సమైక్యాంధ్రకు మద్దతివ్వండి: జయప్రకాశ్ నారాయణ్

18 Oct, 2013 02:59 IST|Sakshi
సమైక్యాంధ్రకు మద్దతివ్వండి: జయప్రకాశ్ నారాయణ్

 సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్‌కు సంఘీభావం ప్రకటించాలని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక కోరింది. వేదిక సమన్వయకర్త వి.లక్ష్మణరెడ్డి, నేతలు ఆతుకూరి ఆంజనేయులు, వి. రామకృష్ణ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం లోక్‌సత్తా కార్యాలయంలో జేపీని గురువారం కలిసింది. ఈ సందర్భంగా సమైక్యాంధ్రప్రదేశ్ ను కొనసాగించాల్సిన ఆవశ్యకతను పరిరక్షణ వేదిక జేపీకి వివరించింది. అనంతరం లక్ష్మణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ అనుమతి, తీర్మానం లేకుండా విభజన సరికాదనే అభిప్రాయాన్ని జేపీ వ్యక్తం చేశారన్నారు. తరువాత జేపీ మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై ఢిల్లీ పెద్దలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. తెలుగువారికి సంబంధించిన నిర్ణయం తెలుగునేలపైనే జరగాలన్నారు. సామరస్య, సమగ్ర తెలంగాణ లేదా సమైక్యాంధ్రప్రదేశ్ కావాలన్నారు.
 
 సీబీఐ చర్యపై సీవీసీకి లేఖ రాస్తా: జేపీ
 గనుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌ను నిందితుడిగా సీబీఐ పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు లేఖ రాయనున్నట్లు జయప్రకాశ్ నారాయణ్ వెల్లడించారు. లోపభూయిష్టమైన ప్రభుత్వ నిబంధనలను సవరించకుండా వాటికి అనుగుణంగా పనిచేసిన పరేఖ్‌పై కేసు పెట్టడం సరికాదన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో జేపీ మీడియాతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు