వైఎస్‌ అంటే కడుపుమంట ఎందుకు?

19 Jul, 2019 04:08 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

సాక్షి, అమరావతి : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే చంద్రబాబుకు అంత కడుపు మంట ఎందుకో తనకు అర్థంకావడంలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గురువారం నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల గురించి చంద్రబాబు  ప్రస్తావిస్తూ చర్చను పక్కదారి పట్టించేందుకు రహదారుల్లో విగ్రహాల గురించి మాట్లాడారు. అంబేద్కర్‌ విగ్రహాలు ఉన్నాయని, అంబేద్కర్‌ను అవమానిస్తారా? అంటూ మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు జోక్యం చేసుకుని.. ‘చంద్రబాబు మర్రివృక్షమంత మనిషే మేం కాదనం. బాబు అక్రమ భవనం నుంచి చర్చను పక్కదారి పట్టించేందుకు ఆయన ఉద్దేశపూర్వకంగా విగ్రహాల గురించి, వైఎస్‌ విగ్రహాల గురించి మాట్లాడుతున్నారు. ఇలా సానుభూతి పొందాలనుకోవడం సమంజసం కాదు’.. అని అన్నారు. ఎప్పుడూ చట్టాలను అతిక్రమించను, సభా సంప్రదాయాలు, డెమోక్రసీ అంటూ చంద్రబాబు లేని నీతులు చెబుతుంటే తన రక్తం మరుగుతోందని అంబటి ఎద్దేవా చేశారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం జనం రూ.5, రూ.10 వేసుకుని వాడవాడలా విగ్రహాలు పెట్టుకున్నారని, విజయవాడలో చంద్రబాబు వెళ్లే దారిలో ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని చూడటం ఇష్టంలేకే దానిని ఈ పెద్దమనిషి తొలగించారు’ అని అంబటి దుయ్యబట్టారు.   

సభ పావుగంట వాయిదా
ఏపీ శాసనసభలో గురువారం ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే 15 నిమిషాల పాటు సభ వాయిదా పడింది. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉండగా మంత్రులు ఆలస్యంగా రావడంతో 9.02 గంటలకు సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. 9.03 గంటలకు మంత్రులంతా సభలోకి ప్రవేశించారు.  

మరిన్ని వార్తలు