అంబేద్కర్‌ రాజ్యాంగం చెడ్డదవుతుంది : చంద్రబాబు

14 Apr, 2018 15:49 IST|Sakshi

ప్రత్యేక హోదాపై మళ్లీ మాట మార్చిన ఏపీ సీఎం

సాక్షి, అమరావతి: ‘‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు?’’ అని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తననుతాను దళితోద్ధారకుడిగా ప్రకటించుకునే ప్రయత్నం చేశారాయన. శనివారం అమరావతిలో జరిగిన అంబేద్కర్‌ జయంతి వేడుకలో మాట్లాడిన సీఎం.. ఏపీకి ప్రత్యేక హోదాపైనా మరోసారి మాటమార్చారు.

అప్పుడు రాజ్యాంగమే చెడ్డదవుతుంది : గడిచిన నాలుగేళ్లుగా రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా పాలన సాగిస్తోన్న చంద్రబాబు నాయుడు అదే రాజ్యాంగం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం మంచిదే కావచ్చు, కానీ దానిని అమలు చేసేవాళ్లు చెడ్డవాళ్లతై అంబేద్కర్‌ రాజ్యాంగమే చెడ్డదవుతుంది’’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లోగా 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాన్ని చేస్తామని, దళితుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు.

25 ఎంపీ సీట్లిస్తే హోదా తెస్తా : ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు, టీడీపీ ఎంపీలు ఇన్నాళ్లూ చేసినవన్నీ డ్రామాలేనని తేలిపోయింది. ఎంపీలతో రాజీనామాలు చేయించి కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిదిపోయి.. ‘‘వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లలో టీడీపీని గెలిపిస్తే ప్రత్యేక హోదాను తీసుకొస్తా’’ అని వ్యాఖ్యానించడం ద్వారా హోదా విషయంలో బాబు మరో యూటర్న్‌ తీసుకున్నట్లైంది. 2019ఎన్నికల తర్వాత టీడీపీ ఎవరికి మద్దతిస్తే వారే కేంద్రంలో అధికారంలోకి వస్తారని, ఆ విధంగా ఢిల్లీలో తాను చక్రం తిప్పుతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

మోదీ తరహాలో బాబు ఒక్కరోజు దీక్ష : విపక్షాలు పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకున్నందుకు నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన తరహాలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. అంబేద్కర్‌ జయంతి కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. ‘‘పార్లమెంట్‌ జరగనీయకుండా చేసిన మోదీనే మళ్లీ దీక్ష చేశారు. ఇదెక్కడి విడ్డూరమో నాకు అర్థం కాలేదు. కేంద్రం వైఖరికి నిరసనగా నేనూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తా. ఈ నెల 20న నా పుట్టినరోజునాడే దీక్షకు కూర్చుకుంటా. నా దీక్షకు అందరి సహకారం కావాలి’’ అని సీఎం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు