నేడు ప్రధానితో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

12 Feb, 2020 03:10 IST|Sakshi

ప్రాజెక్టులకు నిధులు, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన ఎజెండాగా పర్యటన

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులను కేంద్రం విడుదల చేయడం, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రాజెక్టులకోసం ప్రతిపాదించిన కేటాయింపులను పెంచడం, ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల సాధన దిశగా ప్రక్రియను వేగవంతం చేయడం.. లక్ష్యాలుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో సీఎం కూలంకుషంగా చర్చించనున్నారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధనకోసం సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధాని మోదీకి ఇటీవల లేఖ రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించనున్నారు. 

వివిధ అంశాలపై ప్రధానికి నివేదన..
ప్రధానితో సీఎం భేటీ సందర్భంగా చర్చించాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఆ మేరకు పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన రూ.3,800 కోట్లకుపైగా నిధులను విడుదల చేయాల్సిందిగా మోదీని సీఎం కోరనున్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున పోలవరం ప్రాజెక్టుకోసం సవరించిన అంచనాలకు పరిపాలన ఆమోదం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు ప్రతిపాదించిన కేటాయింపులను పెంచాలని కూడా ప్రధానికి జగన్‌ నివేదిస్తారు.

ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాల్సిన ఆవశ్యకతను మరోసారి మోదీ దృష్టికి తీసుకెళతారు. విభజనతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేయాలంటే పార్లమెంటు వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చడం ఒక్కటే మార్గమని ఆయన వివరిస్తారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర సమస్యలను ప్రధానికి నివేదించి వీలైనంతగా నిధులు కేటాయించేలా సీఎం కోరనున్నారు. ప్రధానితో భేటీ అనంతరం సీఎం జగన్‌ రాష్ట్రానికి తిరుగు ప్రయాణమవుతారని అధికార వర్గాలు తెలిపాయి. 

నేడు కేబినెట్‌ భేటీ
బుధవారం ఉదయం పదిన్నరకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానంతరం సీఎం వైఎస్‌ జగన్‌ సచివాలయం నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడినుంచి ఢిల్లీకి బయల్దేరి వెళతారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం 4.10 గంటల నుంచి 6 గంటల మధ్యలో ప్రధానితో సమావేశమవుతారు. (చదవండి: మనసుతో చూడండి)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా