అంగన్ వాడీల సమ్మె యథాతథం

27 Feb, 2014 01:11 IST|Sakshi

 ప్రభుత్వంతో చర్చలు విఫలం
 10 సంఘాలతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ భేటీ
 నిర్దిష్టమైన హామీ ఇవ్వని అధికారులు
 వేతనాల పెంపుపై పట్టుపట్టిన సంఘాలు
 
 సాక్షి, హైదరాబాద్: వేతనాల పెంపు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం గత 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీల తరఫున వివిధ యూనియన్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించలేదు. అంగన్‌వాడీల సమస్యల పట్ల తాము సానుభూతితోనే ఉన్నప్పటికీ ఆపద్ధర్మ ప్రభుత్వ పాలనలో వేతనాల పెంపునకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వలేమని అధికారులు తేల్చిచెప్పడంతో సమ్మెను కొనసాగించాలనే యూనియన్లు నిర్ణయించాయి. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు రాష్ట్రవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి చొరవ  మేరకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ, కమిషనర్ చిరంజీవి చౌదరి, జాయింట్ డెరైక్టర్లు శివపార్వతి, సత్తయ్య, సరళా రాజ్యలక్ష్మి యూసఫ్‌గూడలోని కమిషనర్ కార్యాలయంలో యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, వైఎస్‌ఆర్‌సీపీ, ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీ వంటి రాజకీయపార్టీల అనుబంధ యూనియన్‌లతో పాటు గోదావరి, అక్కా, తెలంగాణ ఐసీడీఎస్ ఫోరం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సకల ఉద్యోగుల సంఘం, మందకృష్ణ మాదిగ  ప్రతినిధులు హాజరయ్యారు. చర్చల్లో ముఖ్యాంశాలు..  
 
  వేతనాల పెంపునకు స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని సీఐటీయూ తరఫున హాజరైన సాయిబాబు, రోజాలు ప్రభుత్వాన్ని కోరారు.
  ఆపద్ధర్మ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని, ఈ సందర్భంగా తాము వేతనాల పెంపుపై సరైన నిర్ణయం తీసుకోలేమని అధికారులు తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ ఇప్పటికే ముఖ్యమంత్రికి, ఆర్థిక శాఖకు పంపించామని అక్కడి నుంచి రాగానే నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు.
  అయితే నిర్దిష్టమైన హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని సీఐటీయూ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఆందోళనలు కొనసాగించడం సబబుకాదని ఏఐటీయూసీ తరఫున ప్రతినిధులు చంద్రశేఖర్‌రావు, విజయలక్ష్మి, కరుణకుమారి తదితరులు అభిప్రాయపడ్డారు.
  అంగన్‌వాడీలతో సంబంధం లేకుండా కొన్ని యూని యన్‌లు తమ ప్రయోజనాల కోసం సమ్మెను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ ఐసీడీఎస్ ఫోరం ప్రతినిధి రవికుమార్, సకల ఉద్యోగుల సంఘం ప్రతినిధి సి. శ్రీనివాస్‌రావు, అక్కా అంగన్‌వాడీ వర్కర్స్ అసోసియేషన్ తరఫున అనసూయ, గోదావరి సంఘం సభ్యులు వ్యతిరేకించారు.
  అయితే పరిస్థితులను బట్టి తగిన నిర్ణయం తీసుకోవాలని, అప్పటివరకు సమ్మెను కొనసాగించాలని అన్ని యూనియన్‌లు నిర్ణయించాయి.
 

మరిన్ని వార్తలు