రక్తంలో అల్యూమినియం శాతం కొద్దిగా ఎక్కువగా ఉంది

28 Oct, 2018 05:44 IST|Sakshi

     దాన్ని నియంత్రించేందుకు మందులిచ్చాం 

     కనీసం వారం పాటు విశ్రాంతి అవసరం 

     జగన్‌ను పరీక్షించిన వైద్యులు 

సాక్షి, హైదరాబాద్‌ : హత్యాయత్నం నుంచి బయటపడిన ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని.. అయితే ఆయన రక్త పరీక్షల రిపోర్టుల్లో అల్యూమినియం శాతం ఉండాల్సిన దానికన్నా కొద్దిగా ఎక్కువగా ఉందని సిటీన్యూరో సెంటర్‌ డాక్టర్‌ శివారెడ్డి వెల్లడించారు. ఆయనతో పాటుగా మరో డాక్టర్‌ బి.చంద్రశేఖరరెడ్డి శనివారం ఉదయం వైఎస్‌ జగన్‌ నివాసంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

శివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భుజానికి తగిలిన గాయాన్ని చూశామని.. చీము లాంటిదేం పట్టలేదన్నారు. ప్రస్తుతం ఆయనకు యాంటీ బయాటిక్స్, పెయిన్‌ కిల్లర్‌ మందులు ఇస్తున్నట్లు తెలిపారు. గాయం వల్ల ఏవైనా విషపూరిత పదార్థాలు వెళ్లాయా అని నిర్థారించేందుకు రక్త పరీక్షలకు పంపిన నమూనాల నివేదిక శనివారం ఉదయం తమకు అందిందన్నారు. హాని కలిగించే మేజర్‌ విషపూరిత పదార్థాలు లేవని తేలిందని తెలిపారు. అయితే రక్తంలో కొద్దిగా ఎక్కువగా ఉన్న అల్యూమినియం శాతాన్ని నియంత్రించేందుకు మందులిచ్చినట్లు చెప్పారు. శరీరంలోకి దిగబడిన కత్తి అల్యూమినియంది అయినందున రక్తంలో అల్యూమినియం పెరిగిందా.. అనేది తాము చెప్పలేమన్నారు.

సాధారణ స్థితిలో రక్తపోటు
ప్రస్తుతానికి ఆయన కనీసం వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని గట్టిగా సూచించినట్లు శివారెడ్డి వెల్లడించారు. గాయం ఇన్ఫెక్షన్‌కు గురికాకుండా ఉండాలంటే 3 నుంచి 5 రోజుల సమయం పడుతుందని, ఈ లోపే బయట తిరిగితే ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉన్నందున కదలికలు వద్దన్నట్లు తెలిపారు. చేయి కదిల్చినప్పుడు కూడా నొప్పిగా ఉంటోందని జగన్‌ అన్నారని, దానికి తాము కొన్ని సూచనలు చేశామన్నారు. ఆయన రక్తపోటు సాధారణ స్థితిలో ఉందని డాక్టర్‌ శివారెడ్డి వివరించారు.  

మరిన్ని వార్తలు