ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి

25 Apr, 2019 04:09 IST|Sakshi

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

మధురానగర్‌ (విజయవాడ సెంట్రల్‌): ప్రభుత్వ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌ అధినేత వేమూరి రాధాకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. వేమూరి రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో బుధవారం సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేఆర్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడిన వేమూరి రాధాకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని వెల్లడించారు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పేవరకు ఉద్యోగులు ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్‌ ప్రసారాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రం పునర్నిర్మాణానికి పని గంటలతో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉద్యోగులపై రాధాకృష్ణ వ్యాఖ్యలు అభ్యంతరకరంగానూ, అవమానకరంగానూ ఉన్నాయన్నారు. అనంతరం శ్రీలంకలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు