‘చంద్రబాబు డైరెక్షన్‌లోనే స్కిల్‌ స్కామ్‌’

20 Nov, 2023 16:52 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి:  స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ రావడంతో ఎల్లో మీడియ హడావుడి చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అసలు కోర్టు చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా చూపించకుండా ఏదో హడావుడి చేస్తూ రాజకీయ సానుభూతి సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

ఈరోజు(సోమవారం) స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘ చంద్రబాబుకు బెయిల్‌ రావడంతో ఎల్లో మీడియా హడావుడి చేస్తోంది.​కోర్టు చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా చూపించడం లేదు. ఎల్లో మీడియా ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తోంది. స్కిల్‌ స్కామ్‌తో సంబంధం లేదని చంద్రబాబు నిరూపించుకోవాలి. రాజకీయ సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఎలా జరిగిందో ఆధారాలున్నాయి. ఆధారాలన్నీ సీఐడీ తరపు లాయర్లు కోర్టులో సమర్పించారు.

ప్రజల సొమ్మును షెల్‌ కంపెనీల పేరుతో దోచేశారు. షెల్‌ కంపెనీల పేరుతో అవినీతి జరిగింది. ఫేక్‌ ఇన్వాయిస్‌లతో రూ. 241 కోట్లు దోచేశారు. కిలారి రాజేశ్‌, పెండ్యాల శ్రీనివాస్‌లకు నోటీసులిచ్చారు. ఐటీ శాఖ నోటీసుల్లో అన్ని లింకులు బయటపడ్డాయి. చంద్రబాబు డైరెక్షన్‌లోనే స్కిల్‌ స్కామ్‌ జరిగింది. వివిధ స్టేజీల్లో స్కిల్‌ స్కామ్‌ ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు పెట్టారు. ఏ రోజు కూడా స్కిల్‌ స్కామ్‌ జరగలేదని చంద్రబాబు లాయర్లు వాదించలేదు. గంటా సుబ్బారావును ఐదు పదవుల్లో కూర్చోబెట్టారు. నిధులు దారి మళ్లాయని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. చంద్రబాబు త్వరలో విజయయాత్ర చేస్తామంటున్నారు. అనారోగ్యం ఉంటే విజయయాత్ర ఎలా చేస్తారు?’ అని ప్రశ్నించారు.

బెయిల్ వచ్చినంత మాత్రాన అంతా అయిపోలేదు
సీఎం నిధులు విడుదల చెయ్యమంటేనే చేశామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశాడు. అందుకే చంద్రబాబు పాత్ర ఈ కేసులో దొరికింది. 73 ఏళ్ల ముసలాయన కాబట్టి బెయిల్ ఇమ్మని అడిగారు. బెయిల్ కోసం గుండె జబ్బు నుండి చాలా రోగాలు చూపించారు. బెయిల్ వచ్చినంత మాత్రాన అంత అయిపోలేదు.

చంద్రబాబు లోపల ఉన్నా ఒకటే..బయట ఉన్నా ఒకటే. చంద్రబాబు బయట ఉంటే 2014 నుండి 2019 వరకు ఏం చేశాడో చెప్పాల్సి వస్తుంది. ఈ కేసులో చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదు.ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయి..విచారణ ఎదుర్కోక తప్పదు. దేశంలోనే ఓ ప్రముఖ కేసుగా ఈ స్కామ్ కేసు ఉంది. హైకోర్టు కేవలం బెయిల్ మాత్రమే ఇచ్చింది.అరెస్ట్ అయినప్పుడు నుండి కేసు కోసం చంద్రబాబు మాట్లాడట్లేదు.ఇదొక్కటే కాదు ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం కేసులు ఎదుర్కోవాల్సిందే’ అని సజ్జల తెలిపారు.

మరిన్ని వార్తలు