ఏపీలో రిజిస్ట్రేషన్ బాదుడు!

30 Jun, 2014 02:57 IST|Sakshi
ఏపీలో రిజిస్ట్రేషన్ బాదుడు!

* స్టాంపు డ్యూటీ ద్వారా రూ.1,000 కోట్ల అదనపు ఆదాయంపై కన్ను

సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువలు పెంచి తద్వారా రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని భారీగా పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. మార్కెట్ విలువలో సగానికి పైగానే ప్రభుత్వ విలువ  ఉండేలా మార్పులు చేయాలని భావిస్తోంది. సుమారు వెయ్యి కోట్ల రూపాయల అదనపు ఆదాయం లక్ష్యంగా ఈ కసరత్తు సాగుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాలు, ఆయూ ప్రాంతాల్లోని భూములు, భవనాలు, స్థలాల మార్కెట్ విలువలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు గత కొద్దిరోజులుగా సేకరిస్తున్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో భూములు, ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం తదితర నగరాలు, పట్టణాల పరిధిలో మార్కెట్ విలువలు అమాంతంగా పెరగడాన్ని గమనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచడం ద్వారా స్టాంపు డ్యూటీతో లభించే ఆదాయాన్ని భారీగా పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.

ఇదే క్రమంలో రాష్ట్రంలోని 267 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు తమ పరిధిలోని ప్రైవేటు ఆస్తుల విలువలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ర్టంలో 13 జిల్లాలకు గాను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు 15 రోజుల క్రితం రూ.4,085 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ధారించారు. తాజాగా రూ.1000 కోట్ల అదనపు ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ధారించే అవకాశం ఉందని సమాచారం. భూముల విలువ పెంపు అంశంపై సీఎం చంద్రబాబు ఒకటీరెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో భేటీ కానున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు