిన దాఖలా లేదన్నారు. తమపై ఎన్నికేసులు బనాయించినా ఓర్చుకుంటామని, ఆయన మాత్రం సమైక్యవాదాన్ని వినిపిస్తూ ప్రాంతాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అలా చేస్తే ఆయనపై పూలజల్లు కురస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత నిర్మాణం ఉంటేనే పార్టీ విజయం సులభం అవుతుందని అన్నారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తోట చంద్రశేఖర్, మేనేజర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ బూత్ కమిటీ కన్వీనర్లు, వలంటీర్లు పోలింగ్ విధానంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనిల్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర యువజన కమిటీ సభ్యులు బీవీఆర్ చౌదరి, పట్టణ కన్వీనర్ చనమాల శ్రీనివాస్, మండల కన్వీనర్ నులకాని వీరాస్వామినాయుడు, కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయకులు తల్లాడి సత్తిపండు, పొల్నాటి బాబ్జి, రావూరి కృష్ణ, కొయ్య రాజారావురెడ్డి, కేమిశెట్టి మల్లిబాబు, రాఘవరెడ్డి ఆదివిష్ణు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు