బడ్జెట్‌తో నవ సంకల్పం దిశగా..

13 Jul, 2019 11:10 IST|Sakshi

సాక్షి, కర్నూలు : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్‌పై జనం భారీ అంచనాలు.. అందులోనూ ఆర్థిక మంత్రి జిల్లాకు చెందిన నేత కావడంతో ఎన్నో ఆశలు.. ఈ నేపథ్యంలో శుక్రవారం శాసనసభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు నిధుల కేటాయించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నవరత్నాలు మెరిసేలా.. ప్రజలు మురిసేలా.. నేలమ్మ పండేలా.. రైతన్న నవ్వేలా.. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ..అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌.. బాగు బాగు అంటూ కొనియాడుతున్నారు. కరువు నేలలో కర్షకుల కన్నీళ్లు తుడిచేలా.. కృష్ణా జలాలు బీడు భూములను సస్యశ్యామలం చేసేలా.. బీసీలకు చేయూతనిచ్చేలా.. గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపేలా నిధులు కేటాయించి జనరంజక బడ్జెట్‌ అనిపించారు.   

రైతు భరోసాతో సాయం 

  • రైతులకు పంట పెట్టుబడి కోసం ఏటా మే మాసంలో రూ.12,500  చొప్పున సాయం చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబరు 15 నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతామని మంత్రి బుగ్గన ప్రకటించారు. జిల్లాలో దాదాపు 4.50 లక్షల నుంచి 5 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం దక్కనుంది. 
  • రాష్ట్ర వ్యాప్తంగా 13 శీతల గిడ్డంగులు నిర్మిస్తామని ప్రకటించారు. తొలిదశలో జిల్లాకు ఒక్కటి చొప్పున నిర్మించనున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో కూడా శీతల గిడ్డంగి నిర్మించనున్నారు.రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు బోర్‌వెల్‌ మిషన్లు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఇది కూడా రైతులకు మేలు జరిగే నిర్ణయమే. 
  • రూ.3 వేల కోట్ల కార్పస్‌ఫండ్‌తో ధరల స్థిరీకరణ నిధి, రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్య నిధి నిర్ణయాలతో కూడా జిల్లా రైతులకు మేలు జరగనుంది. పదేళ్లలో కనీసం ఏడేళ్లు జిల్లా రైతులు కరువు బారిన పడుతుంటారు.

రైతులకు వడ్డీలేని రుణాలు..   
జిల్లాలో ఏటా 4.50 లక్షల మంది రైతులు రూ.4,360 కోట్ల మేర వ్యవసాయ రుణాలు తీసుకుంటున్నారు. వీరికి వడ్డీ భారం పడకుండా రుణాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై రైతులు చెల్లించే 7 శాతం వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. జిల్లాలో సకాలంలో పంటలు పండక, రుణాలు తీర్చలేక, వడ్డీభారంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో  రైతులకు వడ్డీభారం నుంచి ఉపశమనం లభించినట్లయ్యింది. దాదాపు ఏటా రూ. 305 కోట్ల భారం తగ్గనుంది.  

వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరికి వెన్నుదన్నుగా నిలిచేందుకు మహానేత పాలనలో 421 జీవో జారీ చేశారు. అప్పుల బాధ తాళలేక రైతు కుటుంబంలో జరిగిన ఎలాంటి ఆత్మహత్య అయినా రైతు ఆత్మహత్యగా గుర్తించాలని ఆ జీవోలో పేర్కొంది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జిల్లాలో 281 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.వీరిలో కొందరికి ప్రభుత్వం అరకొర పరిహారం మాత్రమే ఇచ్చింది. పరిహారం అందని వారందరికీ ఇప్పుడు రూ.7 లక్షల చొప్పున అందజేస్తామని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది.  

అక్కచెల్లెమ్మలకు అండగా..  
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 50,691 గ్రూపులు, 5,25,259 మంది సభ్యులు ఉన్నారు. వీరికి సున్నా వడ్డీకే రుణం ఇవ్వాల్సి ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ మేరకు ప్రతి సంవత్సరం పొదుపు సభ్యులు వడ్డీతో సహా బాకీ చెల్లిస్తూ వచ్చారు. వాస్తవంగా సున్నా వడ్డీ కింద ఇచ్చిన అప్పులకు బ్యాంకులకు ప్రభుత్వమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని చెల్లించకుండా పసుపు, కుంకుమ పేరుతో ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు హడావుడి చేసిన విషయం విదితే. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొదుపు మహిళలకు సున్నా వడ్డీకే రుణం ఇచ్చేందుకు సంకల్పించారు. ఇందుకోసం బడ్జెట్‌లో 1,140కోట్లు కేటాయించగా, జిల్లాకు రూ.90కోట్ల దాకా కేటాయించే అవకాశం ఉంది.  

ఆడపడుచులకు ఆసరా  
నవరత్నాలు అమలులో భాగంగా వైఎస్‌ఆర్‌ ఆసరా ద్వారా ఈ ఉడాది ఏప్రిల్‌ 11వ తేది వరకు స్వయం సహాయక సంఘాలకు ఉన్న రుణాన్ని లెక్కిస్తారు. జిల్లాలో దాదాపు రూ.823కోట్ల రుణం ఉన్నట్లు అంచనా. ఆ మొత్తాన్ని వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించి నాలుగు వాయిదాల్లో చెల్లించేందుకు నిర్ణయించారు.  

పెరిగిన కల్యాణ కానుక  
వైఎస్‌ఆర్‌ కల్యాణ కానుక కింద ఇచ్చే ప్రోత్సాహక నగదును సీఎం జగన్‌ పెంచారు. బీసీ కులాలకు ఇప్పటి వరకు రూ.35వేలు ఇస్తుండగా దానిని రూ.50 వేలకు పెంచారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు గతంలో రూ.40వేలు ఇచ్చేవారు..ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ.1లక్షకు పెంచారు. 2019–2020 సంవత్సర కాలంలో ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకున్నారు.   

వెనుకబడిన వర్గాలకు చేయూత 
పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు బడ్జెట్‌లో కార్యరూపం దాల్చాయి. నాయీబ్రాహ్మణులు, రజకులు, ట్యాక్సీడ్రైవర్లు, టైలర్లకు దన్నుగా నిలిచేందుకు ఏడాదికి రూ.10 వేలు ఆర్థికసాయం చేయనున్నట్లు బుగ్గన ప్రకటించారు. దీంతో జిల్లాలో వేలాదిమందికి లబ్ధి చేకూరనుంది. 

హంద్రీ–నీవా ఫేజ్‌–1తో సాగునీరు 
రాయలసీమ జిల్లాలకు వరదాయిని అయిన హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలతో కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని దివంగత సీఎం వైఎస్సార్‌ ఈ ప్రాజెక్టు చేపట్టారు.ఫేజ్‌–1లో 1.98 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో 80 వేల ఎకరాల ఆయకట్టు కర్నూలు జిల్లాలో ఉంది. ఫేజ్‌–1 పనులు 2012లోనే పూర్తయినా డిస్ట్రిబ్యూటరీలు మాత్రం పూర్తి కాలేదు.

గత ఐదేళ్లూ డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్లిప్తత ప్రదర్శించింది. దీంతో కాలువలో కళ్లెదుటే నీళ్లు వెళుతున్నా ఆయకట్టుకు మళ్లించుకోలేని దుస్థితి రైతన్నలది. ఫేజ్‌–1 ద్వారా ఆయకట్టుకు నీళ్లిస్తామని బడ్జెట్‌లో ప్రకటించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. దీనివల్ల జిల్లాలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.   

మరిన్ని వార్తలు