కోవిడ్‌ భయం వద్దు

15 Mar, 2020 03:36 IST|Sakshi

వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు

57 నమూనాలకు కోవిడ్‌ లేదని నిర్ధారణ

మరో 12 నివేదికలు రావాల్సి ఉందన్న వైద్య, ఆరోగ్య శాఖ

అందరికీ మాస్క్‌లు అవసరం లేదని.. జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వెల్లడి

విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు సర్వే

ఇప్పటివరకు 6 వేల మంది రాష్ట్రానికి వచ్చినట్లు గుర్తింపు

సాక్షి, అమరావతి: కరోనా (కోవిడ్‌–19) వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను మరింత ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఎక్కడా ఆందోళనకర పరిస్థితి లేదని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 70 అనుమానిత కేసులు నమోదు కాగా.. 57 కేసులకు సంబంధించిన పరీక్షల్లో కరోనా లేదని నిర్ధారణ అయినట్లు తెలిపింది. మరో 12 నమూనాలకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉందని, నెల్లూరులో ఒక కేసు మాత్రమే పాజిటివ్‌గా నమోదైందని వెల్లడించింది. కడపలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్‌)లో ఈనెల 13న చేర్పించిన వృద్ధురాలికి కరోనా లేదని తేలిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.గిరిధర్‌ వెల్లడించారు.  

విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు సర్వే
–విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించేందుకు ప్రతి జిల్లాలోనూ వైద్య, ఆరోగ్య శాఖ సర్వే చేపట్టింది.
– ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి శనివారం నాటికి 1.20 కోట్ల కుటుంబాలను సర్వే చేశారు. 
– ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు 6 వేల మంది వరకూ ఉన్నట్టు గుర్తించారు. మరో రెండు రోజులపాటు సర్వే కొనసాగుతుంది. 
– సర్వే ద్వారా గుర్తించిన వారిలో ఎక్కువ మంది దుబాయ్‌ నుంచి వచ్చిన వారే ఉన్నారు. 
– ఒక్క కడప జిల్లాలోనే 1,700 మంది దుబాయ్‌ నుంచి స్వస్థలాలకు చేరుకున్నారు. 
– వీరంతా 14 రోజుల పాటు ఇళ్లల్లోనే ఉండేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చింది. 
– ప్రతి జిల్లాలో నలుగురు అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసి 24 గంటలూ వైరస్‌ వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకున్నారు.

ఇంట్లో ఉంచడమే ప్రత్యేక వ్యూహం
విదేశాల నుంచి వచ్చిన వారిని బయటకు రానివ్వకుండా ఇంట్లోనే ఉంచడమే ప్రత్యేక వ్యూహంగా ముందుకెళుతున్నాం. వైరస్‌ సోకిన వారికి వైద్యం చేయడం సులభం. కానీ.. వ్యాప్తిని నిరోధించడమే ముఖ్యమైన పని. అందుకే ఈ చర్యలు తీసుకున్నాం. 
–డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ

50 ప్రత్యేక గదులు
ఈ నెల 20వ తేదీ నాటికి కరోనా వైరస్‌ లక్షణాలున్న వారి కోసం 50 ప్రత్యేక గదులు (ఐసోలేటెడ్‌ రూమ్స్‌) ఏర్పాటు చేస్తున్నాం. నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్డీఆర్‌ఎఫ్‌)కు రెండ్రోజుల శిక్షణ ఇస్తున్నాం. మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. అవగాహనతో వ్యక్తిగత శుభ్రత పాటిస్తే సరిపోతుంది.
–వి.విజయరామరాజు, ఇన్‌చార్జి కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ

అందరికీ మాస్కులు అవసరం లేదు
జనాభా మొత్తానికి మాస్కులు అవసరం లేదు. అనుమానిత లక్షణాలున్న వారికి, వైరస్‌ సోకిన వారికి, వైద్యమందించే వారికి మాత్రమే ఇవి అవసరం.  అనుమానితుల కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం 900 పడకలు సిద్ధంగా ఉంచాం.
– డాక్టర్‌ ఎ.మల్లికార్జున, సీఈఓ, ఆరోగ్యశ్రీ 

మరిన్ని వార్తలు