రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌కు మరో రూ.21.95 కోట్లు

29 Jan, 2019 04:05 IST|Sakshi

సీఎం రమేష్‌ సంస్థకు అదనపు చెల్లింపులకు సర్కారు ఆమోదం

ఉత్తర్వులు జారీ చేసిన జలవనరుల శాఖ

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లో మట్టి పనులకు అ‘ధనం’

ఇప్పటికే కాంక్రీట్‌ పనుల్లో అదనంగా చెల్లించిన మొత్తం రూ.122.75 కోట్లు 

సాక్షి, అమరావతి: రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థకు కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లో మట్టి పనులకు అదనంగా రూ.21.95 కోట్లు ఇవ్వడానికి ఆమోదం తెలుపుతూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కాంక్రీట్‌ పనుల్లో రూ.122.75 కోట్లను సీఎం రమేష్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇచ్చేయడం గమనార్హం. వాస్తవానికి కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ అలైన్‌మెంట్‌ను మార్చడం వల్ల కాలువ పొడవు 20 కి.మీలు తగ్గింది. ఆ మేరకు బిల్లుల్లో కోత పెట్టాల్సిన ప్రభుత్వం, ఆ పని చేయకపోగా అదనంగా రూ.144.7 కోట్లు కట్టబెట్టడంపై అధికారవర్గాలే నివ్వెరపోతున్నాయి.

సీఎం చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంకు హంద్రీ–నీవా రెండో దశలో పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి కృష్ణా జలాలను తరలించడానికి రూ.403.65 కోట్లతో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులకు 2015లో టెండర్లు పిలిచారు. పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌లో 207.8 కి.మీ నుంచి 143.9ల కి.మీ పొడవు ఈ కెనాల్‌ తవ్వాలి. రూ.207 కోట్లతో పూర్తయ్యే ఈ పనుల అంచనాను రూ.403.65 కోట్లకు పెంచేసి టెండర్‌ పిలిచిన ప్రభుత్వం.. 4 శాతం అదనపు (ఎక్సెస్‌) ధరలకు, అంటే రూ.430.26 కోట్లకు కోట్‌ చేస్తూ.. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రా–కోయా–హెచ్‌ఈఎస్‌ (జేవీ) దాఖలు చేసిన సింగిల్‌ బిడ్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించేసింది. అయితే ఉత్తినే రూ.223 కోట్లు మిగలనుండటంతో ఈ పనులపై సీఎం రమేష్‌ కన్ను పడింది. అంతే.. సీఎం చంద్రబాబు ఒత్తిడి మేరకు నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులను దొడ్డిదారిన జలవనరుల శాఖ అధికారులు ఆయనకు కట్టబెట్టేశారు.

తాజాగా మరో రూ.21.95 కోట్లు
ఈ నేపథ్యంలో ఎంబాక్‌మెంట్‌ పనులకు అదనంగా రూ.91 కోట్లు చెల్లించాలంటూ రిత్విక్‌ సంస్థ మళ్లీ ప్రతిపాదనలు పంపింది. గతంలోలాగే ఎస్‌ఎల్‌ఎస్‌సీ కుదరదని చెప్పింది. ముఖ్యనేత మరోసారి జోక్యం చేసుకోవడంతో ఆ ప్రతిపాదనను నవంబర్‌ 22, 2018న బోర్డ్‌ ఆఫ్‌ చీఫ్‌ ఇంజనీర్స్‌ (బీవోసీఈ)కు పంపారు. తీవ్రస్థాయి ఒత్తిళ్లతో బీవోసీఈ రూ.21.95 ఆదనపు చెల్లింపులకు ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే జలవనరుల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మట్టి పనుల్లో అదనంగా మరో రూ.69 కోట్లు ఇవ్వాల్సిందిగా రిత్విక్‌ సంస్థ పట్టుబడుతున్నట్లు జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 

తొలుత రూ.122.75 కోట్లు
కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం 90 శాతం తవ్వకం.. పది శాతం భూమిపై గట్ల (ఎంబాక్‌మెంట్‌) నిర్మాణం ద్వారా చేయాలి. కానీ రిత్విక్‌ సంస్థ ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే డిజైన్‌ మార్చేసింది. 60 శాతం తవ్వకం, 40 శాతం ఎంబాక్‌మెంట్‌ ద్వారా కాలువ పని చేసింది. డిజైన్‌ మార్చితే సీడీవో (సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌) చీఫ్‌ ఇంజనీర్‌ ఆమోదం పొందాలి. జలవనరులు, ఆర్థిక శాఖ అనుమతులూ తప్పనిసరి. ఇవేమీ పట్టించుకోకుండా పనులు చేసిన సంస్థ.. ఎంబాక్‌మెంట్‌ ద్వారా చేసిన పనులకు, కాంక్రీట్‌ పనులకు అదనంగా రూ.213.75 కోట్లు చెల్లించాలని స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ(ఎస్‌ఎల్‌ఎస్‌సీ)కి ప్రతిపాదనలు పంపింది. అయితే గడువులోగా పనులు పూర్తి చేయలేదని, అనుమతి తీసుకోకుండానే డిజైన్‌ మార్చేశారని, అందువల్ల అదనపు బిల్లులు చెల్లించడం కుదరదనిఎస్‌ఎల్‌ఎస్‌సీ తేల్చిచెప్పింది. దాంతో ముఖ్యనేత జోక్యం చేసుకుని అదనపు బిల్లులు చెల్లించడానికి వీలుగా ఏప్రిల్‌ 16, 2018న మంత్రివర్గంలో తీర్మానం చేయించారు. దాన్ని అమలు చేస్తూ మే 3, 2018న జలవనరుల శాఖ ఉత్తర్వులు (జీవో 32)జారీ చేసింది. వాటి ఆధారంగా కాంక్రీట్‌ పనులకు రూ.122.75 కోట్లను సీఎం రమేష్‌ సంస్థకు చెల్లిస్తూ సెప్టెంబర్‌ 7, 2018న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

>
మరిన్ని వార్తలు