అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ బాధ్యత

27 Dec, 2019 04:58 IST|Sakshi

అందువల్ల ఒకేచోట భారీగా ఖర్చు పెట్టడం కుదరదు

రాజధాని పేరుతో రూ.1.09 లక్షల కోట్లు ఖర్చు పెడితే.. వడ్డీలకే భారీగా చెల్లించాలి

చంద్రబాబు రాష్ట్రాన్ని దివాలా తీయించారు.. అప్పులకే భారీగా చెల్లిస్తున్నాం

రాజధానిపై ప్రభుత్వ నిర్ణయానికి మేం కట్టుబడి ఉంటాం

అమరావతి రైతులకు జగన్‌ అన్ని విధాలా న్యాయం చేస్తారు

కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల వెల్లడి

రాజధాని అంశంపై సీఎం క్యాంప్‌ ఆఫీసులో సమావేశం

సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా పూర్తిగా దివాలా తీయించారని, ఇలాంటి పరిస్థితుల్లో రాజధానిపై రూ.1.09 లక్షల కోట్లు ఖర్చుపెట్టడం సాధ్యం కాదని కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని వారు పేర్కొన్నారు. రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు, తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గురువారం సాయంత్రం  తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వారు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఒకే చోట భారీగా ఖర్చు పెట్టే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదని, రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా జగన్‌ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.  
 
కృష్ణా, గుంటూరు అభివృద్ధి ఢోకా ఉండదు

మాజీ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. రాజధాని పేరుతో ఒకే చోట రూ.1.09 లక్షల కోట్లు ఖర్చు చేసే పరిస్థితి లేదని చెప్పారు. ‘అన్ని ప్రాంతాల అభివృద్ధితో పాటు రైతులు, విద్యార్థులు, పేద వర్గాల కోసం ఉద్దేశించిన పథకాల అమలు, సాగునీటి ప్రాజెక్టులు నిరి్మంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సి ఉండడంతో.. రాజధానిపై వ్యయం తగ్గించి ఇతర రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధికి ఎలాంటి ఢోకా ఉండదు. ఈ ప్రాంతాన్ని సాఫ్ట్‌వేర్‌ హబ్‌గా, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం’ అని చెప్పారు. రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగ యువత సంతృప్తి చెందేలా జగన్‌ నిర్ణయం ఉంటుందని చెప్పారు.  
 
కేంద్రం రూ.1.09 లక్షల కోట్ల సాయం చేస్తుందా?
జీఎన్‌రావు కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని దివాళా తీయించడంతో.. ఇప్పటికే అప్పులపై భారీ మొత్తంలో వడ్డీ కడుతున్నామని, రాజధాని నిర్మాణం కోసం మరో రూ 1.09 లక్షలకోట్లు అప్పులు చేసి ఆ వడ్డీల్ని కూడా కట్టే పరిస్థితుల్లో రాష్ట్రం లేదని అన్నారు. ఇప్పటికే చంద్రబాబు రాజధానిపై రూ.5,800 కోట్లు వ్యయం చేశారని, ఇంకా 20 రెట్లు వెచి్చంచే పరిస్థితి లేదని చెప్పారు. రాజధాని పేరుతో చంద్రబాబు ఇంతవరకూ ఏర్పాటు చేసింది ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని.. దీని అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్లు కావాలన్నారు. జగన్‌ తీసుకోబోయే నిర్ణయం ఏ ఒక్కరిపైనే కక్షతో కాదని చెప్పారు. డబ్బులుంటే ఎంత పెద్ద నగరాలైనా నిర్మించవచ్చని, ఆరి్థక పరిస్థితి బాగోలేనప్పుడు అది సాధ్యం కాదన్నారు. రాజధాని బాధ్యత కేంద్రానిదైనా.. రూ 1.09 లక్షల కోట్లు సాయం చేస్తుందా? అని ఆయన ప్రశి్నంచారు.
 
ఒక కులం, ప్రాంతం మీద కక్షతో కాదు

ఒక కులం, ప్రాంతం మీద కక్షతో ఈ నిర్ణయం తీసుకోలేదని, అభివృద్ధి వికేంద్రీకరణ ఎజెండాతో జగన్‌ ముందుకు వెళ్తున్నారని మరో ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ నిర్ణయం వల్ల రైతులకు నష్టం జరగదని, అవసరమైతే వారితో చర్చించి సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. రాజధాని ఏర్పాటు విషయంలో జగన్‌కు ఎలాంటి స్వార్థం లేదని.. అలా ఉంటే రాయలసీమకో... దొనకొండ ప్రాంతానికో తరలించుకెళ్లి ఉండేవారన్నారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలనే దిశగానే ఆయన పయనిస్తున్నారని చెప్పారు.

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. రాజధాని కోసం సమీకరించిన 33 వేల ఎకరాల్ని రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో ఉందని.. తప్పకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, బొత్స సత్యనారాయణ, రంగనాథరాజు, మేకతోటి సుచరిత, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, శాసనమండలిలో చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.     

మరిన్ని వార్తలు