‘అభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలకపాత్ర’

19 Nov, 2013 01:33 IST|Sakshi

నూజివీడు, న్యూస్‌లైన్ : భారతదేశ ఆర్థికాభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలకపాత్ర పోషిస్తోందని కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డీ సూర్యచంద్రరావు తెలిపారు. నూజివీడులోని ధర్మ అప్పారావు కళాశాలలో వాణిజ్యశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘భారత బ్యాంకింగ్ రంగంలో మార్పులు - పరిణామాలు - ఎదురయ్యే సమస్యలు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సెమినార్ సోమవారం కళాశాల ఆడిటోరియంలో ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిజిస్ట్రార్ మాట్లాడుతూ రాబోయే రోజులలో బ్యాంకింగ్ రంగంలో చాలా అధునాతన మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. రానున్న కాలంలో విదేశీ బ్యాంకులు కూడా కుప్పలుతెప్పలుగా దేశంలోకి ప్రవేశించనున్నాయన్నారు. ఈ సెమినార్‌కు కీలకోపన్యాసకులైన పాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య జీ ఆంజనేయస్వామి మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలు ప్రతి సామాన్యుడికి అందినప్పుడే వాటి లక్ష్యాలు నెరవేరతాయన్నారు.

బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేటు రంగంలో వస్తున్న బ్యాంకుల వల్ల ప్రస్తుతం దేశంలో ఉన్న బ్యాంకింగ్ రంగం  తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోబోతోందన్నారు. రాబోయే కాలంలో యువతకు బ్యాంకింగ్ రంగంలో వేలాది ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సెమినార్‌లో రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుంచి వచ్చిన 42 మంది అధ్యాపకులు పరిశోధనా పత్రాలు సమర్పించారు. సమన్వయకర్తగా వాణిజ్యశాస్త్ర అధ్యాపకులు రాజబాబు వ్యవహరించారు.
 
ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు ఎంఎంఆర్‌వీ అప్పారావు, పీజీ కేంద్రం ప్రత్యేకాధికారి ఎంవీ బసవేశ్వరరావు, భీమవరం డీఎన్‌ఆర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ జే చంద్రప్రసాద్, ఆంధ్ర విశ్వవిద్యాలయం వాణిజ్యశాస్త్రం విశ్రాంత ఆచార్యులు కే అప్పారావు, డీఏఆర్ కళాశాల ప్రిన్సిపాల్ గొల్లు వెంకట రామారావు, విశ్రాంత ప్రిన్సిపాల్ కే రామారావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు