ఏసీబీ డీజీగా కుమార్‌ విశ్వజిత్‌ బాధ్యతలు

31 May, 2019 16:22 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ఏసీబీ డీజీగా కుమార్‌ విశ్వజిత్‌ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇంటలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న విశ్వజిత్‌ను  కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. కొత్త డీజీకి కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనపై పూర్తిగా స్థాయి దృష్టి పెడతామని అన్నారు. లంచాల కోసం ప్రజలను పీడించే వారి భరతం పడతామని హెచ్చరించారు. అవినీతి నిరోధంలో ప్రభుత్వ లక్ష్యాలను నెరవేరుస్తామని విశ్వజిత్‌ స్పష్టం చేశారు. ఎవరైనా లంచాలు అడిగితే తమకు సమాచారం ఇవ్వండని.. వెంటనే స్పందిస్తామని తెలిపారు. అలాగే సమాచారం ఇచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా వారి పేర్లను గోప్పంగా ఉంచుతామని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొన్న ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఏబీ వెంకటేశ్వర రావును నూతన ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. వెంకటేశ్వర రావుకు ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే అనేక మంది ఉన్నతస్థాయి అధికారులపై బదిలీ వేటు వేసింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న ఆర్పీ ఠాకూర్‌ను గురువారం ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న సీనియర్‌ అధికారి గౌతం సవాంగ్‌ను డీజీపీగా నియమించింది. 

మరిన్ని వార్తలు