‘జగనన్న అమ్మఒడి’ 9న ప్రారంభం

1 Jan, 2020 04:06 IST|Sakshi

పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు 

1 నుంచి ఇంటర్‌ వరకు పేద విద్యార్థులందరికీ వర్తింపు

రాష్ట్రంలోని స్కూళ్లు 61,271 కాలేజీలు 3,083

ఇప్పటి వరకు అర్హులుగా గుర్తించిన తల్లులు/ సంరక్షకులు 42,80,823

ఇంకా పరిశీలన కొనసాగుతున్నతల్లులు/ సంరక్షకులు 13,37,168

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం జనవరి 9వ తేదీన ప్రారంభం కానుంది. పిల్లలను పాఠశాలలకు పంపించే ప్రతి నిరుపేద తల్లికి ఈ పథకం కింద ఏటా రూ.15 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. పిల్లలను బాగా చదివించాలన్న ఆశ, ఆకాంక్ష ఉన్నప్పటికీ.. ఆర్థిక స్తోమత లేక నిరుపేద తల్లిదండ్రులు పిల్లలను బడులకు పంపించలేకపోతున్నారు. తమతో పాటు వారిని పనులకు తీసుకువెళ్లడమో, ఎక్కడైనా పనుల్లో చేర్చడమో చేస్తున్నారు. దీంతో ఏళ్ల తరబడి నిరుపేద వర్గాల పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. ఇలాంటి పరిస్థితులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూశారు.

ఈ పరిస్థితిని మార్చడానికి పిల్లలను బడులకు పంపే ప్రతి నిరుపేద తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడమే కాకుండా, అధికారంలోకి రాగానే తొలి బడ్జెట్లోనే ఈ పథకానికి రూ.6,455 వేల కోట్లు కేటాయించారు. తొలుత జనవరి 26 నుంచి ఈ పథకం ప్రారంభించేలా షెడ్యూల్‌ ప్రకటించినా, దానిని ముందుకు జరిపి జనవరి 9వ తేదీకి మార్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 9న ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్రంలోని అర్హులైన లక్షలాది మంది తల్లులకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులు/సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది.

4 నుంచి 8 వరకు అవగాహన కార్యక్రమాలు
మార్కాపురం: ‘జగనన్న అమ్మ ఒడి’ పథకానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో జనవరి 4 నుంచి 8 వరకు తల్లిదండ్రులు, పేరెంట్స్‌ కమిటీల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. అమరావతి నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీవో కార్యాలయం నుంచి మంత్రి హాజరయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జనవరి 4న అమ్మ ఒడి, 6న మధ్యాహ్న భోజన పథకం అమలు, 7న ఇంగ్లిష్‌ మీడియం బోధన, ఆవశ్యకత, ఉపాధ్యాయులకు శిక్షణ, 8న మన పాఠశాల నాడు–నేడు అమలు, పాఠశాలల్లో వచ్చే మార్పులపై అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. సంక్రాంతి తరువాత మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు చేస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.200 కోట్లను అదనంగా కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి నుంచి రూ.10 వేలు, రూ.5 వేలు, రూ.3 వేల చొప్పున ఇచ్చే ప్రత్యేక పింఛన్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసే కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. తలసేమియా, లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్, క్రానిక్‌ కిడ్నీ, పెరాలసిస్‌ తదితర సమస్యలతో బాధపడుతున్న లబ్ధిదారులకు ప్రత్యేక పింఛన్లు అందజేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు