చుక్కల భూములపై నాకే చుక్కలు చూపిస్తున్నారు..

29 Jan, 2019 04:12 IST|Sakshi

వచ్చే నెలలో ఒకే రోజు 4 లక్షల ఇళ్లల్లో గృహ ప్రవేశం

1న రాష్ట్ర బంద్‌కు పరోక్ష మద్దతు

కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: చుక్కల భూముల విషయంలో అధికారులు బుక్‌ నాలెడ్జ్‌ను అనుసరించడం వల్లే ఇన్నాళ్లుగా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లతో సోమవారం సచివాలయం నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  చంద్రబాబు మాట్లాడుతూ చుక్కల భూముల విషయంలో గుంటూరు కలెక్టర్‌ అనుసరించిన విధానాన్నే మిగిలిన జిల్లాల కలెక్టర్లు అనుసరించాలని సూచించారు. కృష్ణా జిల్లాలో అనుసరించిన డిజిటలైజేషన్‌ విధానాల్ని అసోం సచివాలయంలో అమలు చేస్తున్నారని తెలిపారు. సాంకేతిక సమస్యలతో లేనిపోని ఇబ్బందుల్ని సృష్టించకుండా సరళమైన విధానాలతో సమస్యను పరిష్కరించాలన్నారు. చుక్కల భూముల విషయంలో నాకే చుక్కలు చూపిస్తున్నారంటూ సీఎం వ్యాఖ్యానించారు. దీనిపై అధికారులు, సీఎం మధ్య వాదోపవాదాలు సాగాయి.

ఒక దశలో ఈ విషయంలో చాలా నిరాశా నిస్పృహలకు లోనయ్యానని సీఎం అన్నారు. గృహాలకు ఇటుకల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం పథకాల్లో గుడ్లు సరఫరా చేయక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రవాణా వ్యయంతో పాటు కొన్ని నిబంధనలు విధించడంతో గుడ్ల సరఫరాకు ముందుకు రావడం లేదని కలెక్టర్లు సీఎంకు వివరించారు. దీనిపై సీఎస్‌తో సంప్రదించి ముందుకు సాగాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామం, పట్టణంలో మంచి నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.  వచ్చే నెల మొదటి వారంలో ఒకే రోజు 4 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. 

ప్రకృతి సేద్యంపై దావోస్‌లో చర్చ
ఏపీలో చేపట్టిన ప్రకృతి సేద్యంపై దావోస్‌లో చర్చ జరిగిందని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను వచ్చే నెల 2లోపు పరిష్కరించాలన్నారు. ఫెతాయ్‌ తుపాన్‌ నష్టం పరిశీలనకు ఈ నెల 31, వచ్చే నెల 1 వ తేదీల్లో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోందని, అందుకు అవసరమైన నివేదికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ నిధులను కేంద్రం విడుదల చేయడంలేదని మంత్రి లోకేశ్‌ పేర్కొనడంపై సీఎం స్పందిస్తూ అవసరమైతే ఢిల్లీ వెళ్లి ధర్నా చేయాలని, పార్లమెంట్‌లో ప్రస్తావించాలని, అవసరమైతే న్యాయస్థానాకి వెళ్లాలన్నారు. అధికారులు ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి తేవాలని ఆదేశించారు. వచ్చే నెల 1న హోదా సాధన సమితి చేపట్టిన రాష్ట్ర బంద్‌కు పరోక్ష మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు